స‌మ్మిట్‌లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా ఇందిరా మ‌హిళా శ‌క్తి స్టాల్‌

-ప్రారంభించిన మంత్రి సీత‌క్క‌

 భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో మహిళా సాధికారతను ప్రతిబింబించే “ఇందిరా మహిళా శక్తి” స్టాల్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఘనంగా ప్రారంభించారు. స్టాల్‌ను సందర్శించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, “మహిళ ఎదిగితే కుటుంబం ఎదుగుతుంది… సమాజం ఎదుగుతుంది… రాష్ట్రం ఎదుగుతుంది. అందుకే మా ప్రభుత్వం మహిళ శక్తిని కేంద్రబిందువుగా చేసుకుని పని చేస్తోంది. ఈ స్టాల్‌లో కనిపిస్తున్న ప్రతీ విజయకథ మా తెలంగాణ మహిళల ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం” అని పేర్కొన్నారు. సెర్ప్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా రూపొందించిన ఈ స్టాల్‌లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ఆధ్వర్యంలో మహిళల చేతుల్లో నడుస్తున్న విభిన్న వ్యాపారాలు, సేవలు, ఆర్థిక కార్యకలాపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళల నిర్వహణలో ఉన్న పెట్రోలు బంకులు, హైటెక్‌ సిటీలో పనిచేస్తున్న మహిళా శక్తి బజార్, జిల్లాల వ్యాప్తంగా నిర్మితమైన మహిళా శక్తి భవనాలు, శక్తి క్యాంటిన్లు, అలాగే ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణలో మహిళలు సాధిస్తున్న విజయాలు దేశ విదేశాల ప్రతినిధులను ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలను పరిశీలించిన అనంతరం సీతక్క మాట్లాడుతూ, “గ్రామీణ మహిళా సంఘాలు ఈరోజు పెద్ద స్థాయిలో వ్యాపారాలు నడపడం… కార్పొరేట్ స్థాయి సేవలు అందించడం… ఇదే కొత్త తెలంగాణ శక్తి. మహిళకు వేదిక ఇస్తే ఆమె అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తుందనే దానికి ఈ మోడల్స్ సాక్ష్యం” అని అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ వేదికల వరకు మహిళల ప్రయాణాన్ని ప్రతిబింబించే డాక్యుమెంటరీలను కూడా స్టాల్‌లో ప్రదర్శించారు. వాటిని వీక్షించిన అనంతరం దనసరి అనసూయ సీతక్క, “ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నిజంగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయ‌న‌డానికి ఇవి సాక్ష్యాలు. మహిళల చేతుల్లో పెట్టిన ఒక్క అవకాశం సమాజానికి పది రెట్లు తిరిగి వస్తుంది. ఈ డాక్యుమెంటరీలు మా మహిళల అసలైన శక్తిని చూపిస్తున్నాయి” అని వ్యాఖ్యానించారు. తదుపరి ఆమె ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక భద్రతకు తీసుకున్న చర్యలను వివరించారు. “వేల కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాలు, వడ్డీ రీయింబర్స్‌మెంట్, ప్రతి మహిళకు రూ. 10 లక్షల లోన్ బీమా, రూ. 2 లక్షల ప్రమాద బీమా—ఇవి అన్నీ తెలంగాణ మహిళకు ఆర్థికంగా రక్షణ ఇవ్వడానికి తీసుకున్న చారిత్రక నిర్ణయాలు. మా లక్ష్యం మహిళలను ఆత్మవిశ్వాసంతో నిలబడే యజమానిగా తీర్చిదిద్దడం” అని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం 20కు పైగా వ్యాపార రంగాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రవేశపెట్టి, మహిళలను ఆర్థికంగా నిలబెట్టే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమని సీతక్క తెలిపారు. “మహిళ ఉన్నతిలోనే తెలంగాణ ప్రగతి ఉంది. ‘ఇందిరా మహిళా శక్తి’ స్టాల్ మా రాష్ట్ర మహిళల ప్రతిభను, శక్తిని, సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపిస్తున్న వేదిక. ఇది తెలంగాణ గర్వం మాత్రమే కాదు… దేశ భవిష్యత్తుకు దారి చూపే శక్తి” అని ఆమె పేర్కొన్నారు. సమిట్‌లోని ప్రముఖ ఆకర్షణగా నిలిచిన ఈ స్టాల్, తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత పట్ల పాటిస్తున్న నిబద్ధతను ప్రతిబింబిస్తూ దేశ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *