దేశీయ సూచీలు నష్టాలబాట

– రష్యాతో వ్యాపారలావాదేవీలు సాగిస్తే వంద శాతం సుంకం

– భారత్‌ సహా చైనా, బ్రెజిల్‌ దేశాలకు నాటో హెచ్చరిక 

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌ : రష్యాతో వ్యాపారలావాదేవీలు కొనసాగిస్తే వంద శాతం సుంకం విధిస్తామంటూ భారత్‌ సహా చైనా, బ్రెజిల్‌ దేశాలను నాటో హెచ్చరించింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేందుకు రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా శతవిధాలా యత్నిస్తోంది. ఈ క్రమంలోనే పైవిధంగా బెదిరింపులకు పాల్పడిరది. ఈ హెచ్చరికల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం మళ్లీ నష్టాలబాట పట్టాయి. మరోవైపు త్రైమాసిక ఫలితాల సీజన్‌ కావడం కూడా మార్కెట్ల ఒడుదుడుకులకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్‌, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.బుధవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్‌ ఆ తర్వాత నష్టాల బాట పట్టింది. ఒక దశలో 200 పాయింట్లు కోల్పోయి 82,371 వద్ద కనిష్ఠానికి చేరింది. ఉదయం పదిన్నర గంటల సమయంలో సెన్సెక్సు 149 పాయింట్ల నష్టంతో 82,420 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్‌ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 52 పాయింట్ల నష్టంతో 25,143 వద్ద కొనసాగుతోంది.

నాటో హెచ్చరిక

నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుట్టె అమెరికా సెనెటర్లతో సమావేశమైన అనంతరం మాట్లాడుతూ చైనా అధ్యక్షుడు, భారత ప్రధానమంత్రి, బ్రెజిల్‌ దేశాధ్యక్షుడు ఎవరైనా సరే రష్యాతో వ్యాపారం చేస్తూ వారి నుంచి చమురు, గ్యాస్‌ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ‘ఆయా దేశాలపై వంద శాతం సుంకం విధిస్తాం.. వ్యాదిమిర్‌ పుతిన్‌ను ఉద్దేశిస్తూ మాస్కోలోని ఆ వ్యక్తి శాంతి చర్చలకు రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందన్నారు. మా పరిణామాలు ఈ దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి.. కావున పుతిన్‌కు వెంటనే ఫోన్‌ చేసి శాంతి చర్చలను సీరియస్‌గా తీసుకోవాలని ఒత్తిడి తీసుకురండి.. లేకుంటే మూడు దేశాలకూ తీవ్ర ఇబ్బందులు తప్పవ్‌’ అని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *