నిమ్జ్ భూనిర్వాసితుల‌కు ఇందిర‌మ్మ ఇళ్లు

– ప‌స్తాపూర్ బ‌హిరంగ స‌భ‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌
-రూ.497.67 కోట్లు విలువైన అభివృద్ధి ప‌నులు ప్రారంభం
-త్వ‌ర‌లోనే ఇక్క‌డికి హ్యుందాయ్ కార్ల కంపెనీ
– నారాయ‌ణ్‌ఖేడ్ అభివృద్ధికి నిధులిస్తాం

నిమ్జ్ భూ నిర్వాసితులైన 5612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిమ్జ్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచాం, భూసేకరణను వేగవంతం చేశామ‌ని గుర్తుచేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం పస్తాపూర్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన-ప్రగతిబాట బహిరంగ సభ లో ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా జహీరాబాద్ నియోజకవర్గంలో రూ. 494.67 కోట్లతో పలు అభివృద్ధి పనులను  ముఖ్య మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నిర్వాసిత  కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశిస్తున్నామ న్నారు. ఆ కుటుంబాలకు భోజనాలు పెట్టి ఇండ్ల పట్టాలు ఇచ్చే బాధ్యత జగ్గారెడ్డికి అప్పగిస్తున్నామ న్నారు. త్వరలో హ్యుందాయ్ కార్ల తయారీ కంపెనీ ఇక్కడ పనులు మొదలుపెడతారని చెప్పడానికి సంతోషిస్తున్నాన‌న్నారు.   జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామ‌న్నారు.ఎన్నికల సమయంలోనే రాజకీయాలు.. అభివృద్ధిలో అందరినీ కలుపుకుని ముందుకు వెళతాం. నారాయణఖేడ్ కు సురేష్ షెట్కర్, సంజీవరెడ్డి రెండు కళ్లలంటివారు. నారాయణఖేడ్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తాం.

ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రైతు రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేశాం. రైతు భరోసాను రూ.12 వేలకు పెంచాం.. భూమిలేని పేదలకూ భరోసా అందిస్తున్నాం. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రూ. 500 లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం.  మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. స్వయం సహాయక సంఘాల మహిళలకు బస్సులను అందించి వారిని ప్రోత్సహిస్తున్నాం. ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టాలనే కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామ‌ని ఆడబిడ్డలకు మాట ఇస్తున్నాన‌న్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకుంటాం. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధాని మోదీని ఎన్నిసార్లయినా కలుస్తామ‌న్నారు. శాసనసభకు రండి… ప్రజా సమస్యలపై చర్చించండ‌ని ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాన న్నారు.

మేం ఏదైనా తప్పులు చేస్తే సూచనలు ఇవ్వండి.. సరిదిద్దుకుంటాం. అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తామని మీరు అనుకుంటే.. ప్రజలు గుణపాఠం చెబుతారు. ప్రజాప్రతినిధులుగా నిత్యం ప్రజలకు అండగా ఉండాలి. గెలిచినా, ఓడినా నేను ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నా. ముఖ్యమంత్రి అయ్యాక కూడా నేను ఏనాడూ అహంభావం ప్రదర్శించలేదన్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ కలుస్తున్నా. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం ఇచ్చే వరకు నేను నిద్రపోయేది లేదన్నారు.  అంత‌కు ముందు శ్రీ బసవేశ్వర మహారాజ్ విగ్రహాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌ట్లాడుతూ  విశ్వగురు బసవేశ్వర మహారాజ్ విగ్రహావిష్కరణ ఒక స్ఫూర్తిని నింపుతోంది. సవన్న స్ఫూర్తితో జనగణనలో కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ జోడో యాత్రలో స్పష్టం చేశారు.

బసవేశ్వరుడు ఆనాడే సామాజిక న్యాయాన్ని అందించేందుకు కృషి చేశారు. బసవన్న స్ఫూర్తితో అందరికీ సామాజిక న్యాయం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆయన స్ఫూర్తితో ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామ‌న్నారు. మెదక్ ప్రాంతానికి ఇందిరమ్మకు ఉన్న అనుబంధం విడదీయలేనిది. మెదక్ పేరు గుర్తొస్తేనే ఇందిరమ్మను తలచుకుంటాం.. ఇందిరమ్మ గుర్తొచ్చిన ప్రతీసారి మెదక్ గుర్తొస్తుంది. తన చివరి శ్వాస వరకు మెదక్ ఎంపీగా కొనసాగిన నాయకురాలు ఇందిరమ్మఅని గుర్తు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *