మనిషి ప్రాణం విలువ తెలిసిన సమాజమేనా?

n venugopalనాలుగు రోజులుగా శ్రీశైలం లెఫ్ట్ ‌బ్యాంక్‌ ‌కెనాల్‌ ‌సొరంగంలో చిక్కుకుపోయిన అభాగ్యుల కోసం నిస్సహాయ ఆగ్రహం, ఓపలేని దుఃఖం పోటెత్తుతున్నాయి. శనివారం పొద్దున ఆ చీకటి గుయ్యారంలో దిగ్బంధంలోకి పోయిన ఆ ఎనిమిది మంది ప్రాణాలు ఇది రాస్తున్న సమయానికి ఇంకా నిలిచి ఉన్నాయో లేదో తెలియదు. వాళ్లను సజీవంగా బైటికి తీసుకు రాగలమా లేదా తెలియదు. కాని ఈలోగా, ఆ సొరంగ నిర్మాణ ప్రారంభం దగ్గరి నుంచి నిన్నా ఇవాళా అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు వ్యవహ రిస్తున్న తీరు దాకా చూస్తే మన సమాజం మనిషి ప్రాణం విలువ తెలియని మొరటుతనంలోకి ఎంతగా దిగజారి పోతున్నదో కళ్లకు కడుతున్నది. మనుషుల సమూహమైన సమాజం మనిషంటే ఎంత లెక్క లేకుండా ప్రవర్తిస్తున్నదో బహిరంగంగా కనబడుతున్నది. ఇదేదో మనిషి కోసం తపించే శుష్క మానవవాద ఆదర్శం కాదు. ప్రతి మనిషి ప్రాణమూ విలువైనదే. ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక రకంగా సామాజిక నిర్మాణంలో, సంపదలో అనివార్య భాగంగా ఉండేదే. ఒక మనిషి,లేదా కొందరు మనుషులు ప్రమాదవశాత్తూ ప్రాణాంతక స్థితిలో చిక్కుకు న్నప్పుడు సమాజం ఎంత మానవీయంగా ఆలోచించాలి, వాళ్లను ఆ స్థితి నుంచి బైటికి తీసుకురా వడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేయాలి, వాళ్లను ఆ స్థితికి నెట్టిన వ్యక్తులనూ, వ్యవస్థ లనూ ఎట్లా చూడాలి వంటి మౌలిక సామాజిక ప్రశ్నలు మనకు తెలుసునా అని ఆశ్చర్యం కలుగుతున్నది. మనం ప్రగల్భాలు పలుకు తున్న ఆధునికతా, నాగరి కతా, శాస్త్ర సాంకేతిక పరి జ్ఞాన అభివృద్ధీ అన్నీ హాస్యా స్పదమని తేలిపో తున్నాయి.

ఇటువంటి ప్రమాదాలు, దుర్ఘటనలు జరిగిన ప్రతి సందర్భంలోనూ ఇది ప్రకృతి వైపరీత్యమా, మానవ తప్పిదమా,మానవ నిర్లక్ష్యమా అనే ప్రశ్న తలెత్తుతుంటుంది. ప్రకృతి వైపరీత్యం అనేస్తే మన బాధ్యత తప్పి పోతుంది. మన చేతుల్లో లేనిది జరిగిపోయిందనీ, అందుకు ప్రకృతి, భగవంతుడు మాత్రమే కారణమనీ, ప్రాణాలు పోగొట్టుకు న్నవాళ్లు వాళ్ల కర్మ కొద్దీ చనిపోయారనీ మనం ఆత్మసంతృప్తి పడవచ్చు. అందులో మానవ తప్పిదానిదే, నిర్లక్ష్యానిదే ప్రధాన పాత్ర అనో, ఏకైక పాత్ర అనో ఒప్పుకోక తప్పని స్థితి వచ్చినప్పుడు కూడా అందుకు ఏదో కింది స్థాయి బాధ్యులను బలిపశువులుగా చూపి, శిక్షించి, అసలు కారణాల నుంచి తప్పించుకోవచ్చు.

నిజానికి ప్రస్తుత ప్రమాదానికి మన రాజకీ యార్థిక వ్యవస్థలో మూలాలున్నాయి. ప్రమాద రహితమైన, ప్రమాదాలు స్వల్పంగా ఉండే సాంకేతిక విధా నాన్ని ఎంచుకోకపోవడం, కాంట్రాక్టర్లకు పని అప్పగించి నప్పుడు వారి పని తీరును నియంత్రించకపోవడం, ప్రభుత్వ సంస్థలు తమ పనులను సక్రమంగా నిర్వర్తించ కపోవడం, ప్రమాదం జరిగిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన వేగవం తమైన సహాయ చర్యలు చేపట్టకపోవడం, అక్రమాలు, అవినీతి, రాజకీయ ఆరోపణలే ప్రధానమైన స్థితి – మన వ్యవస్థ మనిషిని ఎంత విలువలేని, సులభంగా వదిలించు కోగలిగిన, పట్టించుకోనక్కరలేని వస్తువుగా చూస్తుందనే కారణం అతి ప్రధానమైనది.

ఇప్పటికే తొంబై ఆరు గంటలు గడిచి పోయాయి గనుక ఆ ఎనిమిది మంది అభాగ్యులూ ప్రాణాలతో తిరిగి రాలేకపోవచ్చు. లేదా, 2023 ఉత్తరాఖండ్‌ ‌సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 41 మంది శ్రామికులు పదహారు రోజుల తర్వాత క్షేమంగా బైటపడినట్టు ఈ ఎనిమిది మంది కూడా మృత్యుంజయుల్లా బైటపడవచ్చు. అలా బైటికి రావాలనే ఆశిద్దాం. కాని ఇటువంటి ఉదంతాలు అందులో చిక్కుకున్న వారికి మాత్రమే కాదు, దాన్ని గమనిస్తున్న వారందరికీ కఠిన పరీక్షే. సమాజ స్థితి గురించీ,రాజకీయ నాయకుల అల్పత్వం గురించీ, వ్యాపారవేత్తల అక్రమాల గురించీ, అవినీతి గురించీ దొరికే అవసరమైన జవాబులే ఈ పరీక్షా ఫలితం.

కృష్ణా జలాలలో తెలంగాణ వాటాలో భాగంగా నాగార్జునసాగర్‌ ‌నుంచి పంపింగ్‌ ‌ద్వారా అప్పటి ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌,ఉమ్మడి నల్లగొండ జిల్లాలకు సాగు నీరు, తాగు నీరు, హైదరాబాద్‌ ‌కు తాగు నీరు అందించడానికి 2004 వరకే ఒక పథకం ఉండింది. కాని పంపింగ్‌, ‌విద్యుచ్చక్తి సమస్యల వల్ల ఆ పథకం స్థానంలో,ఎగువన శ్రీశైలం జలాశయం నుంచి ఆ ప్రయోజనాలు నెరవేర్చాలనే ఆలోచన ఫలితంగా శ్రీశైలం లెఫ్ట్ ‌బ్యాంక్‌ ‌కెనాల్‌ ‌పథకం వచ్చింది. శ్రీశైలం జలాశయం నల్లమల పర్వత శ్రేణుల మధ్య లోయలో ఉండడంతో ఎడమవైపు భూమి మీద కాలువ తవ్వడానికి వీలులేదు. అందువల్ల శ్రీశైలం జలాశయం చివర అప్పటి మహబూబ్‌ ‌నగర్‌ (ఇప్పటి నాగర్‌ ‌కర్నూలు) జిల్లా దోమలపెంట నుంచి నల్లగొండ జిల్లా నక్కలగండి వరకు 43.93 కి.మీ. దూరం సొరంగం తవ్వక తప్పదు.

దాదాపు పది మీటర్ల వ్యాసం గల ఆ సొరంగాన్ని రెండు వైపులా నుంచీ తవ్వుతూ రావాలని, 2005లో ప్రారంభించి ఈ సొరంగం తవ్వకం 2010 వరకు అయిపోవాలని ప్రణాళికలు రచించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వులు 2005లోనే వెలువడినా అధికారిక ప్రక్రియలన్నీ పూర్తయి వాస్తవంగా తవ్వకాలు 2007లో మొదలయ్యాయి. రాష్ట్ర విభజన ఉద్యమ కాలంలో నత్త నడక నడిచిన పనులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ మాత్రం వేగం కూడా అందుకోలేక, చివరికి 2019లో పూర్తిగా ఆగిపోయాయి. ఐదు సంవ త్సరాల తర్వాత ఇటీవల మళ్లీ ప్రారంభం కాగా, ఇం తలో ఈ దుర్ఘటన జరిగి ంది. ఇప్పటికే నక్కలగండి నుంచి తవ్వవలసిన 23.980 కి.మీ. దూరంలో 20. 435 కి.మీ., దోమల పెంట నుంచి తవ్వ వలసిన 19.500 కి.మీ దూరంలో 13. 995 కి.మీ. పూర్త యింది. అంటే ఇటు వైపు నుంచి మరొక 3.555 కి.మీ., అటువైపు నుంచి మరొక 5.405 కి.మీ. తవ్వవలసి ఉంది.

అయితే ఈ మాటలు చెప్పినంత, రాసినంత సులభం కాదు. భూగర్భం లోపల కొన్ని వందల అడుగుల లోతున టన్నెల్‌ ‌బోరింగ్‌ ‌మెషిన్‌ అనే యంత్రం సొరంగాన్ని తవ్వుతూ ఉండగా ఆ యంత్రంతో పాటు దాన్ని నడిపే, నిర్వహించే సాంకేతిక నిపుణులు వెళుతూ ఉండాలి. తవ్వుతున్నప్పుడు వచ్చే మట్టిని, రాళ్లను,భూగర్భం లోపల, అదీ జలాశయ పరిసర ప్రాంతంలో, దట్టమైన అడవి కింద కావడం వల్ల వచ్చే నీటి ఊటలతో పేరుకుపోయే బురదను ఎప్పటికప్పుడు తవ్వి పోయడానికి మనుషులు కావాలి. దాన్నంతా బైటికి పంపించడానికి కన్వేయర్‌ ‌బెల్టులు, ఆ సామాగ్రిని, మనుషులను అటూ ఇటూ తీసుకుపోవడానికి తాత్కాలిక రైలు పట్టాలు, పెట్టెలు, తవ్వడానికీ, ఎత్తిపో యడానికీ, ఎప్పటికప్పుడు పైకప్పు, గోడలు కూలి పడకుండా తాపడంచేయడానికీ, గోడలు కట్టడానికీ ఆధునిక యంత్ర పరికరాలు ఎన్నో కావలసి ఉంటుంది. భూగర్భంలోపల పది పన్నెండు కి.మీ. అవతల సొరంగంలో పని చేస్తున్నారు గనుక అక్కడి మనుషులకు తప్పనిసరిగా ఆక్సిజన్‌ ‌సిలిండర్లు ఉండవలసి ఉంటుంది. ఆహార పానీయాల అవసరం ఉంటుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే, అది భూమిని తొలిచి పోసే విధ్వంస కార్యక్రమంగా కనబడుతుంది గాని వాస్తవంగా ఒక మహాద్భుతమైన నిర్మాణ మహా సంరంభం. ఆ నిర్మాణంలో తమ ప్రాణాలనూ భద్రతనూ కూడా లెక్క చేయకుండా పాల్గొంటున్న వారికి సమాజమంతా కృతజ్ఞతలు చెప్పవలసి ఉంటుంది. వారు కేవలం ఉద్యోగం గానో, ఉపాధి గానో ఆ పనులు చేస్తుండవచ్చు. దేశంలో ఉన్న భయానకమైన నిరుద్యోగం వల్ల దిక్కులేక ఈ పని చాల కష్టభరితమైనదని తెలిసి కూడా ఎక్కడో కశ్మీర్‌, ‌పంజాబ్‌,ఉత్తరప్రదేశ్‌, ‌జార్ఖండ్‌ల నుంచి ఇక్కడికి వలస కార్మికులుగా వచ్చి ఉండవచ్చు.

ఒక మనిషి,లేదా కొందరు మనుషులు ప్రమాదవశాత్తూ ప్రాణాంతక స్థితిలో చిక్కుకున్నప్పుడు సమాజం ఎంత మానవీయంగా ఆలోచించాలి,వాళ్లను ఆ స్థితి నుంచి బైటికి తీసుకురావడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేయాలి, వాళ్లను ఆ స్థితికి నెట్టిన వ్యక్తులనూ,వ్యవస్థలనూ ఎట్లా చూడాలి వంటి మౌలిక సామాజిక ప్రశ్నలు మనకు తెలుసునా అని ఆశ్చర్యం కలుగుతున్నది. మనం ప్రగల్భాలు పలుకుతున్న ఆధునికతా, నాగరికతా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధీ అన్నీ హాస్యాస్పదమని తేలిపోతున్నాయి.

ఈ వ్యవహారమంతా సాంకేతికమైనదని, దాని గురించి నిపుణులు మాత్రమే ఆలోచించాలని, సాధారణ ప్రజలకు ఈ విషయాలు మాట్లాడే అర్హత, యోగ్యత లేవని కూడా కొందరు అంటారు. కాని సొరంగ మార్గ నిర్మాణం చేయాలనే ఆలోచన నుంచి ఇప్పుడు జరిగిన దుర్ఘటన దాకా అన్నీ రాజకీయార్థిక, సామాజిక మూలాలున్న అంశాలే. తప్పనిసరిగా సమాజంలో ప్రతి ఒక్కరూ తమ స్పందనను, తమ అభిప్రాయాన్ని ప్రకటించవలసినవే. సొరంగ నిర్మాణాల విషయంలో ప్రపంచమంతా అత్యాధునిక యంత్ర ప్రరికరాల వినియోగంలో, అతి తక్కువ మానవ జోక్యంతో పనులు సాగిస్తున్నప్పుడు, మన పాలకులు మానవ శ్రమ, అది కూడా ఇతర రాష్ట్రాల చౌక శ్రమ వాడే అవకాశం తీసుకున్నారు. ప్రభుత్వం 2005లో ఈ సొరంగం పనిని ఈపీసీ (ఇంజనీరింగ్‌, ‌ప్రొక్యూర్మెంట్‌, ‌కన్‌ ‌స్ట్రక్షన్‌) ‌ప్రాతిపదిక మీద టెండర్లు పిలిచింది.

సాధా రణంగా ఈపీసీ కాంట్రా క్టులలో ప్రభుత్వ జోక్యం తక్కువ. ప్రభుత్వం నిర్దేశించిన అవసరాల మేరకు డిజైన్‌ ‌చేయడం,అవసరమైన సామాగ్రి సమకూర్చుకోవడం, నిర్మాణ పనులు చేయడం పూర్తిగా కాంట్రాక్టర్‌ ‌బాధ్యతే. ఈ సొరంగ నిర్మాణానికి రు. 2259 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం టెండర్లు పిలవగా,వేలం పాటలో 9 శాతం తక్కువ ఖర్చుతో నిర్మిస్తానని ముందుకు వచ్చిన జేపీ అసోసియేట్స్ ఆ ‌కాంట్రాక్టును దక్కించుకుంది. అలా 2005 ఆగస్టులో కుదిరిన ఒప్పందంతో రు. 1925 కోట్లకే ఈ సొరంగం పని చేయడానికి సిద్ధపడింది. గడిచిన ఇరవై ఏళ్లలో ఈ వ్యయం దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలకు చేరిందని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం వేసిన లెక్క కన్నా తొమ్మిది శాతం తక్కువకు పని చేయగలనని అన్నప్పుడే కాంట్రాక్టర్‌ అం‌దులో కూడా తనకు మిగులు ఉంటుందనో, లేదా, తక్కువ ఖర్చుతో పని వెళ్లదీయాలనో అనుకుని ఉండాలి.

నల్లమల పర్వత ప్రాంతంలోని భూభౌతిక స్థితి ఏమిటి, ఈ సొరంగం తవ్వుతున్న మార్గంలో ఎటువంటి రాతి నేలలున్నాయి,తేలికపాటి మొరం, మట్టితో వదులుగా ఉందా, భూగర్భ జలధారలున్నాయా వంటి సమగ్ర పరిశోధన చేయగలిగిన ప్రభుత్వ సంస్థలున్నాయి. కాంట్రాక్టు కంపెనీ ఆ ప్రభుత్వ సంస్థల నుంచి అత్యవసరమైన ఈ సమాచారం సేకరించిందో లేదో తెలియదు. బైటికి పరుగెత్తుకొచ్చిన శ్రామికులను, లోపల చిక్కుకుపోయిన శ్రామికులను చూస్తే వీలయినంత చౌక, వలస శ్రామికులతో పని వెళ్లదీయాలని ఆ కంపెనీ భావించిందని కనబడుతున్నది. చౌక శ్రామికుల కోసం ప్రయత్నించినవారు మేలిరకం పరికరాలు,యంత్రాలు వాడుతారని నమ్మకం లేదు. అలాగే భూగర్భంలో ఇన్ని కిలోమీటర్ల దూరంలో పని చేస్తున్నవారికి తప్పనిసరిగా అవసరమైన ఆక్సిజన్‌, ‌గాలి, వెలుతురు కల్పించారో లేదో కూడా తెలియదు.

ఆ కాంట్రాక్టర్‌ ‌పని తీరును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నియంత్రించిందో లేదో కూడా తెలియదు. రాజకీయ, వ్యాపార ప్రముఖులు ప్రమాదాలలో చిక్కుకున్నప్పుడు జరిగే హడావుడి ఈ ఎనిమిది మంది అభాగ్యుల విషయంలో ఎక్కడా కనబడ లేదు.మనుషుల ప్రాణాలు కాపాడడం కోసం కాంట్రాక్టు కంపెనీ,ప్రభుత్వం ఎంత కష్టమైనా భరించ దలచుకున్నాయనీ, ఎంత ఖర్చయినా వెనుకాడబోవనీ సందేశం ఇప్పటికైతే లేదు. ముఖ్యమంత్రీ మంత్రులూ మాట్లాడారు, ప్రధాన మంత్రీ, కేంద్ర మంత్రులూ, ప్రతిపక్ష నాయకులూ పరామర్శించారు. కాని ఆ మాటలు చేతల్లోకి మారి ఉంటే నాలుగు రోజులుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అనే పరిస్థితి ఉండేది కాదు.

ఈ వ్యవహారమంతా ఇలా ఉండగా, అధికార, ప్రతిపక్ష నాయకులు ఈ మానవ ప్రాణాల సమస్యను తమ రాజకీయ ప్రయోజనాల కోసం మలచుకుంటూ అచ్చంగా శవం మీద పేలాలు ఏరుకుతినేవాళ్లలా ప్రవర్తిస్తున్నారు. అటువైపైనా, ఇటు వైపైనా నాయకుల ఆరోపణల, ప్రత్యా రోపణల గందరగోళంలో జరిగిన,జరుగుతున్న విషాదం కన్న ఎక్కువగా అవతలి వాళ్ల మీద దాడి కనబ డుతున్నది. మీరేం చేశారు అంటే, మీరేం చేశారు అనే కీచులాటలే ప్రధానంగా వినబడుతున్నాయి. సమయానికి జరుగుతున్న ఎన్నికల ప్రచారాస్త్రాలుగా ఈ విషాదాన్ని మార్చుకోవడం కనబడు తున్నది. లేదా ప్రమాదాలు సహజమే అనే మెట్టవేదాంతం వినబడుతున్నది.

ఇప్పటికే తొంబై ఆరు గంటలు గడిచి పోయాయి గనుక ఆ ఎనిమిది మంది అభాగ్యులూ ప్రాణాలతో తిరిగి రాలేకపోవచ్చు. లేదా, 2023 ఉత్తరాఖండ్‌ ‌సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 41 మంది శ్రామికులు పదహారు రోజుల తర్వాత క్షేమంగా బైటపడినట్టు ఈ ఎనిమిది మంది కూడా మృత్యుంజయుల్లా బైటపడవచ్చు. అలా బైటికి రావాలనే ఆశిద్దాం. కాని ఇటువంటి ఉదంతాలు అందులో చిక్కుకున్న వారికి మాత్రమే కాదు, దాన్ని గమనిస్తున్న వారందరికీ కఠిన పరీక్షే. సమాజ స్థితి గురించీ,రాజకీయ నాయకుల అల్పత్వం గురించీ, వ్యాపారవేత్తల అక్రమాల గురించీ, అవినీతి గురించీ దొరికే అవసరమైన జవాబులే ఈ పరీక్షా ఫలితం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *