– కేటీఆర్‌కు ఇచ్చిన తాజా నోటీసులే నిదర్శనం
–ఫార్ములా వన్ రేస్ ప్రతిష్టాత్మకం
– వైఫల్యాలను ప్రశ్నిస్తే వేధిస్తారా?
– డైవర్షన్ రాజకీయాలు చేస్తున్న రేవంత్
– విరుచుకుపడ్డ హరీష్‌రావు
తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి దర్యాప్తు సంస్థలను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారు అనడానికి కే టీ ఆర్ కు ఇచ్చిన తాజా నోటీసులే నిదర్శనమని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని నిరంతరం ప్రశ్నిస్తున్న కే టీ ఆర్ నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీసేందుకే రేవంత్ రెడ్డి ఈ నోటీసులు పంపించారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం 18 నెలల పాలన లో డైవర్షన్ పాలిటిక్స్ ను అమలు చేస్తూ బీ ఆర్ ఎస్ ను బద్నామ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రాజకీయ అరాచకత్వం గెలిచే ప్రసక్తే లేదన్నారు. రేవంత్ రాజకీయాలు ఇప్పటికే ప్రజలకు అర్థమయ్యాయన్నారు. నిజానికి ఫార్ములా ఈ రేసింగ్ తో తెలంగాణ ప్రతిష్ట పెరిగింది .పెట్టుబడులు కూడా వచ్చాయి.తెలంగాణ ప్రతిష్ట పెంచినందుకా కే టీ ఆర్ పై మీ నోటిసుల ప్రతాపమంటూ ప్రశ్నించారు.
2000లో చంద్రబాబు ఫార్ములా వన్ కోసం కృషిచేసి నిర్వహించలేకపోయారు. అలాంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ కృషి వల్ల ఫార్ములా వన్ వంటి ప్రతిష్టాత్మక రేస్ ను భారతదేశానికి అందులోనూ హైదరాబాద్ కి తీసుకొని రావడం గర్వకారణంగా భావించాలన్నారు. విద్యుత్ వాహనాల తయారీహబ్ గా తెలంగాణను మార్చేందుకు ఫార్ములా ఈ రేస్ ను హైదరాబాద్ లో నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించారని గుర్తుచేశారు.
అమర్ రాజా వంటి కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించి రాష్ట్ర పరువును, దేశ పరువును మంటకలిపిందన్నారు. ముఖ్యమంత్రి ఎన్ని రకాలుగా వేధించినా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం మాత్రం బీఆర్ఎస్ ఆపదని స్పష్టం చేశారు.



