– మహిళా పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకంగా ఇన్క్యుబేసిన్ కేంద్రాలు
– సెయింట్ ఆన్స్‌తో నా అనుబంధం మరువరానిది
– మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: ఆకాశమే హద్దుగా అన్ని రంగాలలో మహిళలు ఎదగాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని, మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తోందని చెప్పారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, పారిశ్రామికవేత్తలుగా మహిళలు వేసే ప్రతి అడుగులోనూ ప్రభుత్వం చేయూతనందిస్తుందని చెప్పారు. హైదరాబాద్ మోహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ కళాశాల ప్రాంగణంలో ఇన్క్యుబేసిన్ కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఈ కేంద్రాలు ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా నిలబడతాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యారంగం పరిశ్రమలతో కలిసి ఏర్పాటు చేస్తే ప్రపంచస్థాయిలో వారికి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయన్నారు. ఈ ఇన్క్యుబేసిన్ ఫౌండేషన్ మహిళా పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకంగా మారనుందన్నారు. కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా హెల్త్ కేర్, విద్య, గ్రామీణాభివృద్ధి, డిజిటల్ రంగాల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. టి-హబ్, వి-హబ్ స్టార్టప్‌లతో సమానంగా సెయింట్ ఆన్స్‌లో ప్రారంభమైన ఇన్క్యుబేసిన్ ఫౌండేషన్ మహిళలు పారిశ్రామిక రంగంలో రాణించేందుకు పునాదిగా మారనుందన్నారు. సెయింట్ ఆన్స్ విద్యా సంస్థలతో తన అనుబంధం ఇప్పటిది కాదని, తన విద్య మొదలైందే బీహెచ్‌ఈఎల్ సెయింట్ ఆన్స్ నుండి అని మంత్రి ఉత్తమ్ గుర్తు చేసుకున్నారు. తన కోదాడ నియోజకవర్గ పరిధిలోని సెయింట్ ఆన్స్ పాఠశాలతో తన అనుబంధం విడదీయలేనిదనిన్నారు. కళాశాలలో ఎన్‌సీసీ కేడెట్ల పరేడ్‌ను చూసిన ఆయన ఎన్‌సిసి బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. హైదరాబాద్ నగరం గ్లోబల్ నగరంగా రూపాంతరం చెందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో సెయింట్ ఆన్స్ అధ్యక్షురాలు మదర్ అంథోనమ్మ, హైదరాబాద్ ప్రావిన్స్ పాఠశాల విద్యాసంస్థలకు చెందిన డాక్టర్ సిస్టర్ ఎ.విజయ రాణి, ఎన్‌ఐఎంఎస్‌ఎంఈ డైరెక్టర్ డాక్టర్ విజయ ఏరండి, టీ-హబ్ సీఈవో సీత పల్లచోల్ల, ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గడ్డం నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


