సాగునీటి వ‌న‌రుల ప‌రిర‌క్ష‌ణపై ప్ర‌త్యేక దృష్టి

– రైతులు న‌ష్ట‌పోవ‌ద్ద‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం
– ప‌రిశీల‌న‌లో సాగునీటి సంఘాల ఏర్పాటు
– మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 29: సాగునీటి చెరువులు,కుంటలు,కాలువల పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయానుసారం సాగునీటి సంఘాల ఏర్పాటుపై సమాలోచనలు జరుపుతున్నట్లు వెల్లడించారు. తాజాగా వర్షాల ఉధృతికి చిన్న నీటిపారుదల శాఖ పరిధిలోని చెరువులు,కుంటలకు గండ్లు పడడం,కాలువలు తెగిపోవడం వంటి అంశాలతోపాటు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచడం, సీతారామ, చనకా-కొరటా, సీతమ్మ సాగర్,మోడీకుంట వాగు అనుమతులతోపాటు ఎస్.ఎల్.బి.సి పనుల పునరుద్ధరణ పై సోమవారం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  చెరువులు,కుంటలు, కాలువల భద్రత కోసం అన్ని విధాలుగా అధ్యయనం చేస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్ట పోవొద్ద‌న్నదే ప్రభుత్వ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణా రైతాంగా ప్రయోజనాలను కాపాడడంతో పాటు సాగునీటి అంశంలో ఎటువంటి అవాంతరాలు ఎదురు కాకుండా ఉండేందుకు వీలుగా సాగునీటి సంఘాల ఏర్పాటును పరిశీలనలోకి తీసుకున్నామన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం సాగునీటి సంఘాల ఏర్పాటు ఉండేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చిన్న  సాగునీటి చేరువుల పరిరక్షణ నిమిత్తం  సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసిన పక్షంలో  క్రమ క్రమంగా భారీ నీటి తరహా ప్రాజెక్టులకు విస్తరించేందుకు దోహద పడుతుందన్నారు. సాగునీటి సంఘంతో లష్కర్ తోపాటు సిబ్బంది, నీటిపారుదల శాఖ ఆపరేషన్&మెయింటెనెన్స్ విభాగం సమన్వయం చేసుకుని పనిచేసేలా సమన్వయం చేయగలిగితే సత్ఫాలితాలు సాధించగలమని  ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తం ఈ సంఘాలకు సంబంధిత డిప్యూటీ ఇంజినీర్ కన్వీనర్ గా వ్యవరించేలా విధి విధానాలు ఉంటాయని  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 1997 నాటి నీటివనరుల అభివృద్ధి సంస్థ రూపొందించిన చట్టం ప్రకారమే సాగునీటి సంఘాలకు కాలువల నిర్వహణ,నీటి పంపిణీ ,చెరువుల పరిరక్షణ బాధ్యత ఉంటుందని,నిబంధనలకు అనుగుణంగా సాగునీటి సంఘాలకు చట్టపరమైన, పాలనాపరమైన తోడ్పాటు ఉండేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. 2018-19 లో నీటి సెస్సు న రద్దు చేసిన మీదట సాగునీటి సంఘాలు కేవలం కాగితాలకే పరిమితము కావడంతో తాజాగా సంభవించిన వర్షపు ఉధృతికి చిన్న  నీటిపారుదల చెరువులు,కుంటలు,కాలువలు దేబ్బతిన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా రైతులు వర్షాకాలంలో భారీగా నష్టపోతున్నారని చెప్పారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న మీదట చెరువులు,కుంటలు,కాలువల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి సాగునీటి సంఘాల ఏర్పాటుపై దృష్టి సారించామన్నారు. సాగునీటి సంఘాల ఏర్పాటుతో సాగునీటి నిర్వహణతోపాటు,చెరువులు,కుంటలు,కాలువలకు భద్రత కలిపించే చర్యలు సాగునీటి సంఘాలకు బాధ్యత ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అందుకనుగుణంగా సాగునీటి సంఘాలలో రైతుల ప్రాతినిధ్యం కోసం తెలంగాణ అగ్రికల్చర్, ఫార్మర్స్ వెల్ఫెర్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కమిషన్ సభ్యుల సమన్వయంతో సాగునీటి సంఘాలను నామినేట్ చేసే విదంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈమేరకు కమిషన్ చైర్మన్ యం. కోదండ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం చిన్న సాగునీటి చెరువులు నిర్లక్ష్యానికి గురవడంతోపాటు వర్షాలకు చెరువులకు గండ్లు పడి రైతాంగం నష్టపోతున్న అంశాన్ని మంత్రి ఉత్తమ్ కి నివేదిక రూపంలో అందించారు. అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు సాగునీటి సంఘాలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను ఆ బృందం వివరించింది. మానవ వనరులతోపాటు లష్కర్, సిబ్బంది, ఆర్థిక వనరులతో సాగునీటి సంఘాలను బలోపేతం చేయడం వంటి అంశాలతో కమిషన్ ప్రతినిధుల బృందం ప్రత్యేకంగా రూపొందించిన అంశాలను మంత్రికి సిఫార్సు చేశారు. కర్ణాటక  రాష్ట్రం ఆల్మట్టి ఎత్తు పెంపుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ సుప్రీంకోర్టులో చట్టపరమైన పోరాటానికి సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు పెండింగ్ లో ఉన్న సీతారామ,చనకా-కొరటా,సీతమ్మ సాగర్,మోడీకుంట వాగు వంటి ప్రాజెక్టుల అనుమతులను త్వరితగతిన తీసుకునేలా పనులు వేగవంతం చెయాలని, తమ్మిడిహట్టి వద్ద తలపెట్టిన చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టుకు సంబందించిన డిపిఆర్ లను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మంత్రివర్గ ఆమోదం పొందిన మీదట ఎస్.ఎల్.బి.సి పనుల పునరుద్ధరణ ఉంటుందన్నారు. చిన్న కాళేశ్వరం, కల్వకుర్తి, దేవాదుల ప్యాకేజి-6 తదితర ప్రాజెక్టులకు సంబంధించిన సవరించిన అంచనాలు మంత్రివర్గ ఆమోదం తీసుకోబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. స‌మావేశంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, నీటిపారుదల శాఖ సలహాదారుడు అదిత్య‌నాధ్ దాస్, ఇఎన్.సిలు అంజద్ హుస్సేన్, శ్రీనివాస్, రమేష్ బాబు లతో పాటు సి.ఇలు అజయ్ కుమార్,మధుసూదన్ రెడ్డి,శ్రీనివాస్,పి.వి నాగేందర్,శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘ఆల్మట్టి’పై కేటీఆర్‌ కామెంట్స్‌ మంత్రి కౌంటర్‌

ప్రాజెక్టులపై బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తవమ్‌ చిట్‌చాట్‌గా మాట్లాడుతూ విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.. ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని సుప్రీంకోర్టు స్టే ఉంది.. ఆల్మట్టి ఎత్తు పెంపునకు మేం వ్యతిరేకం..ఎట్టి పరిస్థితుల్లో ఎత్తు పెంచకుండా అడ్డుకుంటాం అని మంత్రి ఉత్తమ్‌ కౌంటర్‌ ఇచ్చారు. సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేస్తామని, అక్కడ వాదనలు వినిపించేందుకు సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ను నియమించామని తెలిపారు. కృష్ణా గోదావరి నీటి వాటాలో కాంగ్రెస్‌ హయంలోనే తెలంగాణకు న్యాయం జరిగిందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయమే జరిగిందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *