13. జనధర్మోవిజయతే
దృఢమైన సంకల్పంతో జనధర్మ రవివర్మ అనే కథ చదవాల్సిందే. శ్రీ ముస్తాల శంకరరావు, శ్రీ యాదగిరాచార్య, శ్రీ దివ్వెల హన్మంతరావు శ్రీ యం.యస్. ఆచార్యగారు నలుగురూ 1958 నవంబర్లో ‘జనధర్మ’ వారపత్రికను ప్రారంభించారు. బిట్ల నారాయణగారి రవివర్మ ఫోటో స్టూడియోలోనే సమావేశమై పత్రిక ప్రచురణను నిర్ణయించారు. జనధర్మతో చాలా సంబంధాలు ఉన్న వారిలో కొన్ని ముఖ్యులైన రాసిన రచనలు వార పత్రిక ఒక్కొక్కరి ఇటుక తో జనధర్మ నిర్మాణమైంది.
వరంగల్లులోని దాదాపు ప్రతికుటుంబంలో రవివర్మ స్టూడియోలో దిగిన ఫోటో ఉంటుంది. ఎం ఎస్ ఆచార్య (నాన్న) గారి ఈ రెండు చిత్రాలకు ఒక సౌమనస్య మైత్రీ చరిత్ర ఉంది. బిట్లనారాయణ గారు సుప్రసిద్ధ ఫోటోగ్రాఫర్. మరువలేని ప్రేమాస్పదుడైన వ్యక్తి. ప్రతిభావంతుడు. నిశ్చల చిత్రాలలో జీవం పోసే ఛాయాగ్రాహకుడు. వరంగల్ చౌరస్తాలో ఆయన స్టూడియో చూడాలనిపిస్తుంది. ఎంతో ఆసక్తికరంగా ఆయన స్టూడియోను కళాత్మకంగా తీర్చిదిద్దారు. కళాకారుడైన రాజా రవివర్మ పేరును ఆయన తన కుమారుడిని పెట్టుకున్నారు. ఆ పేరు మీదనే స్టూడియో చాలా ప్రాచుర్యం పొందింది. రవివర్మగారు వారి నాన్న బిట్ల నారాయణ మా ఫోటోలలో ప్రింట్ చేసిన తరువాత తను రంగులతో సవరించి నేను ఎన్నో గంటలు ఎదురు చూస్తూ ఉండేవాడిని.
‘జనధర్మ’ పక్కనే ‘రవివర్మ’ బాగుంటుందా?
జనధర్మ వార పత్రికలో ప్రతివారం రవివర్మ స్టూడియో అడ్వర్టయిజ్ మెంట్ ఉండేది. మొదట్లో తొలిపేజీలో మాస్ట్ హడ్ పక్కనే ఆ ప్రకటన ఉండేది. తరువాత చివరి పేజికి మారింది. జనధర్మ పత్రికను ప్రెస్ లో నేను ప్రింట్ చేసేవాడిని చాలా సార్లు. కాని నాకు ఆ మార్పు ఎందుకు జరిగిందో తెలియదు. నేను నాన్నను అడగలేదు. బిట్లనారాయణ గారిని అడిగినాను. ‘‘అదా…జనధర్మ పేరు దాని పక్కనే రవివర్మ అంటే బాగుండదని మీనాన్నగారే చివరి పేజీలోకి నా ప్రకటన తోసేశారు. ఏం చేస్తాం. మామాట వింటాడా..’’ అని మనసారా నవ్వాడాయన.
ఆ ఆప్యాయతలు మళ్ళీ చూస్తామా అనిపిస్తుంది. ఆ తరువాత…
‘‘సరే అవన్నీ వదిలేయ్ శ్రీధర్ నీకు నేనొక విశేషం చూపిస్తాను. ఇంటికి రా.. ’’
అని నన్ను వరంగల్ రాధికా టాకీస్ వెనుక వైపు ఉన్న వారింటికి తీసుకువెళ్లినారు. రెండంతస్తుల ఇల్లు. దానిపైన డాబా. అక్కడ ఒక షెడ్. అక్కడ కూచుని పెద్ద పెద్ద చిత్రాలు తీర్చిదిద్దుతుంటారు నారాయణ గారు. చేయిపట్టుకుని తీసుకుపోయి అక్కడ ఇంకా పూర్తికాని ఒక చిత్రాన్ని చూపించారు. ఆయిల్ కలర్ పెయింటింగ్. కళ్లు ఇంకా దిద్దలేదు. మిగతా అంతా దాదాపు పూర్తియనట్టే. ఎవరిదో ఆయన చెప్పలేదు. నేను చూడగానే తెలిసింది.
నాన్న పొర్ట్రేయిట్. ఆశ్చర్యపోయాను.
చాలా బాగుంది. రంగులు సరిపోయినాయి. రూపు రేఖలు అచ్చుగ్రుద్దినట్టున్నవి. బిట్ల నారాయణ గారి కుంచెనుంచి జాలువారిన అద్భుత చిత్రం అది. ఆయన నాముఖంలో ఆశ్చర్యానందాలను చూసి ఆనందిస్తున్నారు. అది నేనూ చూసాను. చాలా బాగుందండీ.. ఇదెప్పుడు మొదలు పెట్టారు… ఇంకా ఎప్పుడు పూర్తవుతుంది. అభినందన సభనాటికి ఇస్తారా.. అనడిగాను.ఏమో చెప్పలేను. ఇంకా చాలా పనుంది. అసలు పని కళ్లు చిత్రించడమే తెలుసా.
మరెప్పుడు
చేస్తా చేస్తా… నాకు మూడ్ వచ్చినప్పుడు కాస్సేపు దాన్ని ముందర బెట్టుకుని రంగులు వేస్తుంటాను. ఎన్నాళ్లనుంచో తెలుసా …
అవును అదే అడిగినాను. ఎన్నాళ్లనుంచి వేస్తున్నారు..
ఇరవై ఏళ్లనుంచి అనుకుంటా…అన్నారు.
మళ్లీ ఆశ్చర్యపోయాను.
అవునా.. అన్ని సంవత్సరాలు పడుతుందా ఒక చిత్రానికి…
పట్టదు…కాని నాకు బుద్ధి పుట్టినప్పుడు మొదలు పెడతాను. కాస్సేపయిన తరువాత ఏదో పని పడుతుంది.. తర్వాత చేద్దాంలే అని వదిలేస్తాను. తొందరేముంది అనుకుంటూ ఉంటాను.
సార్ ఇప్పుడు తొందర ఉంది.
నాన్న అభినందన సభలో మీరు ఇది ఇవ్వాలి. ఇంతకుమించిన బహుమతి ఉంటుందా.. మీ మిత్రుడికి.. మీరు మాత్రం ఈ చిత్రం పూర్తి చేయాల్సిందే. మీరు ఎప్పుడు కళ్లు దిద్దుతారో ఎప్పుడు చూస్తానో అని నాకు ఉత్కంఠ పెరుగుతున్నది.. అన్నాన్నేను.
సరే నన్నారు.
ఆ విధంగానే పూర్తిచేశారు. కాని ఇక్కడ చెప్పుకోవలసింది అది మాత్రమే కాదు. బిట్ల నారాయణగారికి నాన్నంటే ఎంత ప్రేమ. ఆ చిత్రంలో ప్రతిఅణువులో ఆయన ప్రేమ ఉంది. స్నేహం ఉంది. ఆప్యాయత ఉంది. ఆచిత్రంలో రంగులుకావు, హంగులు కావు.. అపురూపమైన అనురాగం ఉంది. రూపుకట్టిన ప్రేమ ఆ ఫ్రేమ్ లో ఉంది. నా దృష్టిలో ఆ చిత్రం ఒక వజ్రం. ఒక స్నేహ శిల్పం, ప్రేమపత్రం. నాన్నగారి యౌవన కాలం …దాదాపు 30 ఏళ్ల వయసుంటుందేమో.. ఆ నాటి చిత్రాన్ని అరవయ్యో యేట పూర్తి చేసి ఇచ్చారు.
(యువకుడిగా ఉన్న ఎం ఎస్ ఆచార్య ఫోటో నాన్న నామం, వత్తుగా దువ్విన జుట్టు, తీసిన బిట్లా నారాయణ గారు)
వారు తన ఇద్దరు కుమారులను తనకన్న ఒక మెట్టుపైకి వుండేటట్టు చేశారు. వారు కూడ తండ్రికి చేదోడు వాదోడుగావుంటు అన్ని విధాలుగా సహాయ సహకారాలందించుచున్నారు. ఆచారిగార్కి ఒక విధమైన అహంవుంది. అదేమంటే నేను ఎవ్వడికి ఏ విధమైన హాని చేయలేదు. ఎవరికి చేయి జాపలేదు. తన స్వార్థము కొరకు నాకు వ్యక్తిత్వముతో నా కాలము ఈ విధముగానే జరుగుతుంది అనే ధీమా మరియు ఆత్మవిశ్వాసము వారికి చాలామంది మిత్రులు వున్నా కొంతమంది అమిత్రులు శత్రువులు ఉండవచ్చు ఎందుకంటే ఆయనకు ముక్కుకు సూటిగా పొయే తత్వము ఆయనది అనీ ‘‘ఇప్పుడు వారికి పత్రిక ప్రాణముయే దాన్ని ఖచ్చిత ముగా నిర్భీతితో నడిపించాలి, అదే వారి ధ్యేయము.వరంగల్లో పత్రిక నడిపించుట అంటే కత్తి మీద సాము వంటిది. అది సాహసమే. మన ఆచారిగారు ముందుకూడ పత్రికను ఇంకా అభివృద్ధి పరిచి దీర్ఘ కాలము వెలువరించాలని హృదయ పూర్వకముగా ఆశించుచున్నాను’’ అని బిట్ల నారాయణ గారు మార్చి 1988 లో రాసారు..





