– పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంపై ఆవేదన
– తగిన గుర్తింపు ఇవ్వకపోతే పార్టీకి రాం రాం?
– సొంత అన్నే అణగదొక్కుతున్నారంటూ ఆవేదన
– సొంత కేడర్ బలోపేతానికి కృషి
తెలంగాణ రాష్ట్ర మహిళా సీఎం గా కవిత కానున్నారా? అంటే కవిత అనుయాయుల్లో అవుననే సమాధానాలు ఎక్కువగా వినబడుతున్నాయి. కవిత వాగ్దాటి, దూకుడు, రాజకీయ చతురత అన్ని కలగలిపి వొచ్చే ఎన్నికల్లో తెలంగాణ తొలి మహిళా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కవిత కాబోయే అవకాశాలు ఉన్నాయని కవిత సన్నిహిత వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జరిగినదంతా తమ మంచికే జరిగినట్లు వారు అభిప్రాయపడుతున్నారు. కవిత రాసిన లేఖ లీక్ కావడం ఆమెకు రాజకీయంగా కలిపొచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో తనను ఒంటరి చేసేందుకు ప్రయత్నం చేయడం.. పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిస్తూ వ్యవహరిస్తున్న తీరు పట్ల గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న కవిత తన రాసిన లేఖ లీక్ కావడం పట్ల అన్న కేటీఆర్ తనను రాజకీయంగా అణగదొక్కడానికి కుటిల ప్రయత్నం చేశారంటూ కవిత తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ లేఖ లీక్ సంగతి ఎలా ఉన్నా.. వారి కంట్లో వారే పొడుచుకొని తన రాజకీయ భవిష్యత్తుకు వారే మార్గం సుగమం చేశారని కవిత అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఈ మధ్యకాలంలో మళ్లీ దుమారం రేపుతున్నాయి. భారత రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలు “సమాజంలో అసమానతలు కొనసాగుతున్నాయి”, వంటి మాటలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయా? లేక ఇది రాష్ట్రంలో ఓ కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావానికి సంకేతమా? అనేది మరికొన్ని రోజుల్లో బహిర్గతం కానుంది. కవిత ఇటీవల మే డే సందర్భంగా కార్మిక సంఘాల నాయకులతో సమావేశంలో చేసిన వ్యాఖ్యలు మామూలుగా అనిపించినా, లోతైన రాజకీయ సంకేతాలను ఇస్తున్నాయి. “సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం అవసరం” అన్న వ్యాఖ్య, ప్రస్తుత పాలనలో సామాజిక న్యాయం లేదన్న అభిప్రాయాన్ని తెలిపింది. గత నెల 27న హన్మకొండలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో లోటుపాట్లను వివరిస్తూ కవిత తన తండ్రికి లేఖ రాయడం వెనుక సమస్యను ముఖాముఖిగా తన తండ్రికి చెప్పేందుకు అవకాశం ఇవ్వడం లేదన్న భావన వ్యక్తం అవుతోంది. కేసిఆర్ కూతురు కవితకే ముఖాముఖిగా కలిసి సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి వున్నప్పుడు మిగతా నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఏమిటన్నది పార్టీ వర్గాల్లో చర్చ నీయాంశంగా మారింది.
భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఆమె పార్టీకి సముచిత ప్రాధాన్యం ఇవ్వకపోతే కొత్త పార్టీ స్థాపనపై ఆలోచన చేస్తున్నారనే ఊహాగానాలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, మరియు భవిష్యత్తు రాజకీయాల పై విశ్లేషణ…
ఇదే విషయాన్ని కూడా లేఖలో ఎమ్మెల్సీ కవిత ప్రస్తావించింది. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ క్రియాశీలకంగా వ్యవహరించడం, పార్టీ అధినేత కేసిఆర్ ఫామ్ హౌస్ లోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం పట్ల గత కొంతకాలంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో అంతర్గతంగా చర్చ కొనసాగుతున్నది. పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, నాయకులకు సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వకపోవడం, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న కుమ్ములాటలకు చెక్ పెట్టకపోవడం, పార్టీలో సమస్యలను వినే నాథుడు లేకపోవడం పట్ల కొంతకాలంగా పార్టీలో రగులుతున్న అసంతృప్తి జ్వాలలను ఈ లేఖ బహిర్గతం చేసిందని పార్టీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి. దీంతోపాటు కేసీఆర్ తన రాజకీయ వారసుడుగా కేటీఆర్ కు ప్రాధాన్యత ఇవ్వడం, కుమార్తె కవితకు ప్రాధాన్యత తగ్గిస్తూ పోవడం పట్ల ఆమె గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం అంతటికి తన అన్న కేటీఆరే కారణమన్న భావన కవిత తన సమీప సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం ఎంతగానో కృషి చేస్తున్న తననే పక్కన పెడితే, మిగతా వారి సంగతి ఏంటన్న ప్రశ్నను పలుమార్లు వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. తనకు రాజకీయ ప్రాధాన్యతను తగ్గించేలా కుట్రపూరితంగా లేఖను బహిర్గతం పరచడం వెనుక ఇంతలా దిగజారి వ్యవహరించడం పట్ల ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.
తన అన్న చేసిన కుటిల కుట్రకు తాను సమాధానం చెప్పే రోజులు ముందు ఉన్నాయని ఆమె తన సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసింది. పార్టీలో తనకు సముచిత ప్రాధాన్యమిస్తే సరేనని.. లేకపోతే పార్టీకి బై బై చెప్పి కొత్త పార్టీ పెట్టే యోచనలో కవిత ఉన్నట్లుగా సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. 2028 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు కొద్దికాలం ముందు నుండి తన ప్రయత్నాలను మరింత ముమ్మరంగా కొనసాగించవచ్చని అభిప్రాయం కవిత సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తన తండ్రికి ఇటీవల రాసిన లేఖ లీక్ అవడం తదితర పరిణామాలపై ఇప్పటి వరకు కూడా తనతో సమాలోచన చేయకపోవడం పట్ల వేచి చూసే ధోరణిని కవిత అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. ఈలోగా తన పట్టు సడలకుండా తెలంగాణ జాగృతి సంస్థ తో పాటు వివిధ కార్మిక సంఘాలకు అధ్యక్షులుగా ఉన్న కవిత ఆయా సంఘాలను బలోపేతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. బీఆర్ఎస్ లో సముచిత ప్రాధాన్యం ఇవ్వకుండా ఇలాగే వ్యవహరిస్తే వొచ్చే ఎన్నికల వరకు తన సత్తా చూపించేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిస్తూ అగౌరవంగా వ్యవహరించిన తీరుపట్ల చాలాకాలం పాటు ఓపిక పట్టానని, ఇంకెంతకాలం ఓపిక పట్టాలని బిఆర్ఎస్ శ్రేణులకే కవిత బహిరంగంగా ప్రశ్న వేయనున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి మంచోడే అయినా, తన అన్న కేటీఆర్ వ్యవహరిస్తున్న తీరు పట్ల బి.ఆర్.ఎస్ శ్రేణులు ఆలోచించుకోవాలని వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా, అది రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పేలా ఉంటాయి. సముచిత ప్రాధాన్యం ఇస్తే సరే.. లేదంటే అని, పార్టీకి అల్టిమేటం జారీ చేయడం పట్ల కవితకు రాజకీయ భవిష్యత్తు పైన బలమైన ఆత్మవిశ్వాసం కలిగి ఉందని, అదే సమయంలో బీఆర్ఎస్ లో తన పాత్ర పట్ల అసంతృప్తి కూడా ఉన్నదన్న భావన కలిగిస్తోంది. ఇది కేవలం తన బలం గుర్తించాలన్న ఒత్తిడి వ్యూహమా? లేక నిజంగా పార్టీ విడిచి కొత్త దారి వెతకడమే లక్ష్యమా? అనేది రానున్న రోజుల్లో తేటతెల్లమయ్యే అవకాశం ఉంది.





