నైతిక‌త పెంచే విలువ‌ల పెంప‌కం

వేగంగా పరివర్తన చెందుతున్న ప్రపంచంలో  మానవ  సంబంధాలు అదృశ్యమైపోతున్నాయి.ధనం మనిషిని నడిపించే ఇంధనంలా మారిన నేపథ్యంలో  మానవ జీవితాలు కడు దుర్భరంగా మారుతున్నాయి. ఆప్యాయతలకు, బంధాలకు అర్థాలు, నిర్వచనాలు మారిపోతున్నాయి. మానవ సంబంధాలు విశ్వసనీయత కోల్పోయి, ఆర్ధిక బంధాలుగా పరివర్తన చెందుతున్నాయి. మేలు చేసిన వారికి కీడు ఎదురవుతున్నది. మనుషుల మధ్య మాటలు కూడా కరువైపోయి, ఆత్మీయులు సైతం దూరమైపోతున్నారు. ఊస‌ర‌వెల్లుల్లా రంగులు మారుస్తూ, స్వార్థంతో జ‌రిపే అన్వేష‌ణ మాన‌వ హృద‌యానికి స్వాంత‌న ఇవ్వ‌డంలేదు. కోర్కెల వెంట ప‌రిగెడుతుండ‌టం వ‌ల్ల స్వార్ధం పతాక స్థాయికి చేరింది. హితవచనాలు కంటకప్రాయంగా పరిణమించాయి.
మ‌నో దారిద్య్రంలో  బ్రతుకుతున్న మనిషికి నిజమైన ఆనందం, సంతృప్తి ఏనాటికీ లభించదు. మనసులో లేని మంచితనం భౌతికంగా ప్రదర్శించడం వలన నిజమైన ఆనందం సంప్రాప్తించదు. గుణసంపద మనిషిని మహోన్నతుడిని చేస్తుంది. సంస్కారగుణం తరగని యశస్సుకు సోపానం. విలువలే మనిషికి నిజమైన ఆభరణాలు.పెద్దల మాట “చద్దన్నం మూట”అనే నానుడి అక్షరసత్యం. నాటి పెద్దలు తమ అనుభవ సారాంశంతో పలికిన హితోక్తులు సదా అనుసరణీయం. నీతి కథలతో సద్గుణాలు అలవడేవిధంగా సంస్కార వంతమైన పెంపకాలతో సాగిన నాటితరం ఆలోచనలు నేటి తరానికి పనికి రావడం లేదు.  సుఖసౌఖ్యాలు,భోగభాగ్యాలు అనుభవించడానికి మానవ మేథస్సు అత్యద్భుతంగా వినియోగపడింది.
ఇదే స‌మ‌యంలో బుద్ధి  పాతాళానికి దిగజారింది. ఈ నేప‌థ్యంలో నేటి తరం బాలలను సక్రమంగా పెంచి భావి తరాలను మానవ సంబంధాలకు దగ్గరగా పెంచాలి. మనుషుల్లా ప్రవర్తించే విధంగా రాబోయే తరాలను తీర్చిదిద్దాలి. అన్ని సమస్యలను తట్టుకుని నిలబడే విధంగా పెంచాలి.  ఆరోగ్యం,ఆనందంతో పాటు ప్రేమాప్యాయతలకు చోటు కల్పించాలి.ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లల పెంపకం సాగాలి.  రాబోవు తరాలను ఘనంగా ఆవిష్కరించంలో నేటి బాలలకు,విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,మేథావులు, విద్యావంతులు  తగిన మార్గ నిర్ధేశనం చేయాలి. ఎక్కడో జరిగిన అవాంఛనీయ సంఘటనలకు భయపడి, తమ పిల్లలు కూడా అదే బాట పడతారనే భయంతో, పిల్లల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించడం వలన భవిష్యత్తులో జరిగే అనర్ధాలు  అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి.అతి గారాబం అన‌ర్థ‌హేతువు. విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. ఫోన్ కొనివ్వలేదని ,ల్యాప టాప్ చూడనివ్వలేదని, బాగా చదువుకోమంటున్నారని, మార్కులు సరిగా రాలేదని, తల్లిదండ్రులు మందలించారని, ప్రిన్స్ పాల్ తిట్టాడని,ఉపాధ్యాయుడు కొట్టాడని ఇలా వేర్వేరు కారణాలతో పిల్ల‌లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నసంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి.
అడిగినవన్నీ కొనిచ్చి,అతిగారాబం చేయడం వలన, పొగడ్తలకు అలవాటు పడి , ఎప్పుడో ఒకసారి తల్లిదండ్రులు తిట్టినందుకు తీవ్రంగా మనస్తాపం చెంది,ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న నేటి తరం బాలల,విద్యార్ధుల మానసిక స్థితిని గురించి తల్లిదండ్రులు కూలంకషంగా అధ్యయనం చేయాలి. మంచి పని చేస్తే చిన్న ప్రశంస,చెడ్డ పని చేస్తే మందలించడం అవసరం.  దాదాపు 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు పిల్లలపై భారం మోపకూడదు. అటపాటలతో, మన వ్యహారశైలితో వారికి  ప్రేమాప్యాయతలను చవిచూపించాలి. చిన్న చిన్న కథల ద్వారా, పాటల ద్వారా వారికి లోకం గురించిన ప్రాథమిక అవగాహన కలిగించాలి. టి.వి లకు, మొబైల్ ఫోన్లకు పిల్లలను దూరంగా ఉంచాలి. పుస్తకాలలోని బొమ్మల ద్వారా  జ్ఞానం వైపు దృష్టి ని మళ్ళించాలి.స్పష్టమైన  ఉచ్చారణ అలవాటు చేయాలి.  నాట్యం,సంగీతం వైపు ఆసక్తి కలిగేలా చేయాలి. కేవలం రెండు మూడు  సంవత్సరాల వయసులోనే స్కేటింగ్,స్విమ్మింగ్ వంటి వాటి  జోలికి పోవద్దు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలకు వారి తప్పొప్పులను తెలియ చేసి,సన్మార్గంలో పెట్టడం అవసరం.  అలాకాకుండా ఏం చేసినా పొగడుతూ, పెంచడం వలన పిల్లలు మనకు తెలియకుండానే ఒక కంఫర్ట్ అండ్ సెన్సిటివ్ జోన్ లోకి వెళ్ళి పోతున్నారు. ఎండలోకి వెళ్ళనీయ కుండా,వానకు తడవనీయకుండా, దుమ్ము ధూళి సోకనీయకుండా, ముట్టుకుంటే హాండ్ వ్యాష్ చేసుకునే విధంగా పెంచడం వలన పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. చేతులు కడుక్కోవాలి. కాని ఖరీదైన హ్యాండ్ వాష్ తో కాదు. సాధరణమైన సబ్బుతో… రెండు పూటలా స్నానం చేయించండి… ఖరీదైన సబ్బులతో కాదు… సాధారణమైన సబ్బుతో…. బలమైన ఆహారం పెట్టండి. చికెన్లు,మటన్లు,బిర్యానీలు తింటే బలమొస్తుందనే భ్రమను వీడండి.   రోజూ ఒకే రకమైన తిండి పెట్టకండి.
మెనూ మార్చండి. పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందేటట్లు చూడండి . చిన్నప్పటి నుండే రుచి పచీ లేని ఆహారం పెట్టి పిల్లలను చప్పిడి కూటితో రుచి కి దూరం చేయకండి. కెమికల్ ఫుడ్ కు పిల్లలను దూరం ఉంచాలి. తల్లిదండ్రులకు, బంధువులకు, పెద్దలకు పిల్లలను దగ్గర చేయాలి. అప్పుడప్పుడూ గ్రామీణ వాతావరణాన్ని పిల్లలకు పరిచయం చేయడం. ప్రకృతి అందాలను పిల్లలను ఆస్వాదించనీయండి.  పిల్లలకు చిన్నప్పటినుండే మంచి మంచి ప్రదేశాలను చూపించండి. మంచి వాతావరణంలో పెరిగేటట్లు చేయండి.  తల్లిదండ్రులు పద్దతిగా ఉంటే పిల్లలు కూడా పద్దతిగా పెరుగుతారు. కుటుంబ వాతావరణం సరిగా లేకపోతే పిల్లల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారుతుంది.ఆటపాటలతో,చదువుసంధ్యలతో అందరితో కలివిడిగా ఉండేటట్టు మీ పిల్లలను పెంచండి. మంచి చదువు,సంస్కారం,ఇతరులకు  పెట్టే గుణం, మంచిని పంచే గుణం పిల్లలకు నేర్పండి. కుళ్ళు,కుతంత్రాలు,స్వార్ధపూరిత మైన మనస్తత్వాలను విడనాడి,పిల్లలను సద్గుణాలతో పెంచండి.  ఏ విత్తనం నాటితే అదే మొక్క మొలుస్తుంది. పిల్లల పెంపకం అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగాలి.
ఇటీవల ఒక ఇంజనీరింగ్ కళాశాలలో  మొబైల్ ఫోను తీసుకున్నందుకు ఒక విద్యార్ధిని  ఏకంగా లెక్చరర్ ను అసభ్యంగా దూషించడమే కాకుండా, చెప్పుతో కొట్టిన సంఘటన తీవ్రంగా కలచి వేసింది. భావి తరాలు ఎటు పోతున్నాయో  ఈ ఉదంతాన్ని చూస్తే అవగతమవుతుంది. పెద్దలను గౌరవించక పోవడం, ,తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం,మేలుచేసిన వారికి కీడును తలపెట్టడం, కృతజ్ఞత మరచి ప్రవర్తించడం,స్వార్ధం పతాక స్థాయికి చేరడం నేటి సమాజంలో చూస్తున్నాం. పెట్టి తినే సంస్కృతి పోయి, దోచుకుని తినే సంస్కృతి ప్రబలింది. ఇలాంటి లక్షణాలు గల వాతావరణం లో పిల్లలు పెరిగితే వారు భవిష్యత్తులో ఎలా తయారౌతారో వేరే చెప్పనక్కరలేదు. ఆకాశంలో విహరిస్తూ, నేలను తూలనూడడంలో  ఔచిత్యం లేదు. నింగి నంటే భవనాలకు కూడా నేలే ఆధారమన్న సత్యం విడవరాదు. మట్టిలో కలిసే శరీరాలకు మేలిమి రంగులు పూసి, మట్టి వాసనను  అసహ్యించుకోవడం అత్యంత అసహ్యకరం. నేల విడిచి సాము చేయడం మూర్ఖత్వం. వృక్షం శాఖోపశాఖలుగా విస్తరించి,మహా వృక్షమైనా దాని వేళ్ళు మట్టిలోనే ఉంటాయన్న నిజాన్ని మరిస్తే ప్రమాదం.
ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా వారి చూపు భూమిపై కేంద్రీకరించక తప్పదు. ఆకాశం వైపు చూస్తూ నడిస్తే, నేలపై బోర్లా పడక తప్పదు. అప్పుడు కూడా నేలే ఆధారం. దారం లేని గాలి పటం నేలపై పడకతప్పదు.   దీనిని బట్టి మనకు విషయం అర్ధం కావాలి. వెలుగు నిచ్చిన  దీపాన్ని ఆర్పేసి, ఎక్కించిన నిచ్చెనను కూలదోసి, అవహేళన చేయడం మూర్ఖత్వం. మహాపాపం. గాలికి వంగిన చిన్న మొక్కను అలాగే వదిలేస్తే ఆ మొక్క పెరిగి వంకర టింకర చెట్టుగా తయారౌతుంది. వంగిన మొక్కను  నిటారుగా నిలబెట్టడానికి చిన్న కర్రతో మొక్కను కట్టినట్టు,  సద్గుణాలతో, మంచి మాటలతో పిల్లలకు చిన్నతనం నుండి విలువలను నేర్పితే పెద్దయ్యాక రుజుమార్గంలో పయనించే అవకాశమేర్పడుతుంది.
 పిల్లలకు నీతి కథలను వినిపించండి. మన పెంపకాలు ఎంత పటిష్ఠంగా ఉన్నా, పెరిగి పెద్దయ్యాక మారిపోయే వారు కూడా ఉంటారు.  మన ప్రభావం కంటే దుష్టుల ప్రభావం వారిపై అధికంగా ఉండడం, లొంగి పోయే బలహీనమైన మనస్తత్వం కలిగి ఉండడం  దీనికి కారణం. వ్యక్తిత్వం బలంగా ఉండాలి. బంధాలను భారంగా భావించకూడదు. మారిపోయే  మనస్తత్వాల  వలన  వ్యక్తిత్వం దెబ్బతింటుంది. చిన్నప్పటి నుండి  మంచిగా పెరిగినా,పెరిగి పెద్డయ్యాక  దుర్జనుల సాంగత్యంలో దుర్భోధలకు బానిసలై సద్గుణాలు కోల్పోవడం  ఆరోగ్యానిచ్చే ఔషధాన్ని వదిలేసి, మత్తును కలిగించే మాదక ద్రవ్యాల వెంట పడడం లాంటిది.  భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా బాల్యంలోనే సద్గుణాలకు, వివేకానికి బలమైన పునాదులు పడాలి.నేల మీద నిలబడడమే కాదు,మాట మీద  నిలబడడం కూడా  నేర్పాలి.

-సుంకవల్లి సత్తిరాజు (సామాజిక విశ్లేషకులు, మోటివేషనల్ స్పీకర్)  తూ.గో.జిల్లా,  ఆంధ్రప్రదేశ్.
  మొ:9704903463.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *