హైకోర్టుకు హాజరైన ఐఏఎస్‌లు

– రెండు వారాల్లోగా బకాయిలు చెల్లించాలి
– ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30 : చేప పిల్లలు పంపిణీ చేసిన వాళ్లకు బిల్లులు చెల్లించలేదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ విచారణకు పలువురు ఐఏఎస్‌ అధికారులు హైకోర్టుకు హాజరయ్యారు. పశుసంవర్ధక, మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌, మత్స్యశాఖ కమిషనర్‌ ప్రియాంక అలా హైకోర్టు విచారణకు ఆన్‌లైన్‌లో హాజరయ్యారు. నాగర్‌ కర్నూల్‌ కలెక్టర్‌ బి.సంతోష్‌, పిషరీస్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్‌ వేశారు. తదుపరి విచారణకు వీరందరికీ విచారణ నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. 2023-24లో పంపిణీ చేసిన చేప పిల్లలకు సొమ్ము చెల్లించకపోవడంతో శ్రీ మత్స్య ఫిషరీస్‌ ఫామ్స్‌, పలు చేప పిల్లల ఉత్పత్తి సంస్థలు సుమారు 11 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశాయి. అర్హులైన వారికి రెండు వారాల్లో బిల్లులు చెల్లింపులు చేసి అమలు నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేసిన అర్హులైన వారికి బిల్లులు చెల్లించాలని గత ఏడాది డిసెంబర్‌లో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌ కుమార్‌ బుధవారం విచారించారు. పిటిషనర్ల తరపు న్యాయవాదులు పొన్నం అశోక్‌ గౌడ్‌, డి.ఎల్‌.పాండు వాదిస్తూ బిల్లులు చెల్లించాలన్నదే తమ ఉద్దేశమని, అధికారులను శిక్షించాలని కోరుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్వరూప్‌ ఊరిళ్ల వాదిస్తూ సాంకేతిక కారణాల వల్ల బిల్లులు చెల్లించలేకపోయామని, త్వరలో బిల్లుల చెల్లింపులు చేస్తామని కోర్టుకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *