నేడు తెలంగాణ భాషా దినోత్సవం

ప్రముఖ రచయిత్రి రమాదేవికి కాళోజీ పురస్కారం

 ప్రముఖ రచయిత్రి, కార్టూనిస్ట్, ‌కాలమిస్ట్ శ్రీ‌మతి నెల్లుట్ల రమాదేవి నేడు కాళోజీ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 9‌వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవాన్ని ప్రతీఏటా నిర్వహిస్తున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ‌ప్రభుత్వం నారాయణరావు జన్మదినాన ప్రముఖ సాహితీ వేత్తలకు కాళోజీ పేరున పురస్కారాన్ని అందజేయాలని సంకల్పించింది. అప్పటినుండి క్రితం సంవత్సరం వరకు వరుసగా పదిమంది సాహితీవేత్తలకు ఈ పురస్కారాన్ని అందజేశారు. రాష్ట్ర రాజధానిలోని రవీంద్ర భారతిలో జరిగే ఈ కార్యక్రమంలో ఆవార్డు గ్రహీతలకు లక్షా నూట పదహారు రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తూ వస్తున్నది. ప్రముఖ రచయిత, సాహితీ విమర్శకుడు అమ్మంగి వేణుగోపాల్‌ ‌మొదటిసారిగా 2015లో ఈ అవార్డును అందుకున్నారు.

ఆ తర్వాత సంవత్సరం 2016లో ప్రజాకవి, రచయిత, గాయకుడు గోరటి వెంకన్న, 2017 డాక్టర్‌ ‌సీతారం, 2018లో ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత అంపశయ్య నవీన్‌ అం‌దుకున్నారు. అలాగే ప్రముఖ కవి, రచయితలు కవి కోట్ల వెంటేశ్వర్‌రెడ్డి(2019), రామా చంద్రమౌళి(2020)లో కాళోజీ పురస్కారాలను పొందారు. వరంగల్‌కే చెందిన మరో కవి, రచయిత పెన్నా శివరామకృష్ణ 2021లో, ప్రముఖ చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్‌ 2022‌లో కాళోజీ పురస్కారంతో సన్మానించబడ్డారు. ప్రముఖ గేయ రచయిత జయరాజ్‌ 2023‌లో ఈ పురస్కారాన్ని అందుకోగా, ప్రముఖ సాహితీవేత్త నలిమెల భాస్కర్‌ 2024‌లో కాళోజీ పురస్కారాన్ని పొందారు. 2025కుగాను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అందెశ్రీ కమిటీ నెల్లుట్ల రమాదేవి ని ఎంపిక చేశారు. నేడు కాళోజీ జయంతిని పురస్కరించుకుని ఆమెను రవీంద్రభారతిలో కాళోజీ పురస్కారంతో సన్మానించనున్నారు.

పలుకుబడుల భాష :
కాళోజీ ఎట్టి పరిస్థితిలోనూ మాతృభాషను విస్మరించరాదని చెప్పేవాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘నాది బడిపలుకుల భాష కాదు.. పలుకుబడుల భాష’ అనేవాడు. ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. కాని ఆ మోజులో మాతృభాషను విస్మరించరాదన్నదే తన తపనగా కాళోజీ చెప్పేవాడు. సమాజంలో నేడు ఆంగ్ల భాషపై వ్యామోహం పెరిగిపోయింది. కమ్యూనికేషన్‌ అన్నది ప్రధానం. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నదన్న విషయం తెలుసుకోవాలన్నా, విద్యా వైజ్ఞానిక జ్ఞానానికి ఆంగ్లం తప్పనిసరి అయిపోయింది. అంతమాత్రాన మాతృ భాషను పూర్తిగా విస్మరించడం తగదన్నది కాళోజీ వేదన. నేటితరం క్రమేణ తెలుగును మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని మనం అధిగమించాలి. తెలుగు భాషకు పూర్వ వైభవం రావాలి.

మన భాషను, యాసను గౌరవించుకోవాల్సి ఉంది. తరతరాలుగా భాషాయేతరుల పాలనలో మగ్గిన ఈ ప్రాంతం, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలతో పాటు భాషను సంరక్షించుకోవాల్సి ఉందంటూ ఆయన అనేక రచనల ద్వారా పేర్కొన్నారు. ‘‘ ఏ భాసరా.. నీది ఏమి వేషమురా / ఈ భాష..ఈ వేశమెవరికోసమురా../ ఆంగ్లమందున.. మాట్లాడగలుగగానే../ ఇంతగా గుల్కెదవు..ఎందుకోసమురా../ అన్ని భాసలు నేర్చి ఆంధ్రమ్మురాదంచు../ సకిలించు ఆంధ్రుడా.. చావవెందుకురా../ అంటూ ఆయన తెలుగు భాషమీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తన తండ్రి కాలంలోనే మహారాష్ట్రనుంచి వచ్చి స్థిరపడిన కాళోజీ తెలంగాణనే తన సొంత ప్రాంతంగా స్వీకరించారు.

ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలపట్ల ఆయనకు వల్లమాలిన అభిమానం. తెలంగాణ ఆంధ్ర నేతల పాలనలో తెలంగాణ భాష, యాస ఈసడింపుకు గురైందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేవాడు. సినిమాల్లో ఈ ప్రాంతం వారి భాషను కేవలం రౌడీలకు, పనివారికే పరిమితం చేయడం పైన ఆయన పెద్ద పోరాటమే చేశారు. తెలంగాణవారు మాట్లాడేదీ భాషేకాదన్న ప్రచారం చేశారు. చివరకు తెలంగాణ రచయితల కథల్లో కూడా తమ యాసను మరిచిపోయేంతగా ఆంధ్రులు ప్రభావితం చేసిండ్రు. అసలు భాషకు యాస శ్వాసలాంటిది. యాసను నొక్కిపెడితే శ్వాస ఆగిపోదా అని ఆయన ప్రశ్నించేవారు. రెండున్నర జిల్లాలదే దండి భాష అయినప్పుడు తక్కినోళ్ళ నోళ్ళ యాస నొక్కి తొక్కబడ్డప్పుడు ప్రత్యేకంగా రాజ్యం పాలు అడగక తప్పదని తాను 1949లోనే పేర్కొన్న విషయాన్ని తెలంగాణ ఉద్యమ సందర్భంగా పలుసార్లు గుర్తు చేసేవారు. ఎవరి వాడుక భాష వారికుంటేనా సౌలభ్యం ఉంటుంది. భాషాశాస్త్రం ప్రకారం చూస్తే ఏ భాషకైనా జీవధాతువు మాండలికం. మాండలికంలో తేడాలు, యాసలో వ్యత్యాసాలు ఉండడమే భాషకు జీవలక్షణాలు. ఈ సంగతి మనం మరిచిపోయి కొన్ని యాసలను, మాండలికాలను తొక్కివేయడం మొదలెడితే భాష ఊపిరాడక ఊపిరిలొదిలేస్తుందనేవాడు కాళోజీ.

కాళోజీ ‘ఆంధ్ర సారస్వత పరిషత్‌’ ‌వ్యవస్థాపకుల్లో ఒకరు, ఆంధ్రప్రదేశ్‌ ‌సాహిత్య అకాడమీ సభ్యుడు. 1957-61 వరకు తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు కూడా. తెలంగాణ యాస, భాష పట్ల వల్లమాలిన అభిమానం ఉన్నందున్నే ఆయన జయంతిని ‘తెలంగాణ భాషా దినోత్సవం’గా ప్రకటించడమైంది. అలాగే కాళోజీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాషా చైతన్య కార్యక్రమాలు, చర్చాగోష్టులు, ఉపన్యాసాలు, కవితా పోటీలను వివిధ జిల్లాల్లో నిర్వహించడం ఆనవాయితీగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page