పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతికి అవమానం

– టీఎంసీ ప్రభుత్వ తీరు ఖండించతగినది
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: దేశ ప్రథమ పౌరురాని పశ్చిమబెంగాల్ గడ్డపై మమతాబెనర్జీ ప్రభుత్వం అవమానించడం అత్యంత దురదృష్టకరమని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. సంతాళీ తెగ ప్రజల సమ్మేళనాన్ని ఈ తెగ జనాభా ఎక్కువగా లేని ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యాన్ని, గిరిజన జాతుల సాధికారతను బలంగా నమ్మే వారందరి మనసులను తీవ్రంగా కలచివేసిందన్నారు. గిరిజన కుటుంబం నుంచి వచ్చిన రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ద్రౌపది ముర్ముకి జరిగిన అవమానం, ఈ విషయంలో వారు వ్యక్తపరిచిన మనోవేదనను 140 కోట్ల మంది భారతీయులు తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తన అన్ని పరిధులను దాటి వ్యవహరించిందని ఆరోపించారు. ప్రభుత్వం ఆదేశాలతో అక్కడి అధికారులు వ్యవహరించిన తీరు కారణంగానే రాష్ట్రపతికి తీవ్ర అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సమాజాన్ని, సంతాళీ సంస్కృతి సంప్రదాయాలను కూడా అక్కడి ప్రభుత్వం ఈ సందర్భంగా అవమానించిందన్నారు. రాష్ట్రపతి రాజకీయాలకు అతీతం. రాష్ట్రపతి కార్యాలయం గౌరవాన్ని, హుందాతనాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన, గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, టీఎంసీ పార్టీ పూర్తిగా విస్మరించిందని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిపట్ల వ్యవహరించాల్సిన తీరు మమతాబెనర్జీకి తెలియదా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రపతి అధికారికంగా పాల్గొంటున్న కార్యక్రమాలకు స్వయంగా ముఖ్యమంత్రి లేదా ఆ రాష్ట్ర కీలక మంత్రులు పొల్గొనడం కనీస మర్యాద. కానీ, మమత సర్కారు ఈ ప్రొటోకాల్ కూడా ఉల్లంఘించిందని తెలిపారు. ఇది దేశ చరిత్రలో అత్యంత దురదృష్టకర ఘటనల్లో ఒకటిగా నిలిచిపోతుందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *