– థియేటర్లపై వరుస దాడులతో నిర్ణయం
– దాడుల వెనక ఖలిస్తానీ ఉగ్రవాదులు?
టోరంటో, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: వరుస దాడులు జరుగుతోన్న నేపథ్యంలో కెనడాలోని ఓ థియేటర్‌లో భారతీయ సినిమాల ప్రదర్శనను నిలిపివేశారు. భారతీయ సినిమాలు ప్రదర్శితమవుతోన్న సమయంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని అందుకే వాటి ప్రదర్శనను రద్దు చేస్తున్నామని థియేటర్ యాజమాన్యం తెలిపింది. కెనడాలోని ఓక్‌విల్లే ప్రాంతంలో ఫిల్మ్. కా థియేటర్‌లో వారం రోజుల వ్యవధిలోనే రెండుసార్లు దాడులు జరిగాయి. దీంతో భారతీయ సినిమాల ప్రదర్శనను నిలిపివేసింది. ఆ సినిమాల్లో ’కాంతార చాప్టర్ 1’, ’ఓజీ’ కూడా ఉండడంతో వాటిని కూడా ప్రదర్శించడం లేదని యాజమాన్యం తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 25న మొదటిసారి దాడి జరిగింది. ఇద్దరు అనుమానితులు హాలుకు నిప్పు అంటించే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను ఆర్పారు. దీంతో పెద్దగా నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా అక్టోబర్ 2న మరో దాడి జరిగింది. తెల్లవారుజాము ప్రాంతంలో ఒక అనుమానితుడు థియేటర్ ప్రవేశద్వారం వద్ద కాల్పులు జరిపాడు. దీంతో యాజమాన్యం సినిమాలను నిలిపివేసింది. ఈ దాడుల వెనక ఖలిస్థానీ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు థియేటర్ యాజమాన్యం అనుమానిస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని నిర్ధరించలేదు. కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవాదులు వాంకోవర్‌లోని భారత్ కాన్సులేట్‌ను సీజ్ చేస్తామంటూ ఇటీవల బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ థియేటర్ దాడుల వెనక కూడా వారి హస్తం ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





