జూప‌ల్లి ప‌క్కా అవ‌కాశ‌వాది

– పాల‌మూరు ప్రాజెక్టును ఎండ‌బెట్టిన‌ రేవంత్‌
– ఏ ప్రాంతం ఏ బేసిన్‌లో వుందో కూడా ఆయ‌న‌కు తెలీదు
– యూరియా కార్డ్ అంటూ కొత్త నాట‌కం
– ప్ర‌భుత్వంపై కేటీఆర్ ధ్వ‌జం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8: కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తిరిగి వస్తుందో రాదో తెలియద‌ని మంత్రి జూపల్లి కృష్ణారావు గత ఏడాది ఆదిలాబాద్‌లో చాలా స్పష్టంగా చెప్పాడ‌ని, త‌న గెలుపుపై కూడా ధీమా ఇవ్వ‌లేద‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ క‌మిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో గురువారం జరిగిన కొల్లాపూర్ నియోజకవర్గ చేరికల సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఈసారి జూప‌ల్లిని గెలిపించవ‌ద్ద‌ని కొల్లాపూర్ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. జూపల్లి ఒక అవకాశవాది అన్నారు. ఇదే కృష్ణారావు తమ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ గురించి ఎంత గొప్పగా మాట్లాడారో అందరికీ తెలుసు.. అట్లాంటిది రేవంత్ రెడ్డిని సంతృప్తి పరచడానికి అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ గురించి చెప్పాలి అంటే మూడు ముక్కల్లో ఎగవేతలు కూల్చివేతలు పేల్చివేతలు తప్ప చేసింది ఏమీ లేదన్నారు. పాలమూరు ప్రాజెక్టును పండబెట్టి రైతులను తొక్కుతున్న ముఖ్యమంత్రి కేవలం తన పాత బాస్ కి కోపం వస్తుందని ఏకైక ఉద్దేశంతోనే  పాలమూరును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణలోని ఏ ప్రాంతం ఏ బేసిన్ లో ఉందో తెలవని ముఖ్యమంత్రితోని మాకు నీటి పాఠాలు అవసరం లేదన్నారు. కాంగ్రెస్ అరాచకాల నుంచి తెలంగాణను కాపాడుకోవాలి అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. ఇందుకోసం పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలి. రేపు రాబోయే మున్సిపల్ ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలలో గట్టిగా కొట్లాడి గెలవాలి. రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి చాలా దారుణంగా తయారయింద‌న్నారు. వ్యవసాయదారులకు ఇచ్చే అన్ని పథకాలను కాంగ్రెస్ ఆపివేసింది. మేము 11 సార్లు రైతు భరోసా ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఒక్కటేసారి ఇచ్చి చేతులు దులుపుకుంద‌న్నారు. ఈరోజు యూరియా గురించి అడిగితే పట్టించుకోవడం లేదు. షాపుల్లో లేని యూరియాను మొబైల్ యాప్స్ తో ఇస్తామని చెప్తుంది.. కొత్తగా యూరియా కార్డ్ అంటూ నాటకం మొదలు పెట్టింద‌న్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలు క్రాప్ హాలిడేలు ప్రారంభమయ్యాయ‌న్నారు. తమ ప్రభుత్వంలో యూరియా కోసం కుస్తీ లేదు.. విత్తనాల కోసం పోటీ లేదు.. కరెంటు కష్టాలు లేవు.. క్రాప్ హాలిడేలు లేవని గుర్తుచేశారు. చెక్‌డ్యామ్‌లు కట్టాల్సినచోట అవే చెక్‌డ్యామ్‌లను పేల్చడం ప్రపంచ చరిత్రలో ఎక్కడా కనిపించని దరిద్రపు ప్రభుత్వం కాంగ్రెస్ ఒక్కటే అని మండిపడ్డారు. కేసీఆర్ ఒక్క దేవరకద్ర నియోజకవర్గంలోనే 36 చెక్ డ్యామ్‌లు కట్టారని గుర్తు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప‌నులు 90 శాతం పూర్త‌యితే 10 శాతం పనులు చేయలేక అపేయడమంటే పాలమూరుపై రేవంత్ పగపట్ట‌డ‌మేన‌న్నారు. నార్లాపూర్, కరివెన, వట్టెం, ఏదుల, ఉద్దండాపూర్ రిజర్వాయర్లన్నీ రెడీగా ఉన్నప్పటికీ కాల్వల పనులను రద్దు చేసి పునఃప్రారంభించకపోవడం పాలమూరుకు నీటిని అందనీయకుడదన్న కుట్ర అని పేర్కొన్నారు. నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద కేసీఆర్ బటన్ నొక్కి 145 మెగావాట్ల పవర్‌తో పంపులను నడిపించిన తీరును పాలమూరు ప్రజలు సాక్షిగా చూశారని చెప్పారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి బీఆర్ఎస్ శ్రేణులు పనిచేయాలని సూచించారు. కష్ట సమయంలో కొల్లాపూర్ ప్రజలతో ఎల్లప్పుడూ ఉంటామని, మల్లేష్ యాదవ్, శ్రీధర్ రెడ్డి మరణాల సమయంలో రెండుసార్లు వచ్చి ప్రజల బాధలో పాలుపంచుకున్నామనే విషయాన్ని గుర్తుచేశారు. కోల్లాపూర్ లో పంచాయితీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ, సంక్రాంతి తర్వాత తిరిగి కొల్లాపూర్‌లో పర్యటిస్తామని తెలిపారు.

గాంధీ కుటుంబాన్ని తిట్టిన రేవంత్‌ను నిలదీయండి

రాహుల్ గాంధీని, సోనియా గాంధీని తిట్టిన రేవంత్ రెడ్డిని తీసుకువచ్చి ముఖ్యమంత్రిని చేసుకున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు మరిచిపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాహుల్ పై తాను చేసిన వ్యాఖ్యలు గతంలో రేవంత్ రెడ్డి అనేకసార్లు చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇదే రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి “ముద్దపప్పు” అన్నాడని, అదే మాటను నేను రిపీట్ చేసినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి సోనియా గాంధీని “వెయ్యిమందిని బలి తీసుకున్న బలిదేవత.. తెలంగాణ పిల్లల్ని చంపింది” అని అన్నాడని, అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్ప‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రభుత్వం త్వరలో పెడుతుందన్న వార్తలు వస్తున్నాయని, ఈ ఎన్నికలను పార్టీ శ్రేణులంతా సమిష్టిగా ఎదుర్కొని విజయం సాధించాలని  పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరానికి బీఆర్‌ఎస్ హయాంలో సుమారు రూ.9700 కోట్లతో అభివృద్ధి చేసిన విషయాన్ని ప్రజలకు ప్రస్తావించాలన్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మన పార్టీ తరఫున గెలిచి కేవలం భూములను కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి పక్షాన చేరి ఎమ్మెల్యే గాంధీ డబ్బులకు అమ్ముడుపోయాడన్నారు. శేర్లింగంపల్లిలో మన పార్టీ ఎక్కడ సమావేశం పెట్టినా కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున విజయవంతం చేస్తున్నారన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలగొడుతున్న తీరును ప్రతి ఒక్కరికి తెలియజేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌కు చేసిన ద్రోహాన్ని, రద్దు చేసిన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రజలకు వివరించాలన్నారు. గొట్ట నరేందర్ యాదవ్ భారీ ఎత్తున తన అనుచరులు, కార్యకర్తలతో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ లో చేరారు. ‎


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *