( జూన్ 12, ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం)
బాల్యం ఒక అద్భుతమైన వరం. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో బాల్యం తిరిగి రావాలని ఆశపడుతుంటారు. అలాంటి బాల్యాన్ని పోగోట్టుకోవడం దురదృష్టకరం.బాల్యదశను సక్రమంగా వినియోగించక పోతే ప్రపంచ గతి అధోగతే.మానసిక పరిపక్వత రాని దశలో మానసిక ఉల్లాసం కోసం బాల్యాన్ని ఆటపాటలతో,చదువులతో నింపాలి. అయితే కొంత మంది బాల్యాన్ని బందీ చేస్తున్నారు. వెట్టి చాకిరీకి గురి చేస్తున్నారు. బాలికలపై ప్రపంచ వ్యాప్తంగా లైంగిక హింస కొనసాగడం అత్యంత దారుణం.
బాల్య విలాపం సమాజానికి శాపం. బాల్యాన్ని చిదిమేస్తే భవిష్యత్తు శూన్యమైపోతుంది.బాలలు భవిష్యత్తుకు సారధులు. బాలల వికాసం అభ్యుదయానికి సోపానం. అలాంటి బాలలు విద్యాబుద్దులకు దూరమై, చీకట్లో మగ్గిపోతే ప్రగతి రథచక్రాలు చతికిలపడక తప్పదు.
బాల్య,యౌవన,కౌమార,వార్ధక్య దశల్లో “బాల్యం” అనేది ప్రతీ వ్యక్తి జీవితంలో మరపురాని మథుర ఘట్టం.ఆటపాటలకు,చదువు సంధ్యలకు మానసికోల్లాసానికి ఒక మహత్తర అవకాశం బాల్యం.బాల్యదశల్లో పూర్వ బాల్యదశ,ఉత్తర బాల్యదశ కీలకమైనవి.ఈ రెండు దశల వ్యవధి 12 సంవత్సరాలు. ఈ వ్యవధిలోనే బాలల్లో మానసిక,నైతిక వికాసం కలిగించాలి.విజ్ఞాన జిజ్ఞాసను ప్రేరేపించాలి.బాల్య దశ జీవితంలో మిగిలిన దశలను సక్రమంగా నడిపించడానికి దోహదం చేసే అత్యంత కీలక దశ. బాల్యదశ గాడి తప్పి క్రమశిక్షణ లేకుండా గడిస్తే జీవితమంతా కష్టాల పాలు కాక తప్పదు.ప్రస్తుత బాలప్రపంచం అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నది.
బాలల హక్కులు హరించబడుతున్నాయి. చాలా మంది బాలలు విద్యకు నోచుకోక,తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితులు అనుకూలించక,వెట్టిచాకిరీ చేస్తూ,బాలకార్మికులుగా మిగిలిపోతున్నారు.ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన. ప్రపంచంలో సుమారు 121 మిలియన్లకు పైగా బాలకార్మికులున్నారు.ఇందులో అత్యధిక శాతం మంది ప్రమాదకరమైన పనుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలల సంక్షేమం కేవలం కాగితాలకే పరిమితమౌతున్నది. తాము బ్రతకడం కోసం బాలలను ప్రమాదకరమైన పనుల్లో నియమించి, చదువుకు దూరం చేసి,బాల్యాన్ని హరించడం హేయం.బాలలకు చదువుకునే హక్కును దూరం చేయడం మహా ఘోరం. బాలల హక్కులను పరిరక్షించడం, బాలలను భౌతిక,మానసిక,లైంగిక హింసల నుండి కాపాడి,వారిని ఆహ్లాదకరమైన వాతావరణంలో పెంచడం అతిముఖ్యం.ఆర్ధిక ఇబ్బందులతో కొంతమంది, చదువుకోవడానికి మౌలిక సదుపాయాలు లేక కొంతమంది బాలలు విద్యకు దూరమౌతుంటే, కొన్ని పాఠశాలల్లో బాలికలు చదవడానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం వలన బాలికల విద్య అడుగంటుతున్నది.
ప్రభుత్వాలు బాలల కోసం ఎన్ని పథకాలు చేపట్టినా అవి కేవలం ఊతకర్రలా పనికొస్తాయే గాని పూర్తిగా మనల్ని ఆదుకోలేవు.ఇలాంటి పరిస్థితుల్లో మరలా బాలలు ఉదరనిమిత్తం పనిపాటలకు పోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.కోవిడ్ వలన ప్రపంచవ్యాప్తంగా సుమారు అధికశాతం విద్యాలయాలు మూతబడ్డాయి.బాలలంతా విద్యకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్క బడుతున్నా, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక మాంద్యం తిరిగి బాలలను అధోగతి పాలు చేస్తున్నది. యుద్ధాల వలన అంతంత మాత్రంగా ఉన్న బాలల బ్రతుకులు మరింత క్షీణదశకు చేరే అవకాశాలున్నాయి. ప్రభుత్వాలు ఈ విషయాన్ని గ్రహించి బాలల చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రత్యేక నిధులు విడుదల చేయాలి.యునెస్కో కూడా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బాలలపై మరింత శ్రద్ధ వహించాలి. బాలలంతా చదువులకు స్వస్తి చెప్పి, బతుకుదెరువు కోసం వివిధ రకాల పనులు చేస్తూ కష్టాలు పడుతున్న నేపథ్యంలో జూన్ 12 న జరిగే బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం ప్రాధాన్యత సంతరించుకున్నది.
బాల్యంలోనే భిక్షాటన మన సామాజిక వ్యవస్థకు పెనుశాపం.చిత్తుకాగితాలు ఏరుకోవడానికి అలవాటుపడి కొంతమంది అసాంఘిక శక్తులచేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోతున్న బాలలెంతోమందిని మనం చూస్తున్నాం. మత్తుపదార్ధాల చేరవేతలో బాలలను కీలుబొమ్మలుగా మార్చడం దురదృష్టకరం.బాలల బంగారు భవితను చీకటిమయం చేస్తున్న మాఫియా ముఠాల చేతుల్లో,ఉగ్రవాదులకు చేదోడునిచ్చే అసాంఘిక వ్యవస్థల చేతుల్లో బాల్యం చిక్కి శల్యమౌతున్నది.”ఉన్నతమైన ఆలోచనలకు తరగతి గదులే మాతృక”అందరితో సమానమైన విద్య అందక చాలామంది పిల్లలు సమాజంలో ఒక మూలకు నెట్టబడుతున్నారు. ఆర్ధిక సామాజిక పరిస్థితులే వీటికి మూలకారణం. ఇలాంటి వారిని గుర్తించి ముందుకు నడిపించవలసిన బాధ్యత అందరిపైనా ఉంది.గ్రామీణ నేపథ్యమున్న చిన్నారులలోనే ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం చూస్తున్నాం.
(సామాజిక విశ్లేషకులు, మోటివేషనల్ స్పీకర్)
ఆంధ్రప్రదేశ్





