గాజాపై ఇజ్రాయిల్ సైనిక  దాడులు

– న‌గ‌రం పూర్తి స్వాధీనం ల‌క్ష్యం
-హ‌మాస్ వెన్ను విర‌వ‌డ‌మే వ్యూహం
-20కి పైగా మృతి
– చాలా మందికి గాయాలు

ఇజ్రాయెల్‌ సైన్యం మంగళవారం తెల్లవారుజామున గాజా సిటీలోకి సైనిక దాడి ప్రారంభించినట్టు ప్రకటించింది. దాదాపు రెండేళ్లుగా సాగుతున్న యుద్ధం మధ్య, ఇంకా లక్షలాది పాలస్తీనా పౌరులు అక్కడే ఉండగా, కీలక పట్టణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఈ  ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది. గాజాలో మానవతా పరిస్థితులు మరింత విషమించ‌వ‌చ్చున‌ని భ‌య‌ప‌డ‌తున్నారు. ఇజ్రాయెల్‌ సైన్యం బాంబు దాడుల తీవ్ర‌త‌కు 25 మైళ్ళ దూరంలో ఉన్న భవనాల కిటికీలు కూడా కంపించాయని స్థానికులు చెప్పారు. “మేమందరం భయంతో వణికిపోతున్నాం. మేము అనుభవిస్తున్నదానికంటే మరణమే సుఖం అనిపించింది,” అని గాజా సిటీలోని పశ్చిమ తీర ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్‌లో తలదాచుకున్న మాజీ ఉపాధ్యాయుడు మోంటాసర్ బహ్జా అన్నారు. హ‌మాస్ మ‌ళ్లీ పుంజుకోకుండా దాని వెన్ను విర‌వ‌డ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యంగా ఈ దాడులు జరుపుతున్న‌ట్టు ఇజ్రాయిల్ అధికార్లు తెలిపారు. ఈ దాడుల‌కోసం కొన్ని వారాలుగా ప్ర‌ణాలిక‌లు రూపొందించారు.  2023 అక్టోబర్ 7న హమాస్‌ దక్షిణ ఇజ్రాయెల్‌పై చేసిన  దాడిలో 1,200 మంది మరణించగా, సుమారు 250 మందిని త‌మ బందీలుగా ప‌ట్టుకెళ్లారు. ప్ర‌స్తుతం ఇజ్రాయిల్ జ‌రుపుతున్న దాడుల్లో ఇర‌వై మందికి పైగా మ‌ర‌ణించిన‌ట్టు తెలుస్తోంది. క్ష‌త‌గాత్రుల‌ను గాజా సిటీలోని అల్-షిఫా హాస్పిటల్ కు  తరలించారని హాస్పిటల్  డైరెక్టర్ మహ్మద్ అబూ సల్మియా తెలిపారు. గాజా ఆరోగ్య శాఖ అధికారి జాహెర్ అల్-వాహెది కూడా దీన్ని ధ్రువీక‌రించారు.  ఈ దాడుల‌ను అంత‌ర్జాతీయ స‌మాజం తీవ్రంగా ఖండించింది. ఈ చ‌ర్య‌వ‌ల్ల హ‌మాస్‌తో జ‌ర‌గాల్సిన కాల్పుల విర‌మ‌ణ చ‌ర్చలు నిలిచిపోయే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని కొంద‌రు విదేశీ దౌత్య‌వేత్త‌లు, ఇజ్రాయిలీలు అభిప్రాయ‌ప‌డ్డారు. గాజాలో ఇజ్రాయిల్ పాల‌స్తీనియ‌న్ల హ‌న‌నానికి పాల్ప‌డుతున్న‌ద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి పేర్కొంది. అయితే ఇజ్రాయిల్ ప్ర‌భుత్వం మాత్రం, హ‌మాస్ ఉగ్ర‌వాదులే ల‌క్ష్యంగా దాడులు జ‌రిపామ‌ని స్ప‌ష్టం చేసింది. రెండేళ్లుగా కొన‌సాగుతున్న దాడుల‌తో గాజా ప‌ట్ట‌ణం దాదాపు పూర్తిగా ధ్వంస‌మైంది. ప్ర‌స్తుతం అక్క‌డ క‌రువు ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. గాజా ఆరోగ్య శాఖ గ‌ణాంకాల ప్ర‌కారం ఇప్పటివరకు 64,000 మందికి పైగా పాలస్తీనియన్లు మృతిచెందినట్టు తెలుస్తోంది. వీరిలో సైనికులు కూడా ఉన్నారు. ఇదిలావుండ‌గా హమాస్‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ద్వారా యుద్ధాన్ని ముగించ‌డం చాలా క‌ష్ట‌మంటూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాగా ప్ర‌స్తుతం ఇజ్రాయిల్ జ‌రుపుతున్న దాడుల వ‌ల్ల‌, హ‌మాస్ వ‌ద్ద బందీలుగా వున్న 20మంది ప్రాణాల‌కు ముప్పు ఏర్ప‌డే ప్ర‌మాదం ఉందని  ఇజ్రాయిలీలు భ‌య‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో బందీల కుటుంబాల‌వారు ఈ దాడులు ఆపాలంటూ మంగళవారం రాత్రి ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూ నివాసం వద్ద నిరసనలు తెలిపినట్లు న్యూ యార్క్ టైమ్స్ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *