ఇట్లు..నీ ప్రేయసి

ఒక మొరటబ్బాయిని ప్రేమించి, ప్రేమలో తనే ముందడుగు వేసి, ఉత్తరాల ద్వారా దానిచుట్టూ ఒక మిస్టరీ సృష్టించి, రక్తి కట్టించి, పెళ్ళి చేసుకుని శుభం కార్డు వేయించుకుని, జీవితాన్ని మనసారా ఆహ్వానిస్తూ, తనువారా అనుభవిస్తూ, వొచ్చే అవాంతరాలను, కల్లోలాలను ఛాతీ ఒడ్డి ఎదుర్కొంటూ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ తన వైవాహిక బంధానికి మరక అంటకుండా కాపాడుకున్న మహిళ రాధ, రాధచాటు నీలమేఘశ్యామసుందరుల కథ ఇది.. ధీరోదాత్తత హీరోదత్తత కాదు.

యాభయ్యేళ్ళక్రితం భద్రాచలం గోదావరీ తీరం, సీలేరు అడవులు, సింగరేణి బొగ్గు గనులు, థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ కార్మికపోరాటాలు, ఎమర్జెన్సీ మీసా చట్టాల నేపథ్యంలో జరిగిన ఈ ప్రేమకథ, రాధ చేసిన పోరాటం ఇప్పటికీ ఎప్పటికీ రిలవెంటే. స్త్రీ తన హక్కులకోసం చేసే పోరాటం ఎప్పుడూ ఆగనిదే. ఆ కాష్టం ఎప్పటికీ ఆరనిదే. ఆస్తులకన్నా అస్థిత్వాలకోసమే కదూ ఆమె చేసిన ఉద్యమాలు.

‘‘ఇట్లు.. నీ ప్రేయసి’’ ఒక సాధారణమైన ప్రేమకథ. జీవితంలోని, వివాహంలోని, ప్రేమలోని దశలన్నిటినీ స్పృశిస్తూ మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపించే అతి సామాన్యమైన కథ. మీ చేయి పట్టుకున్న వ్యక్తి రాధ కూడా సాధారణ మహిళే. కానీ ఉనికిని ప్రశ్నించే పరిస్థితులెదురైనప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయాలు, వేసిన అడుగులు అసాధారణమైనవి. నిర్ణయం!  నిర్ణయం తీసుకోగలిగిన పరిణితి. అదే రాధ వ్యక్తిత్వానికి వెన్నెముక. రచయితగా నా హామీ.. పుస్తకం చదువుతూ రాధతో మీరు చేసే చెలిమి మీరు మనసుకి దగ్గరగా భావించే అతి కొద్ది స్నేహాల్లో ఒకటిగా మిగిలిపోతుంది..  

– రాజ్‌ మాదిరాజు

  
ఇట్లు.. నీ ప్రేయసి నవలలోని కొంత భాగం

‘‘నీ లేఖల్లోని భావోద్వేగాలు అతనికి అర్ధం కాకపోతే తప్పు లేదు. కానీ అది తనకోసం రాశావన్న భావనకు అతను ఉత్తేజితుడవకపోతే తప్పు. అతను నీ మ్యాచి కాదని అర్ధం. పెళ్ళిలో శారీరక అన్యోన్యత ఎంత ముఖ్యమో మానసిక అనుకూలత, సారూప్యత కూడా అంతే ముఖ్యం. ఇద్దరూ ఒకేస్థాయిలో ఆలోచించగలుగుతేనే బంధం సాఫీగా నడుస్తుంది. గట్టిగా నిలుస్తుంది.’’

నెమ్మదిగా అడిగింది.
‘‘నీకు చూడాలనిపించడంలేదా నాన్నా.. నాకు అతను కరక్టా కాదా అని చూసి చెప్పాలని లేదా.’’ ‘‘నీ అభిరుచిని అవమానించినట్టు. నా పెంపకాన్ని అనుమానించినట్టు. కానీ నువ్వు నాకు చెప్పినదాన్ని బట్టి చూస్తే మెచ్యూరిటీ తక్కువనిపిస్తోంది. మీ ఇద్దరి ఆలోచనల తీరు కానీ స్థాయి కానీ ఒకేలా లేవు. నువ్వు కిందికి దిగడం నేర్చుకోవాల్సొస్తుంది. లేకపోతే అతనిలో ఆత్మన్యూనత వొచ్చే ప్రమాదం ఉంది. అది మీ ఇద్దరికీ మంచిది కాదు. నేను మీ ఇద్దరికీ కలిపి వేస్తాను మార్కులు. అదీ ఇప్పుడు కాదు. నాలుగైదేళ్ళ తరవాత. నువ్వు అతన్ని ఎలా మార్చుకున్నావో, మలచుకున్నావో చూసి. రాయిని శిల్పం చేయడం తేలికే. కానీ ఒకసారి చెక్కిన శిల్పానికి మరమ్మత్తులు చేసి కొత్త రూపాన్నివ్వడమే కష్టం. చూద్దాం, ఆ పాతికేళ్ళ ఆరడుగుల శిల్పానికి నువ్వెలాంటి రూపం ఇస్తావో.’’
పుస్తకావిష్కరణ:
‘‘ఇట్లు.. నీ ప్రేయసి’’ నవల జూన్‌ ఏడో తారీకు శనివారం సాయంత్రం అయిదుగంటలకు జూబిలీ హిల్స్‌ రోడ్‌ నంబరు 5లో (అన్నపూర్ణా సెవెన్‌ ఎకర్స్‌ సమీపంలో) ఉన్న సమ్మర్‌ బిస్త్రో కేఫులో జరుగుతుంది.. అందరూ ఆహ్వానితులే.
– అన్వీక్షికి ప్రచురణలు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *