- పోచంపల్లి గ్రామంలో నిష్ణాతులైన చేనేత కార్మికులు
- నకిలీ ఇక్కత్, మార్కెటింగ్ సమస్యలను పరిష్కరించాలి
- రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులు ఒక కళ మాత్రమే కాదని, గుర్తింపుకు చిహ్నం అని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి గ్రామంలో ఇక్కత్ చేనేత కార్మికులను కలుసుకున్నారు. పోచంపల్లి టూరిజం టెక్స్టైల్ పార్కులో పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులను పరిశీలించారు. అంతేకాక చేనేత కార్మికులతో ముఖా ముఖి మాట్లాడి చేనేత కార్మికుల సంక్షేమం, వారి స్థితిగతులు, సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం గవర్నర్ టెక్స్ టైల్ పార్కు సమావేశ మందిరంలో నేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ చేనేత అనేది ఒక కళ అని, ప్రత్యేకించి పోచంపల్లి ఇక్కత్ చీరలు, ఉత్పత్తులు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయని, ఇటీవల ప్రపంచ సుందరీమణుల సందర్శనతో 30 శాతం అమ్మకాలు పెరిగాయని తెలియడం సంతోషమని అన్నారు. పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులను ఎలా తయారు చేస్తారో తాను స్వయంగా చూసి తెలుసుకున్నానని అన్నారు.
పోచంపల్లి గ్రామంలో చేనేతలో చాలామంది నిష్ణాతులు ఉన్నారని, ఆఫ్ సిల్క్, కాటన్ వంటి అన్ని రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారని ,భవిష్యత్తులో పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు. అయితే పోచంపల్లి ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం తో పాటు ,మార్కెటింగ్ తీసుకువచ్చేందుకు అహ్మదాబాద్ లోని ఎన్ ఐ టి, ఐ ఐ టి సహకారంతో స్థానిక నేత కార్మికులు కలిసి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, ప్రత్యేకించి మార్కెటింగ్, డిజైనింగ్, డయింగ్ అన్ని విషయాల్లో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పోచంపల్లి చేనేత కార్మికుల తో మాట్లాడిన అనంతరం ఇక్కత్ ఉత్పత్తులకు మార్కెటింగ్ సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వొచ్చిందని, అంతేకాక నకిలీ ఇక్కత్ సమస్యను కూడా నేత కార్మికులు చెబుతున్నారని, ఈ రెండింటిని గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రస్తుతం పోచంపల్లి నేత కార్మికులు నేతతోపాటు, ఉత్పత్తి ,కలర్ ,మార్కెటింగ్, డిజైనింగ్ అన్ని వారే చూడడం వల్ల ఇక్కత్ ఉత్పత్తులను విస్తృతి చేసేందుకు అవకాశం లేదని తెలిపారు. మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించినట్లయితే చేనేత కార్మికులను కాపాడిన వారమవుతామని,ఇక్కత్ చేనేత వారసత్వంగా వస్తున్న ఒక కళ అని అన్నారు.హ్యాండ్లూమ్స్ కూడా హ్యాండీక్రాఫ్ట్ కోవలోకే వస్తాయని, అలాంటి పోచంపల్లి చేనేత ఉత్పత్తులలో భాగంగా దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మశ్రీ అవార్డు పొందిన వారు కూడా పోచంపల్లి గ్రామంలో ఉండటం అభినందనీయమని అన్నారు. నేత కార్మికులకు ఉన్న సమస్యలు చాలా చిన్నవని, వాటిని సులభంగా పరిష్కరించవచ్చని, రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల కు ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని చెప్పారు. పోచంపల్లి ఇక్కత్ చీరలు తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా, దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లవచ్చని, కార్మికులు ఇలాగే పని చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు .





