జపాన్‌ తొలి మహిళా ప్రధానిగా తకైచి

– ఆమె ఎన్నిక లాంఛనమే అంటున్న పరిశీలకులు

న్యూదిల్లీ, అక్టోబర్‌ 4: జపాన్‌కు తొలి మహిళా ప్రధానిగా తకైచి అరుదైన ఘనత సాధించనున్నారు. తాజా రాజకీయ పరిస్థితుల్లో ఆమె ఎన్నిక లాంఛనమే కానుంది. పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్‌ ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో అధికార లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్షురాలిగా సనై తకైచి ఎన్నికయ్యారు. తదుపరి ప్రధానిగా తకైచి బాధ్యతలు తీసుకునేందుకు మార్గం సుగమమైంది. దీంతో జపాన్‌కు తొలి మహిళా ప్రధానిగా తకైచి అరుదైన ఘనత సాధించనున్నారు. ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు ఎగువ సభలో అధికార పార్టీ మెజారిటీని సాధించలేకపోయింది. దీనికి ముందు దిగువ సభలో కూడా మెజారిటీ కోల్పోయింది. దీంతో ఇషిబాపై ఒత్తిడి పెరగ్గా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే శనివారం పార్టీలో ఎన్నికలు జరగ్గా మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కోయిజుమితోపాటు మరో ముగ్గురు అభ్యర్థులను ఓడిరచి తకైచి విజయం సాధించారు. ఇక దేశ తదుపరి ప్రధానిని ఎన్నుకునేందుకు జపాన్‌ పార్లమెంటు అక్టోబరు 15న ఓటింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది. తాజాగా మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కోయిజుమిని ఆమె ఓడిరచారు. 64 ఏళ్ల తకైచి 1993లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఎల్‌డీపీలో ఆర్థిక భద్రత, అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వ మంత్రి సహా పలు కీలక పదవుల్లో పనిచేశారు. ఈ గెలుపు తనకు సంతోషం ఇవ్వడం కంటే బాధ్యతను పెంచిందని ఈ సందర్భంగా తకైచి పార్టీ సభ్యులతో పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *