“కారు పార్కింగ్ స్లిప్ మీద “నా చావుకు ఎవరూ కారణం కాదు. జీవితం భారంగా ఉంది. ఇష్టం లేని జీవితం గడపాలని లేదు. పిల్లలను వదిలి వెళ్లలేక నాతోపాటు తీసుకెళ్తున్నా” అని రాసిందని తెలుస్తున్నది. తల్లి వైపు నుంచి చూస్తే తనకు దుర్భరంగా కనిపిస్తున్న ఈ ప్రపంచంలో తాను వెళ్లిపోయాక తన పిల్లల బతుకు ఏమైపోతుందో కనుక వాళ్లనూ తీసుకుపోవడమే తార్కికం అనిపించి ఉండవచ్చు. పిల్లలకు తల్లి మీద అపారమైన ప్రేమ అని తెలుస్తున్నది. అయినా తల్లి ఎంత నచ్చజెప్పినా స్వయంగా ప్రాణాలు తీసుకోవడానికి ఎందుకు ఎలా ఒప్పుకున్నారన్నది ప్రశ్న.”
ఈ వారం దినపత్రికల్లో ఒక వార్త చదివి మనసు వికలమైపోయింది. నాలుగైదు రోజులు గడిచినా ఇంకా ఆ దృశ్యమే మనసు మీద కదలాడి కంట తడి పెట్టిస్తున్నది. ఒక తల్లీ, చెరోపక్కనా ఆమె చేతులు పట్టుకుని ఇద్దరు ముక్కుపచ్చలారని బిడ్డలూ చాలా మామూలుగా రైల్వే పాట్ ఫారం మీద నడుస్తున్న దృశ్యం అది. ఆ సిసిటివి దృశ్యం అత్యంత సహజమైనది, సాధారణమైనది, తల్లీ బిడ్డల అనుబంధాన్ని తెలిపేది. కాని ఆ చిత్రంలో ఉన్న వ్యక్తులకు తర్వాత కొద్ది గంటల్లోనే ఏమయిందో, లేదా వాళ్లే స్వయంగా ఏం చేశారో తెలిస్తే మన సమాజం ఎంత ఒంటరిగా, ఎంత అమానుషంగా, ఎంత బీభత్సంగా మారిపోతున్నదో తెలియజెపుతుంది. ఆ సిసిటివి సాధారణ చిత్రం తర్వాత రెండు గంటల లోపలే ఆ తల్లీ ఇద్దరు బిడ్డలూ అర్ధరాత్రి రైలు పట్టాల వెంట రెండు మూడు కిలోమీటర్లు నడిచి, ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలుకు అడ్డంగా అంతే ప్రేమగా ఒకరినొకరు కావలించుకుని నిలబడ్డారు. ఆ తల్లి పిల్లలిద్దర్నీ గుండెలకు హత్తుకుని తాను బలవన్మరణం పాలయింది, పిల్లలనూ బలి చేసింది. ముగ్గురూ ఉద్దేశ పూర్వకంగా తమ ప్రాణాలు తామే తీసుకున్నారు. లేదా తల్లి ఉద్దేశాన్ని పిల్లలిద్దరూ ఆమోదించారు. ఈ విషాదవార్త చదివి కంట తడి పెట్టనివాళ్లుండరు. ఆ మనుషులు పరిచయం లేకపోవచ్చు, పత్రికావార్తగానే తెలిసి ఉండవచ్చు. కాని మనుషులు. ఏ మనిషి మరణమైనా విచారకరమే. అసహజ మరణం మరింత విచారకరం.
స్వయంగా సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న తల్లి విజయారెడ్డి. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న కూతురు చేతన, మొదటి సంవత్సరం చదువుతున్న కొడుకు విశాల్. దుబాయిలో ఉద్యోగం చేస్తున్న తండ్రి. ప్రాణం తీసుకోవడానికి పురికొల్పేంత ఆర్థిక సమస్యలు లేవనే ప్రాథమిక ఆధారాలు చెపుతున్నాయి. తల్లీ పిల్లలూ కూడా క్రమబద్ధమైన ఉద్యోగాల్లో, చదువుల్లో ఉన్నారు గనుక ప్రాణాలు తీసుకునేంత భారీ శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు కూడా లేవనే అనుకోవాలి. ఒక పల్లెటూరి నుంచి వచ్చి, ఇంజనీరింగ్ చదువుకుని సాఫ్ట్ వేర్ కంపెనీలో టీం హెడ్ గా పని చేస్తున్నదంటే ఆ యువతి జీవితంలో ఎంతోమంది కోరుకునేవి సాధించాననే సంతృప్తిలో కూడా ఉండి ఉండవచ్చు. పిల్లలూ రెసిడెన్షియల్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నారంటే, రేపో మాపో మెడిసినో, ఇంజనీరింగో చదివి ఉండేవాళ్లే.
కారు పార్కింగ్ స్లిప్ మీద “నా చావుకు ఎవరూ కారణం కాదు. జీవితం భారంగా ఉంది. ఇష్టం లేని జీవితం గడపాలని లేదు. పిల్లలను వదిలి వెళ్లలేక నాతోపాటు తీసుకెళ్తున్నా” అని రాసిందని తెలుస్తున్నది. తల్లి వైపు నుంచి చూస్తే తనకు దుర్భరంగా కనిపిస్తున్న ఈ ప్రపంచంలో తాను వెళ్లిపోయాక తన పిల్లల బతుకు ఏమైపోతుందో కనుక వాళ్లనూ తీసుకుపోవడమే తార్కికం అనిపించి ఉండవచ్చు. పిల్లలకు తల్లి మీద అపారమైన ప్రేమ అని తెలుస్తున్నది. అయినా తల్లి ఎంత నచ్చజెప్పినా స్వయంగా ప్రాణాలు తీసుకోవడానికి ఎందుకు ఎలా ఒప్పుకున్నారన్నది ప్రశ్న. సాయంత్రం కారులో పిల్లల హాస్టళ్లకు వెళ్లి వారిని తీసుకుని అర్ధరాత్రికి కొద్ది ముందు చెర్లపల్లి రైల్వేస్టేషన్ చేరి, ఒంటిగంట సమయంలో రైలు కింద పడ్డారంటే, ఆత్మహత్యకు కనీసం ఆరు గంటల తయారీ జరిగింది. ఆ తయారీలో తల్లి ప్రతిపాదనను పిల్లలు ఎలా అంగీకరించారు? ఏమి చర్చలు నడిచాయి? చివరికి రైలు తమ మీదికి దూసుకు వస్తున్నప్పుడు ఆ ముగ్గురిలో ఒక్కరిలోనైనా ఏదో ఒక జీవన లాలస మొలకెత్తలేదా?
“ఏ మనిషికైనా తన ప్రాణం తీసుకోవాలనే ఆలోచన రావడం చాలా తీవ్రమైన విషయం. ఇంత విలువైన జీవితాన్ని ఎవరైనా ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటారు? పండు వృద్ధులు కూడా జీవన కాంక్షకు ప్రదర్శిస్తున్నారే. యవ్వనంలో, మధ్య వయసులో ఉన్నవారే ఎందుకు ఎక్కువగా ఆత్మహత్యాలోచన చేస్తున్నారు? ఒక ఆత్మహత్య జరగగానే వారికి ఆర్థిక సమస్యలున్నాయా, కుటుంబ సమస్యలున్నాయా, సన్నిహితులతో ఎడబాటు ఉందా, తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్నాయా అని ఒక ఆనవాయితీ పరిశోధనా పద్ధతి ఉంది. ఒకరకంగా ఇది గంతలు కట్టుకున్న దృష్టి. ఆ సమస్యలు ఉన్నంతమాత్రాన ప్రాణాలు తీసుకోవచ్చా?”
ఆత్మహత్య అనేది అన్ని సందర్భాలలోనూ పిరికితనమే కానక్కరలేదు. తనను తాను చేతులారా తుడిచేసుకోవడానికి బతకడానికన్నా ఎక్కువ ధైర్యం కావాలి. క్షణికావేశంలో చేసుకునే ఆత్మహత్యలకు అంత ధైర్యం అవసరం లేకపోవచ్చు. అది ఒక పలాయన చర్య కావచ్చు. కాని ఉద్దేశపూర్వకంగా సుదీర్ఘంగా ఆలోచించి, పద్ధతి ప్రకారం అన్నీ సమకూర్చుకుని ఆత్మహత్య చేసుకోవడంలో ఎంతో కొంత తార్కికత, ధైర్యం ఉంటాయి. ఈ బతుకు కన్నా బతుకు లేకపోవడం మిన్న అనే ఒక తర్కం ఉంటుంది. మరణానంతరం ఏమీ మిగలదనే ఎరుక, లేదా తన మరణంతో ఎవరినో సాధించవచ్చునని, కక్ష తీర్చుకోవచ్చునని వాదన ఉంటుంది. ఒక నవ వధువు ఆత్మహత్యను విశ్లేషిస్తూ అది ఆమె మానసిక వైఫల్యం కన్న ఎక్కువగా సమాజ స్థితి మీధ, వివాహ వ్యవస్థ మీద నిరసన అని విశ్లేషిస్తూ మావో తన ఇరవై ఆరో ఏట కొన్ని వ్యాసాలు రాశాడు. అది ఫలితం సాధించని, కనీసం తమకేమీ ఫలితం ఇవ్వని నిరసన కూడా కావచ్చు. కాని అర్థం చేసుకుని, నేర్చుకోదలచుకుంటే సమాజానికి పాఠం చెప్పే నిరసన అవుతుంది.
అసలు ఏ అసహజ మరణమైనా సమాజ అనారోగ్యానికి చిహ్నం. ఆత్మహత్యలను, అసహజ మరణాలను వ్యక్తుల పరంగా చూసి, వారికి పలాయనవాదాన్నో, అధైర్యాన్నో, ఆత్మవిశ్వాసపు లేమినో అంటగట్టి సానుభూతి ఒలకబోసే బదులు, అసలు ఈ అసహజ మరణాలు, ఆత్మహత్యలు ఏ కారణాల వల్ల జరుగుతున్నాయి, ఆ వ్యక్తి మానసిక దౌర్బల్యం పాత్ర ఎంత, చుట్టూ ఉన్నవారి ఒత్తిడి, నిరాదరణ, నిర్లక్ష్యం, దుర్మార్గం పాత్ర ఎంత, మొత్తంగా సమాజం చేరి ఉన్న స్థితి కారణం ఎంత అని ఒక లోతైన విచికిత్స జరగకపోతే ఆత్మహత్యలు ఇంకా ఇంకా జరుగుతూనే ఉంటాయి. మనం ఆనాటికి అయ్యో అయ్యో అని మర్నాటికి మళ్లీ అయ్యో అయ్యో అనడానికి సిద్ధం కావలసి వస్తుంది.
ఏ మనిషికైనా తన ప్రాణం తీసుకోవాలనే ఆలోచన రావడం చాలా తీవ్రమైన విషయం. ఇంత విలువైన జీవితాన్ని ఎవరైనా ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటారు? పండు వృద్ధులు కూడా జీవన కాంక్షకు ప్రదర్శిస్తున్నారే. యవ్వనంలో, మధ్య వయసులో ఉన్నవారే ఎందుకు ఎక్కువగా ఆత్మహత్యాలోచన చేస్తున్నారు? ఒక ఆత్మహత్య జరగగానే వారికి ఆర్థిక సమస్యలున్నాయా, కుటుంబ సమస్యలున్నాయా, సన్నిహితులతో ఎడబాటు ఉందా, తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్నాయా అని ఒక ఆనవాయితీ పరిశోధనా పద్ధతి ఉంది. ఒకరకంగా ఇది గంతలు కట్టుకున్న దృష్టి. ఆ సమస్యలు ఉన్నంతమాత్రాన ప్రాణాలు తీసుకోవచ్చా? ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు లేవా? ప్రయత్నిస్తే పరిష్కారాలు సాధ్యమయ్యేవి కావా? పరిష్కరించడం సమాజ బాధ్యత కాదా? అసలు ఆత్మహత్యాలోచన ఏవో సమస్యల ఫలితమే అనే దృష్టి ఎందుకుండాలి? తప్పకుండా సమస్యల పాత్రా ఉంటుంది. కాని సమస్యల పరిష్కారం అసాధ్యమనే ఆత్మవిశ్వాస లేమి చాలా సందర్భాలలో ఆత్మహత్యకు పురికొల్పుతుంది.
కాని భౌతిక జీవిత సమస్యలతో పాటు, బహుశా వాటికన్న ఎక్కువగా ఆధునిక జీవిత సంక్లిష్టతలో మనుషులకు మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. మనుషులు అంతకంతకూ ఎక్కువగా ఒంటరులయిపోతున్నారు. చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ, సంతోషంగానే, ఆహ్లాదకరమైన జీవితమే గడుపుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, కనిపించని కుంగుబాటు ఒకటి మనుషులను నానాటికీ అగాథాలలోకి తోస్తున్న జీవితం మనచుట్టూ ఉన్నది. అటువంటి వ్యక్తులకు ఆర్థిక సమస్యలో, ఆరోగ్య సమస్యలో, జీవన సమస్యలో ఏమీ లేనట్టే అనిపించవచ్చు. కాని వారి మనసులోకి తొంగిచూడగలవారెవరు? చూస్తున్నవారెవరు? వారు ఎంతమందితో, కనీసం ఒక్కరితోనైనా మనసు విప్పి మాట్లాడగలిగిన పరిస్థితి ఉందా? తమ కోరికలు, భయాలు, ఆశలు, నిరాశలు, విజయాలు, వైఫల్యాలు ఏ ఒక్కరితోనైనా సంపూర్ణంగా పంచుకుని మనసు మీద ఒత్తిడి తుడిచేసుకోగలిగిన స్థితి ఉందా? అలా తుడిచేసుకోవడానికి జీవితం వారికి వ్యవధినిస్తున్నదా? అలా మరొకరి వ్యథ వినడానికి మనలో ఏ ఒక్కరికైనా తీరిక ఉన్నదా? వృత్తిపరమైన సలహా కేంద్రాలు, మానసిక వైద్య నిపుణులు వంటి సాంకేతిక ఏర్పాట్లు ఉండవచ్చు. కాని మానవ స్పర్శ ఉన్నదా? పొరుగువారి చెంపమీద కన్నీటి చుక్క తుడవడానికి మనకు తీరిక ఉన్నదా?
“సమాజానికీ వ్యక్తికీ మధ్య అవిభాజ్య సంబంధాన్ని తెగగొట్టి, పోటీపెట్టి, సమాజాన్ని వ్యక్తికి పరాయిగా, ప్రతి వ్యక్తినీ మరొక వ్యక్తికి పరాయిగా మారుస్తున్న ఈ సమాజంలో ఇటువంటి ఒంటరితనాలూ, అందువల్ల అసహజ మరణాలూ తప్పవు. ఇక వయసు నిండి కాలధర్మంగా మరణించడం ఉండదు. అనారోగ్యంతో, హత్యతో, ఆత్మహత్యతో, ప్రమాదాలలో జరిగే అసహజ మరణాలే పెరుగుతాయి.”
మనకు పూర్తి వివరాలు తెలియనప్పటికీ, ప్రస్తుత సందర్భంలోనే చూస్తే విజయా రెడ్డికి తల్లి, భర్త, పిల్లలు, సహోద్యోగులు, బంధు మిత్రులు ఎందరో ఉన్నారు. ఆమెలో ఆత్మహత్యాలోచనలు, ఆ ధోరణి ఉందని, ఆమె జీవితం భారంగా ఉన్నదని, ఇష్టం లేని జీవితాన్ని గడుపుతున్నదని ఒక్కరైనా గుర్తించారా? ఒక్కరితోనైనా ఆమె పంచుకున్నదా? ఒక్కరైనా ఆమెకు అలా పంచుకునే అవకాశం ఇచ్చారా? ఆత్మహత్యాలోచన పూర్తిగా ఆమెదే కావచ్చు, పిల్లలకు ఆ ఆలోచన ఏమీ లేకపోవచ్చు. కాని ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు తల్లిని ఆ ఆలోచన నుంచి మరల్చలేకపోయారా? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే జవాబు. పక్క మనిషి గురించి ఏమీ తెలియని, ఏమీ పట్టించుకోని స్థితికి మన సమాజం చేరింది అని. నిజంగా తీవ్రంగా ఆలోచించవలసిన సమస్య ఇది. ఇది ఒకరి మరణం సమస్య కాదు, మనందరి మానవీయ, సంఘ జీవిత మరణం సమస్య. సమాజ మరణం సమస్య.
ఒక మనిషి మరణం సమాజ మరణం ఎలా అవుతుంది అని ఎవరికైనా అనిపించవచ్చు. అసలు తిరగేసి చెప్పాలంటే సమాజ మరణమే మనిషి మరణంగా పరిణమిస్తున్నది, ప్రతిఫలిస్తున్నది. మనిషి అంటే సంఘజీవి అనే నిర్వచనం నుంచి మనిషిని ఒంటరిగా, మరింత ఒంటరిగా, సంకుచితంగా, ఇరుకుగా, స్వార్థజీవిగా, పొరుగు మనిషిని పట్టించుకోని మనిషిగా, పొరుగు మనిషిని పట్టించుకోవడాన్ని అసహ్యించుకునే మనిషిగా మార్చిన సామాజిక స్థితి ఒకటి వచ్చింది. ఒకప్పుడు మనిషి అజాతశత్రువు కావడం ఆదర్శంగా ఉండేది, ఇప్పుడు సకలలోకమూ శత్రువైన మనిషే, సకలలోకాన్నీ శత్రువుగా భావించి తనంతట తాను పైపైకి పాకుతూ పోగలిగే సరీసృపమే మనిషి అనే కొత్త నిర్వచనం వచ్చి చేరింది. అలా శిఖరారోహణ చేసిన మనిషికి మరొక మనిషి తోడూ, నీడా లేదు.
సమాజానికీ వ్యక్తికీ మధ్య అవిభాజ్య సంబంధాన్ని తెగగొట్టి, పోటీపెట్టి, సమాజాన్ని వ్యక్తికి పరాయిగా, ప్రతి వ్యక్తినీ మరొక వ్యక్తికి పరాయిగా మారుస్తున్న ఈ సమాజంలో ఇటువంటి ఒంటరితనాలూ, అందువల్ల అసహజ మరణాలూ తప్పవు. ఇక వయసు నిండి కాలధర్మంగా మరణించడం ఉండదు. అనారోగ్యంతో, హత్యతో, ఆత్మహత్యతో, ప్రమాదాలలో జరిగే అసహజ మరణాలే పెరుగుతాయి.
పారిశ్రామిక విప్లవం తర్వాత మనిషి ప్రకృతి నుంచి, దైవం నుంచి దూరమై పరాయీకరణకు గురయ్యే స్థితి వచ్చిందని యూరపియన్ తాత్వికులు చేసిన ప్రతిపాదనను మార్క్స్ ఇంకా విస్తరించి ఆధునిక, పారిశ్రామిక యుగంలో మనిషి నాలుగు స్థాయిల పరాయీకరణకు గురవుతున్నారని సూత్రీకరించాడు. తన రక్తమాంసాలు, మొత్తం వ్యక్తిత్వం రంగరించి తయారు చేసిన, తన శ్రమ ఫలితమైన ఉత్పత్తి నుంచి శ్రామికులు పరాయి కావడం ఒక స్థాయి. తమ శ్రమ ఏమి ఉత్పత్తి చేస్తున్నదో తెలియని శ్రమవిభజన వల్ల అసలు ఉత్పత్తి ప్రక్రియ నుంచి పరాయి కావడం రెండో స్థాయి. ఆ శ్రమ విభజన వల్లనే తోటి శ్రామికులెవరో, ఎక్కడ శ్రమ చేస్తున్నారో, ఎందుకోసం శ్రమ చేస్తున్నారో తెలియని తోటి శ్రామికుల నుంచి పరాయీకరణ మూడో స్థాయి. ఈ మూడు స్థాయిల పరాయీకరణ వల్ల అసలు తన మానవ స్వభావం నుంచి తానే పరాయి అయిపోవడం, మనిషి మనిషి కాకుండా పోవడం నాలుగో స్థాయి. ఇది ఇవాళ మన సమాజంలో మన కళ్ల ముందర అక్షరాలా కనబడుతున్న పరాయీకరణ. జీవితం భారంగా ఉందనీ, ఇష్టం లేని జీవితం గడుపుతున్నాననీ ఒక మనిషి అనుకోవడం ఈ పరాయీకరణ ఫలితమే.





