చెక్‌పోస్టుల తొల‌గింపుతో రాష్ట్ర భ‌ద్ర‌త‌కు ముప్పు

– వంద‌లాది సిబ్బంది భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌కం
– అక్ర‌మ చొర‌బాట్లు జ‌రిగే అవ‌కాశం
– టెక్నాల‌జీపై అతివిశ్వాసం త‌గ‌దు
– ఖాలీ పోస్టుల్లో నియ‌మించ‌డం కంటి తుడుపు చ‌ర్యే

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 23: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్టులన్నింటినీ హుటాహుటిన ఎత్తివేస్తూ, వాటి స్థానంలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏ ఎన్ పి ఆర్) అనే అత్యాధునిక సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రవాణా వ్యవస్థలో ఒక తీవ్ర చర్చకు దారితీసింది. రవాణా శాఖ కమిషనర్ అక్టోబర్ 22న జారీ చేసిన ఈ ఉత్తర్వులు, ఒకవైపు రవాణాలో పారదర్శకతను పెంచే ప్రయత్నంగా కనిపిస్తున్నా మరోవైపు వందలాదిమంది సిబ్బంది భవిష్యత్తు, రాష్ట్ర భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ నిర్ణయం కేవలం ‘సాంకేతిక సంస్కరణ’ కాదని, పాత ఉద్యోగుల భవిష్యత్తును బలితీసుకుంటూ, భద్రతా వ్యవస్థను బలహీనం చేసే ఆందోళనకరమైన ప్రయోగంగా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద పనిచేస్తున్న సుమారు 70 మంది ఎంవీఐలు, ఏఎంవీఐలు ఇతర రెగ్యులర్ సిబ్బందిని రవాణా శాఖలోని ఖాళీ పోస్టుల్లో నియమిస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన వినడానికి ఊరటనిచ్చినా,ఇది కంటితుడుపు చర్య మాత్రమేనని ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. వీరేకాక ఈ చెక్ పోస్టుల మీద ఆధారపడి జీవనం సాగించే కాంట్రాక్ట్ సిబ్బంది, దినసరి కార్మికులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు వంటి వందలాదిమంది ఉపాధి పూర్తిగా ప్రమాదంలో పడింది. వీరికి కొత్త ఉద్యోగాల గురించి ప్రభుత్వం ఎక్కడా స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఏళ్ల తరబడి సరిహద్దు ప్రాంతాలలో పనిచేసి అక్కడే స్థిరపడిన ప్రభుత్వ ఉద్యోగులను, సరైన ప్రత్యామ్నాయ శిక్షణ లేకుండా కొత్త టెక్నాలజీ ఆధారిత పాత్రల్లోకి బలవంతంగా నెట్టడం అనేది మానవతా దృక్పథాన్ని పూర్తిగా విస్మరించడమే. ఒక ఉద్యోగికి తన ప్రాంతంలో, తనకు అలవాటైన పనిలో భద్రత లేకుండా కొత్త బాధ్యతల పేరుతో దూర ప్రాంతాలకు బదిలీ చేయటం ఉద్యోగ భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. రవాణాలో పారదర్శకత అనేది ముఖ్యం అయినప్పటికీ ఆ పేరుతో వందలాది కుటుంబాలను బలి చేయడం ఎంతవరకు సమంజసమనే తీవ్రమైన ప్రశ్న వినిపిస్తోంది.
ఏఎన్ పిఆర్ విధానం ఎంత అడ్వాన్స్‌డ్ కెమెరా సిస్టం అయినప్పటికీ ఇది కేవలం నంబర్ ప్లేట్‌ను గుర్తించగలుగుతుంది, కానీ కంటెంట్‌ను లేదా మానవ తప్పిదాలను గుర్తించలేదు. ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర భద్రతకు తీవ్ర ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సరిహద్దుల్లో పనిచేసే అధికారులు పర్మిట్లను మాత్రమే కాకుండా వాహనంలోని వ్యక్తులను, సరుకును కళ్లారా చూసి అనుమానం వస్తే తనిఖీ చేస్తారు. చెక్ పోస్టులు లేకపోవడంతో అంతరాష్ట్ర దొంగతనాలు, అక్రమ చొరబాట్లు యథేచ్ఛగా సాగే ప్రమాదం ఉంది. ఒకవేళ దొంగిలించిన వాహనాలకు నకిలీ నంబర్ ప్లేట్లు వాడినా, లేదా కెమెరా కండ్లు కప్పి ఇతర మార్గాల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించినా ఈ టెక్నాలజీ ఏమాత్రం పనిచేయదు. అంతర్జాతీయ చెక్ పోస్టుల వద్దే డ్రగ్స్, దొంగతనాలు, అక్రమ చొరబాట్లు జరుగుతుండగా సరిహద్దుల్లో మానవ నిఘా తగ్గితే ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. అక్రమ సరకు సరఫరా విషయంలో కూడా ఏఎన్ టిఆర్ నిస్సహాయంగానే ఉంటుంది. ఏ ఎన్ టిఆర్ వ్యవస్థలో భద్రతా లోపాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం మొబైల్ స్క్వాడ్‌లను రంగంలోకి దించుతామని చెబుతోంది. అయితే, రాష్ట్ర సరిహద్దులు దాదాపు వేలాది కిలోమీటర్లు ఉండగా కేవలం కొద్ది సంఖ్యలో ఉండే మొబైల్ స్క్వాడ్‌లు ఇతర మార్గాల ద్వారా రాష్ట్రంలోకి వచ్చే వేలాది వాహనాలను అడ్డుకోవడం అనేది సాధ్యం కాని పని. అడ్వాన్స్డ్ కెమెరా సిస్టం ద్వారా సమస్యలు గుర్తించబడినా, దానిని క్షేత్ర స్థాయిలో పరిష్కరించేందుకు మానవ వనరులు సరిపోకపోతే, ఈ టెక్నాలజీ ఉపయోగం శూన్యం. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా అడ్డదారులను అడ్డుకోగలమా అనే ప్రశ్న వేసుకోవాలి. టెక్నాలజీని దాటవేయడానికి అక్రమార్కులు ఎప్పుడూ కొత్త దారులను వెతుకుతూనే ఉంటారు. పారదర్శకత కోసమని చెక్ పోస్టులను తొలగించడం, వాస్తవానికి, నిఘా , భద్రతా వ్యవస్థను బలహీనం చేయడమే. ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించి ఉద్యోగుల జీవితాలు, రాష్ట్ర భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు, భద్రతా విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఈ నిర్ణయం రవాణా సౌలభ్యం కంటే సమస్యల సంక్లిష్టతనే పెంచుతుందనేది నిస్సందేహం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *