“సైనికులు, రైతులు మన దేశానికి రెండు బలమైన గుండెలు. వారి నిస్వార్థ సేవలే ఈ దేశానికి ప్రాణం. వారి త్యాగాలను స్మరించుకుంటూ, వారికి మన నివాళిని అర్పిద్దాం. వారు సుఖంగా ఉంటేనే, ఈ జగత్తు సుభిక్షంగా ఉంటుంది.”

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతీ భారతీయుడు మన దేశాన్ని నిలబెడుతున్న ఇద్దరి గురించి తెలుసుకోవాలి. వారే దేశ సరిహద్దులను కాపాడే జవాన్, మన ఆకలిని తీర్చే కిసాన్. ఈ ఇద్దరూ కేవలం వృత్తుల వారు కాదు. దేశానికి రెండు బలమైన స్తంభాలు. వారి నిస్వార్థ త్యాగాలు, నిత్య జీవితంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లు మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వారి గురించి లోతుగా అర్థం చేసుకోకుండా, మనం నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవించలేము.
భరతమాత కవచం -మన వీర సైనికులు
మనం ప్రశాంతంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే, దానికి ప్రధాన కారణం సరిహద్దుల్లో మన సైనికులు నిరంతరం కాపలా కాయడమే. ఎముకలు కొరికే మంచు కొండల్లో, మండుటెండల్లో ఎడారుల్లో, దట్టమైన అరణ్యాలలో, సముద్రపు లోతుల్లో, ఆకాశపు హద్దుల్లో వారు నిద్రాహారాలు మాని మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. వారు కేవలం సైనిక దుస్తులు ధరించిన వ్యక్తులు కాదు, భరతమాత కవచం. మనందరి ధైర్యం. శత్రువుల నుండి దేశాన్ని కాపాడటమే కాదు. ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ వారు నిస్వార్థంగా ముందుంటారు. వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడటానికి, భూకంప శిథిలాల కింద నలిగిపోతున్న ప్రాణాలను రక్షించడానికి వారు చూపించే తెగువ మానవత్వానికి నిలువుటద్దం.
వారి త్యాగం వెలకట్టలేనిది. ఒక సైనికుడి జీవితం నిరంతర త్యాగాల మయం. కన్నవారిని, కట్టుకున్నవారిని, పిల్లలను, స్నేహితులను, సకల సుఖాలను వదిలి దేశ రక్షణనే ఏకైక లక్ష్యంగా వారు జీవిస్తారు. పండుగలు, కుటుంబ వేడుకలు వారికి గుర్తుకురావు. వారి గుండెల్లో నిరంతరం జ్వలించేది ఒకటే ఆశయం: “దేశ రక్షణే నా ప్రథమ కర్తవ్యం.” ఇది కేవలం ఉద్యోగం కాదు. అదొక పవిత్రమైన ప్రమాణం. ఒక సైనికుడు వీరమరణం పొందినప్పుడు, అది కేవలం ఒక కుటుంబానికే నష్టం కాదు, యావత్ దేశానికీ తీరని లోటు. మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నామంటే, అది వారి ప్రాణ త్యాగాల పునాదుల మీదనే అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. వారిని గౌరవించడం అంటే, కేవలం జాతీయ దినోత్సవాల రోజున మాత్రమే స్మరించుకోవడం కాదు. ప్రతిరోజూ వారి కుటుంబాలకు అండగా నిలబడాలి. వారి త్యాగాలను మనసులో నిలుపుకోవాలి. దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలగకుండా నడుచుకోవడమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి. ఆ వీర సైనికులే మన దేశ భద్రతను కాపాడే హీరోలు !
భారతదేశ వెన్నెముక -మన అన్నదాతలు
మనం తినే ప్రతి మెతుకు వెనుక ఒక కథ ఉంది. అది చెమటతో తడిసిన కథ. మట్టి వాసనతో నిండిన కథ. ఆశతో ఆకాశం వైపు చూసిన కథ. ఆ కథానాయకుడే మన రైతు. అతన్ని మనం ‘అన్నదాత’ అని, ‘దేశానికి వెన్నెముక’ అని పిలుస్తాం. కానీ ఈ బిరుదుల వెనుక ఉన్న అతని నిత్య జీవిత పోరాటాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం? రైతు తన కష్టాన్నే నమ్ముకుని జీవిస్తాడు. సూర్యుడు నిద్రలేవక ముందే తన నేలతల్లిని పలకరించి, నాగలిని తీసుకుని పొలానికి వెళ్తాడు. ఎండ, వాన, చలి వంటి వాతావరణ కష్టాలను పట్టించుకోకుండా, దున్నడం, విత్తడం, కోయడం వంటి పనులతో రోజంతా శ్రమిస్తాడు. అతను చిందించే ప్రతి చెమట చుక్క, నేలలో పడి మొలకెత్తే విత్తనానికి ప్రాణం పోస్తుంది. మట్టిని పిసికి, బురదలో నడిచి, పంటను కంటికి రెప్పలా కాపాడి, బంగారు రాశులను పండించి మన కడుపు నింపుతాడు. అయితే రైతు పోరాటం బహుముఖమైనది. ఒకవైపు, వర్షాధారంపై ఆధారపడటం వల్ల అతివృష్టి లేదా అనావృష్టి కారణంగా పంట నష్టపోతున్నాడు. సరైన సాగునీటి సౌకర్యాలు లేకపోవడం, అధిక పెట్టుబడి ఖర్చులు అతడిని నిరంతరం ఆందోళనలో ఉంచుతాయి. మరోవైపు, వ్యవస్థాగత సవాళ్లు అతన్ని మరింత కుంగదీస్తున్నాయి.
అవగాహన లోపంతో కొందరు వ్యాపారులు విక్రయించే నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొని తీవ్రంగా నష్టపోతున్నాడు. పండించిన పంటకు విక్రయించడానికి దళారులపై ఆధారపడి మోసపోతున్నాడు. సరైన విద్యార్హత లేకపోవడంతో చాలా మంది రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు. సొంత భూమి లేని కౌలు రైతులు, పంట సరిగా పండకపోతే మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ సమస్యలన్నీ అతడిని ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తున్నాయి. భారతదేశ జనాభాలో దాదాపు మూడింట రెండొంతుల మందికి వ్యవసాయమే జీవనోపాధి. దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, కొన్నిసార్లు వారే పస్తులుండే దుస్థితిలో ఉండటం అత్యంత విచారకరం. నగరాల్లోని మనం ఏసీ గదుల్లో కూర్చుని ఆన్లైన్లో ఆహారాన్ని ఆర్డర్ చేసుకుంటాం. కానీ ఆ ఆహారం మన ప్లేట్లోకి రావడానికి రైతు ఎంత శ్రమించాడో తరచుగా మరచిపోతాం. కాబట్టి మనం భోజనం చేసేటప్పుడు అన్నాన్ని వృధా చేసే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. రైతు శ్రమను గౌరవిద్దాం. అతనికి సాధ్యమైనంత మద్దతుగా నిలుద్దాం. “రైతే రాజు” అన్న నినాదాన్ని కేవలం నినాదంగా కాకుండా, నిజం చేసే బాధ్యత మనందరిపైనా ఉంది.
వారి త్యాగాన్ని మరువరాదు !
సైనికులు, రైతులు మన దేశానికి రెండు బలమైన గుండెలు. వారి నిస్వార్థ సేవలే ఈ దేశానికి ప్రాణం. వారి త్యాగాలను స్మరించుకుంటూ, వారికి మన నివాళిని అర్పిద్దాం. వారు సుఖంగా ఉంటేనే, ఈ జగత్తు సుభిక్షంగా ఉంటుంది.
జై భారత్ ! జై జై భారత్ ! జై హింద్ !





