మరో మైలు రాయిని చేరిన ఇస్రో

– బాహుబలి రాకెట్‌ ప్రయోగం విజయవంతం
– అమెరికా నమ్మకాన్ని నిలబెట్టామన్న ఇస్రో చైర్మన్‌

తిరుపతి, డిసెంబర్‌ 24: భారత అంతరిక్ష పరిశోధాన సంస్థ ఇస్రో మరో మైలురాయిని చేరింది. శ్రీహరికోటలో బాహుబలి రాకెట్‌ ప్రయోగం విజయవంతం అయింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ బ్లూ బర్డ్‌ బ్లాక్‌`2ను ఈ రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. ఇంతటి భారీ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపడం ఇదే తొలిసారి. కేవలం 15 నిమిషాల్లోనే బ్లూబర్డ్‌ ప్రయోగం విజయవంతమైంది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌ మొబైల్‌ సంస్థతో కలిసి ఇస్రో ఈ ప్రయోగం నిర్వహించింది. ప్రపంచంలో ఎక్కడినుంచైనా 4.జి, 5జి సేవలను బ్లూ బర్డ్‌ బ్లాక్‌`2 అందించనుంది. ఎల్‌వీఎం 3 రాకెట్‌ సిరీస్‌లో ఇది 9వ ప్రయోగం. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ మాట్లాడుతూ బాహుబలి ప్రయోగం విజయవంతమైందని, ఎల్‌వీఎం ప్రయోగాల్లో సంపూర్ణ విజయాలు సాధిస్తున్నామని తెలిపారు. అతి తక్కువ సమయంలో రాకెట్‌ రూపొందించి విజయవంతం చేశామన్నారు. అమెరికన్‌ కస్టమర్‌ కోసం ప్రయోగం చేపట్టామని, ప్రపంచంలో అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటని అన్నారు. 34 దేశాలకు ఇస్రో సేవలందిస్తోందని, గగన్‌యాన్‌ కోసం ఈ ప్రయోగం మరింత ఆత్మవిశ్వాసం కలిగిస్తోందని తెలిపారు. ఇస్రోపై అమెరికా పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టామని, ఈ ప్రయోగం ఇస్రోకి చరిత్రాత్మకమైన విజయమని చెప్పారు. వాణిజ్య ప్రయోగాలలో మరోసారి సత్తా చాటామన్నారు. అత్యంత కీలకమైన దీనిని 52 రోజుల్లోనే సిద్ధం చేసి ప్రయోగం చేపట్టామని చెప్పారు. మన శాస్త్రవేత్తల సమష్టి విజయం ఎల్‌వీఎం 3 ` ఎం 6 రాకెట్‌ ప్రయోగం అని పేర్కొన్నారు. ఎల్‌వీఎం ప్రయోగాలలో ఈ ప్రయోగం మూడవ వాణిజ్య ప్రయోగమని వెల్లడిరచారు. ఎల్‌వీఎం రాకెట్లనే చంద్రయాన్‌ 4, 5కు ఉపయోగిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మానవ రహిత ప్రయోగాలని చేపట్టబోతున్నామని ప్రకటించారు. ఒప్పందాలు పూర్తయిన వెంటనే వరుస వాణిజ్య ప్రయోగాలు చేపడుతున్నామన్నారు. భవిష్యత్తులో నావిగేషన్‌ ప్రయోగాలు, అంతరిక్షంలో స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని నారాయణన్‌ పేర్కొన్నారు.

 ప్రధాని మోదీ అభినందనలు

ఎల్‌వీఎం3- ఎం6 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ ‌వేదికగా  స్పందిస్తూ భారతదేశ యువత శక్తితో మన అంతరిక్ష రంగం మరింత అభివృద్ధి చెందుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది ప్రభావవంతంగా మారనుందని ఆకాంక్షించారు. ఎల్‌వీఎమ్‌ 3 ‌నమ్మకమైన హెవీ లిప్ట్ ‌పనితీరును కనబరుస్తుందన్నారు. గగన్‌యాన్‌ ‌వంటి భవిష్యత్‌ ‌మిషన్ల కోసం బలమైన పునాదులు వేస్తున్నామని తెలిపారు. వాణిజ్య ప్రయోగ సేవలను సైతం విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచ భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఇది భవిష్యత్తు తరాల సామర్థ్యంతోపాటు స్వావలంబను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. భారత్‌ ‌నేలపై నుంచి ఇప్పటి వరకు అత్యంత బరువైన ఉపగ్రహాన్ని ప్రయోగించ లేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తాజాగా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడం ద్వారా మన దేశ వాణిజ్య అంతరిక్ష సామర్థ్యం, ప్రపంచ ప్రయోగ భాగస్వామిగా దాని స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. భారతదేశ వాణిజ్య ప్రయోగ సామర్థ్యాలను ప్రపంచం ఎదుట ప్రదర్శించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా ఆయన అభివర్ణించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *