పాత విలువలకు పాతర!

  • పెరిగిన పాన్‌ ఇండియా మోజు
  •  డబ్బు కోసం యువతను ఆకర్షించే పనిలో చిత్రసీమ  
  •  కుటుంబ ప్రేక్షకులకు దూరమవుతున్న వైనం
  • తప్పుదారి పట్టిస్తున్న సంఘటనలు

సినీ ప్రేక్షకులకు నటీనటుల పట్ల ఆరాధ్య భావన ఉంది. సినిమాని తెలుగు ప్రజలు  ఎంతగానో  ప్రేమిస్తారు. కథానాయకులను పూజిస్తారు.. ఆరాధిస్తారు.  అయితే.. నటులుగా తమకు సమాజంపై బాధ్యత ఉంటుందని భావించే సినీతరం నేడు తగ్గిపోయింది. తప్పు పనులు చేయకూడదు, చేస్తే వాటి ప్రభావం తమ వ్యక్తిత్వంపై, సినీ ప్రస్థానంపై పడుతుందనే ఆలోచన,  భయం ఇప్పటి సినిమావాళ్లలో తక్కువగా ఉంది. సినిమాల్లో వ్యాపారధోరణి పెరిగి ప్రేక్షకులు, అభిమానులను సినిమా విజయానికి, రాబడికి వాడుకోవటం  జరుగుతోంది. నేటి సినిమావాళ్లు ప్రజలకు ఇచ్చేదేమీ  లేకున్నా, జనం సొమ్ముతో బ్జడెట్‌ను ఎలా రాబట్టుకోవాలో అనే ఆలోచనే వారికి ప్రధానమైంది. ఇలా  క్రమంగా పాత విలువలకు దూరమవుతూ సినీజీవులు రకరకాల సమస్యలను సృష్టిస్తున్న ఉదంతాలు ఈ మధ్య వరుస కడుతున్నాయి. ఒకప్పుడు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు మద్రాస్‌ కేంద్రంగా ఉండేది. కేవలం సినీ తారలను చూసేందుకే తెలుగు టూరిస్టులు మద్రాసు వెళ్లేవారు. ఎన్‌టి రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌ బాబు వంటి అగ్రనటులు ..వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి, అంతకు ముందు తరంలో సావిత్రి, జమున, కృష్ణకుమారి వంటి తారలను చూడకుండా వొచ్చేవారు కాదు.

ప్రతి రోజు ఉదయం నిర్ణీత సమయంలో తారలు తమ బాల్కనీ నుండి అభిమానులకు దర్శనం ఇస్తుండేవారు. కాసేపు వారితో ముచ్చటించేవారు. అభిమాన సంఘాల హడావుడి సంగతి సరేసరి. అయితే అప్పట్లో నిర్మాత దర్శకులు సామాజిక స్పృహ, సామాజిక  బాధ్యతతో సమకాలీన అంశాలు ఇతివృత్తంగా సినిమాలు తీసేవారు. అలాగే  ఇంటిల్లిపాది చూడదగిన కుటుంబ కథా చిత్రాలు, కామెడీ మూవీస్‌ ఎక్కువగా వొచ్చేవి. హీరోలు కూడా అలాంటి కథలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు అది లోపించింది.  తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఉత్పన్నమైన కొన్ని సంఘటనలు రాజకీయ దుమారాన్నికూడా రేపాయి. సాధారణంగా రాజకీయ పార్టీలు సినిమావాళ్లతో మంచి  సంబంధాలనే నెరుపుతుంటాయి. ఎన్నికల ప్రచారానికి వాడుకోవొచ్చని మర్యాద ఇస్తుంటారు. అయితే ఈ మధ్య లోబ్జడెట్‌ సినిమాలు పెరిగి పెద్దనటుల సినిమాలు తగ్గిపోతున్నాయి. పాన్‌ ఇండియా సినిమాలపై పెట్టిన డబ్బు కోసం యువతను ఆకర్షించే పనిలోపడి పరిశ్రమ కుటుంబ ప్రేక్షకులకు దూరమవుతోంది. దీనివల్ల సినిమావాళ్లపై రాజకీయ పార్టీలకు గురి కూడా తగ్గిపోతోంది. వారిని ప్రత్యేకంగా చూడాలనే అవసరం కూడా ఇప్పుడు కానరావడం  లేదు. దీనికి కారణం సినిమావాళ్ల తీరే ప్రధానమని చెప్పవచ్చు.

తమ హీరోలను ఏమైనా అంటే ఊరుకొనేది లేదు అనే వీరాభిమాన ప్రేక్షకులు కూడా కరువవుతున్నారు. ఈ మధ్య హీరో నాగార్జున ఫంక్షన్‌ హాల్‌ను హైడ్రా యంత్రాలు నిట్టనిలువునా కూల్చేసినా అడిగేనాథుడే లేకుండాపోయాడు. తప్పు  ఆయనదా కాదా అనే విషయం పక్కనపెడితే ప్రముఖ హీరోగా పేరు, గుర్తింపు ఉన్నా ఆయన్ని తాకడానికి ప్రభుత్వం వెనుకాడలేదు. పైగా హైదరాబాద్‌  చెరువుల పరిరక్షణకు బయలుదేరిన ఆ ప్రభుత్వ సంస్థ ఏకంగా నాగార్జున షెడ్ల నేలమట్టంతోనే తన పనికి శ్రీకారం చుట్టింది. చెరువు ఒడ్డుపై 2010లో నిర్మించిన ఈ కట్టడం కోర్టు స్టేపై కొనసాగి 14 ఏళ్ల తర్వాత ఆగస్టు 24న కూల్చివేతకు గురైంది. ఈ చర్యతో సినిమావాళ్లంటే గొప్పేమీ  కాదని ప్రభుత్వం చేతల ద్వారా రుజువు చేసింది. మామూలు మనుషులకు, సినిమావాళ్లకు తేడా ఏమి లేదని మొత్తం సినీ పరిశ్రమకే రేవంత్‌ సర్కారు షాకిచ్చింది. దెబ్బ మీద  దెబ్బగా నాగార్జున కుటుంబాన్ని మంత్రి కొండా సురేఖ వార్తల్లోకి లాగారు. నాగార్జున కొడుకు విడాకుల విషయంలో కెటిఆర్‌ ప్రమేయం ఉందంటూ ఆవిడ సినీరంగానికి, రాజకీయాలకు కొత్త ముడివేశారు. సినీ పరిశ్రమ యావత్తు మంత్రి మాటల పట్ల మూకుమ్మడిగా తీవ్ర అభ్యంతరం తెలపగా చిన్న మాటతో ఆమె కథ ముగించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని కెటిఆర్‌ కోర్టుకు వెళ్లారు. కానీ నాగార్జున పరివారం మాత్రం ఇది ఇంతటితో ఆగితే చాలనుకున్నారు.  ప్రభుత్వంలో ఉన్న ఒక మహిళా మంత్రితో యుద్దానికి దిగితే మరింత చిక్కుల పాలవడమే అని వారు అనుకున్నారేమో. ఇలా ఘనమైన అక్కినేని వారసత్వం తల దించుకోక తప్పలేదు.

నటుడు మోహన్‌ బాబు  ఇటీవల ఒక టివి ఛానల్‌ రిపోర్టర్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే కదా.  2007లో ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. 1995 -2000 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1993 నుండి ఓ విద్యాసంస్థను నడుపుతున్నారు. అలాంటి వ్యక్తి విలువలన్నీ మరచి తీవ్ర ఆవేశంతో ఛానల్‌ మైకును లాక్కొని విలేకరి తలపై తీవ్రంగా కొట్టిన దృశ్యాలు అందరు చూశారు. 72 ఏళ్ల వయసులో సహనం, సంయమనాన్ని మరిచిన ఆయన ఈ దుశ్చర్యతో తీవ్ర విమర్శను ఎదుర్కోక తప్పలేదు. విలేకరులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. కోర్టు ముందస్తు బెయిల్‌ నిరాకరించింది. ‘మోహన్‌ బాబు పరారీ’.. పోలీసు బృందాల గాలింపు’ అని టివి స్కోల్రింగ్స్‌ వచ్చాయి. ఐదు రోజుల తర్వాత ఆయన దిగి వచ్చి హాస్పిటల్‌కు వెళ్లి ఆ విలేకరి ముందు పశ్చాత్తాపం ప్రకటించక తప్పలేదు. ఇక ఇప్పుడు ఫోకస్‌ అంతా అల్లు అర్జున్‌పై పడిరది. పుష్ప 2 ప్రీమియర్‌ షోకు వచ్చిన ఓ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. హీరో అల్లు అర్జున్‌ రాకతో ఏర్పడ్డ తొక్కిసలాటలో ఇల్లాలు చనిపోగా, ఓ బాలుడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల్లో అల్లు అర్జున్‌ పేరు కూడా చేర్చారు.

13వ తేదీన ఆయనను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌ గూడ జ్కెలుకు తరలించగా అదే రోజు సాయంత్రం మధ్యంతర బెయిల్‌ లభించింది.14 ఉదయం విడుదలై  ఇంటికి చేరుకున్నారు.  విషాదంలో ఉన్న కుటుంబాన్ని హీరో పరామర్శించకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు ఆయన అరెస్టు, విడుదలపై సినీ పరిశ్రమ చేస్తున్న సందడి అతిగా ఉందని అంటున్నారు. అయితే రకరకాల వీడియో క్లిప్పింగ్స్‌తో నెటిజన్లు ఈ సందర్భానికి రాజకీయ రంగు పులుముతున్నారు. సినిమా కార్యక్రమంలో అల్లు అర్జున్‌ తెలంగాణ ముఖ్యమంత్రి పేరును మరిచిపోయి తడబడడం ఒక వీడియోలో ఉంది. ఈ అరెస్టుతో రేవంత్‌ బదులు తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు. సినిమా పరిశ్రమలో బలమైన ఈ కుటుంబం రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ను తికమక పెట్టినా ఆశ్చర్యం లేదు. అల్లు అర్జున్‌ అరెస్టు విడుదల చూస్తుంటే రాష్ట్రం లోపలేస్తే కేంద్రం విడిపించినట్లుంది. ఇదే కోణంలో  విభేదాలు పెరగవచ్చు. ఈ సంఘటనల నేపథ్యంలో..  ఫక్తు వ్యాపారంగా మారిన సినీ పరిశ్రమపై ప్రభుత్వం కఠినంగానే ఉండాలి.  ప్రీమియర్‌ షోలు, మొదటి వారాల ప్రదర్శనల టికెట్ల ధరల పెంపు, భారీ ప్రమోషన్‌ ఫంక్షన్లకు అనుమతి లాంటి విషయాలను  పక్కనపెట్టింది. మంచి  నిర్ణయం తీసుకుంది.   పుష్ప తొక్కిసలాట తర్వాత ఇకపై స్పెషల్‌ షోలు, అధిక ధరలు ఉండవని మంత్రి కోమటి రెడ్డి  ప్రకటించారు.  ప్రభుత్వం దానికి కట్టుబడి  ఉంటే మాత్రం ప్రేక్షకుల బాధలు తీరటమే కాదు పరిశ్రమకు కూడా అది మేలే చేస్తుందన్నది విశ్లేషకులు వాపోతున్నారు.

  -వడ్డె మారన్న
(సీనియర్‌ జర్నలిస్ట్‌)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *