“భారత రాజ్యాంగం భారత జాతి ఆశలు, ఆకాంక్షలు విలువలకు అద్దం పడుతూ, భారతదేశాన్ని ఒక సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించి, పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని అందించడానికి కట్టుబడి ఉంది. దాని నిర్మాణం ఎంత సుదీర్ఘ మైనదైనా, భారత రాజ్యాంగం దేశంలోని వైవిధ్యాన్ని ఏకతాటిపైకి తెచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా వ్యవస్థకు బలమైన పునాది వేసింది.”
అయితే భారత రాజ్యాంగం మారుతున్న సమాజం అవసరాలకు అనుగుణంగా మార్పులు పొందగలదు. ఇప్పటివరకు వందకు పైగా సవరణలు జరగడం దీని సజీవతను సూచిస్తుంది. కానీ ఆ మార్పులన్నీ ప్రజాస్వామ్య విధానంలోనే జరిగాయి కాని, బలవంతం, హింస, యుద్ధం ద్వారా కాదు. ఈ మార్పు స్వరూపమే భారత రాజ్యాంగంనకు గల ప్రాణం. భారత రాజ్యాంగం 368 అధికరణ ప్రకారం సవరణ లేదా మార్పు చేయాలంటే అది ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరగాలి. ఈ నిబంధన రాజ్యాంగం యొక్క “స్వీయ సంరక్షణ వ్యవస్థ”గా పనిచేస్తుంది. డాక్టర్ అంబేద్కర్ వ్యాఖ్యానించినట్లు “రాజ్యాంగం భవిష్యత్ తరాలు తమకు అవసరమని భావించే మార్పులు చేసుకోవడానికి అనుమతించేంత సరళమైనది, అయినప్పటికీ దాని ముఖ్యమైన లక్షణాలను రక్షించేంత కఠినమైనది.”
అంటే, మార్పు సాధ్యమే కానీ, అది రాజ్యాంగం నిర్దేశించిన మార్గంలోనే జరగాలి. మావోయిస్టులు లేదా ఇతర రాజకీయ శక్తులు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలనే సంకల్పంతో వ్యవహరించినా, వారు చివరికి అదే రాజ్యాంగం నిర్దేశించిన చట్టబద్ధ పరిమితులలోనే ఉండిపోవలసి వస్తుంది. ఇది రాజ్యాంగం యొక్క ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. కమ్యూనిస్టులు సాయుధ పోరాటం నుంచి ప్రజాస్వామ్య పంథాను ఎంచుకున్నట్లు, నేటి మతవాదులు కూడా చివరకు రాజ్యాంగపు పరిమితుల్లోనే వ్యవహరించాల్సి వస్తుంది. ఇది రాజ్యాంగం కలిగి ఉన్న చాతుర్యమయమైన నిర్మాణం.
రాజ్యాంగం కేవలం చట్టాల సమాహారమే కాదు, మనకు మానవతా విలువలు నేర్పే విద్యా వ్యవస్థ కూడా. మతం, జాతి, భాష, వర్గం అనే విభజనల మధ్య సౌభ్రాతృత్వాన్ని కలిగించడం దీని ప్రధాన లక్ష్యం. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు ప్రతి భారతీయుడికి సమాన అవకాశాలు, గౌరవం, స్వేచ్ఛను హామీ ఇస్తాయి. ఈ విలువలే మన దేశాన్ని ప్రజాస్వామ్యంగా నిలబెడతాయి. సామాజిక మార్పులు, ఆర్థిక అసమానతలు, లేదా రాజకీయ అసంతృప్తులు వచ్చినా, భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య మార్గంలో వాటికి పరిష్కారాన్ని చూపే సామర్థ్యం కలిగి ఉంది. ఉదాహరణకు, 1970లలోని జయప్రకాశ్ నారాయణ్ ప్రజాస్వామ్య ఉద్యమం, 1990లలోని మండల్ ఉద్యమం, 2011లోని అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం, ఇవన్నీ రాజ్యాంగపు పరిధిలోనే జరిగినవి.
“మనం ప్రజాస్వామ్యాన్ని మాటల రూపంలోనే కాకుండా వాస్తవంలో కూడా కొనసాగించాలనుకుంటే, మన సామాజిక, ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి రాజ్యాంగ పద్ధతులను బలంగా పట్టుకోవాలి.” అని డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో (నవంబర్ 25, 1949) తన చివరి ప్రసంగంలో స్పష్టంగా ప్రకటించాడు. ఈ వ్యాఖ్య రాజ్యాంగం యొక్క చట్టబద్ధ మార్గాల పట్ల గల విశ్వాసాన్ని చూపుతుంది. సాయుధ పోరాటం లేదా అప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా మార్పు సాధించాలన్న ఆలోచన, రాజ్యాంగం స్థాపించిన విలువలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
ఈ రోజు రాజ్యాంగం మీద దాడులు జరుగుతున్నాయి. మతం పేరుతో, జాతి పేరుతో, భిన్నాభిప్రాయాల పేరుతో రాజ్యాంగ విలువలను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే చరిత్ర మనకు నేర్పిన ఒక పాఠం ఉంది. రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వారు చివరికి అదే రాజ్యాంగంలోనే లీనమవుతారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మార్పుకు, సవరణలకు మార్గం చూపుతుంది, కానీ రాజ్యాంగం ధ్వంసానికి ఎప్పుడూ మార్గం చూపదు. అందుకే ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని కాపాడటం, దాని విలువలను పరిరక్షించడం తన కర్తవ్యంగా భావించాలి.
రాజ్యాంగం కేవలం ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వచించదు; అది మన దేశపు జీవన విధానాన్ని నిర్దేశిస్తుంది. గ్రామస్వయంపాలన నుండి సుప్రీంకోర్ట్ వరకు, మహిళల హక్కుల నుండి మైనార్టీల రక్షణ వరకు అన్ని అంశాలను సమగ్రంగా చేర్చిన పత్రం ఇది. అందుకే ఇది చట్టపరమైన పత్రం మాత్రమే కాకుండా, సామాజిక న్యాయానికి బాటలు వేసిన ఒక నైతిక ధర్మగ్రంథం. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ఒక నిరంతర దార్శనిక దిక్సూచి. ప్రతి తరానికి కొత్త సవాళ్లు ఎదురైనా, రాజ్యాంగం వాటిని ఎదుర్కొనే సత్తాను కలిగి ఉంది.
ఆర్థిక అసమానత, మత వివక్ష, జాతి రాజకీయాలు, మీడియా ప్రబల ప్రభావం, ఇవన్నీ రాజ్యాంగం పునాదిని పరీక్షిస్తున్నప్పటికీ, ప్రజల విశ్వాసం దానిని మరింత బలపరుస్తోంది. భారత ప్రజాస్వామ్యం యొక్క సహనం, విచక్షణ, సమతుల్యత ఈ రాజ్యాంగ పునాదిపైనే నిలిచాయి. ఏ తీవ్ర భావజాలం, ఎంత శక్తివంతమైన ఉద్యమం అయినా, చివరికి ప్రజాస్వామ్య చట్రంలో పరిష్కారమవ్వడం ఇదే భారత రాజకీయ సంస్కృతి. ఈ పరిణామం ప్రపంచానికి ఒక మాదిరి. ఎందుకంటే, ప్రపంచంలో అనేక దేశాలు సాయుధ విప్లవాల ద్వారా మార్పు సాధించగా, భారతదేశం మాత్రం చట్టపరమైన, ప్రజాస్వామ్య పద్ధతిలోనే సామాజిక, రాజకీయ పరివర్తనను సాధించింది.
భారత రాజ్యాంగం భారత జాతి ఆశలు, ఆకాంక్షలు విలువలకు అద్దం పడుతూ, భారతదేశాన్ని ఒక సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించి, పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని అందించడానికి కట్టుబడి ఉంది. దాని నిర్మాణం ఎంత సుదీర్ఘమైనదైనా, భారత రాజ్యాంగం దేశంలోని వైవిధ్యాన్ని ఏకతాటిపైకి తెచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా వ్యవస్థకు బలమైన పునాది వేసింది. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడడంలోనూ, ప్రజాస్వామ్య వ్యవస్థను సుస్థిరం చేయడంలోనూ, అదేవిధంగా న్యాయవ్యవస్థకు ఉన్నత స్థానాన్ని కల్పించడంలోనూ కీలక పాత్ర పోషిస్తూ రాజ్యాంగం దేశ అభివృద్ధికి, సమగ్రతకు మార్గదర్శకంగా నిలుస్తోంది.





