నేను ఈసా.. నేను మీ మూసీ..

నేనిప్పుడు నదిని కాదు… మీ నగరపు మురుగునై ప్రవహిస్తున్న,

ఒకప్పుడు మీ దాహాన్ని తీర్చిన ఈసాను..

మీ పొలాలకు పచ్చదనాన్ని పంచిన మూసీని!
నా దేహం పై కాంక్రీటు కోటలు కడుతుంటే..
నా గర్భాన్ని విషపు రసాయనాలతో నింపుతుంటే..
నా ప్రాణం ఊపిరి ఆడక కొట్టుకుంటున్నది!
వేల కోట్లతో రంగులద్దుతారట.. గాంధీ సరోవరం అంటారట!
నా మురికిని కడగని ఆ అందమైన మెరుగులు నాకెందుకు?
నా ఒడ్డున గూడు కట్టుకున్న పేదోడి కన్నీళ్లు తుడవని ఆ ప్రాజెక్టులెందుకు?
నిలువ నీడ లేని నిర్వాసితుల ఆకలి కేకలు విన్నారా?

వేల కోట్ల రూపాయల తళతళలు నా దాహాన్ని తీర్చవు
నాకు కావాల్సింది అందమైన ‘సరోవరం’ కాదు
నిర్మలమైన నా ‘ప్రవాహం’!
కృత్రిమమైన కట్టడాల ఆడంబరం కంటే..
కలుషితం లేని నా స్వచ్ఛతే నాకు మిన్న!

అక్కడ దామగుండం అడవిలో గొడ్డలి వేటు పడుతుంటే..
నా పుట్టిన ఇల్లు కాలిపోతున్నట్లు అనిపిస్తున్నది!
వేల ఏళ్ల పచ్చదనాన్ని రాడార్ల కోసం బలి ఇస్తూ..
నా గమనాన్ని, గమ్యాన్ని కలుషితం చేస్తున్నారు

నా నీరు నల్లబడింది.. నా మనసు వికలమైంది
నేను పారేది సముద్రం వైపు కాదు.. వినాశనం వైపు!
పరిశ్రమల విషాన్ని నా ఒడిలోకి పంపుతూ..
నన్ను ‘మురికి కాలువ’ అని ఈసడించుకుంటారా?

వేల కోట్లు కుమ్మరించి నన్ను బొమ్మగా మార్చకండి
కలుషితం కాకుండా నన్ను కన్నతల్లి లా చూడండి!
నేను బతికితేనే మీరు బతుకుతారు..
నా ప్రవాహం ఆగితే మీ ప్రగతి ఆగిపోతుంది!
ఆడంబరపు ప్రాజెక్టుల వికృత రూపం వద్దు.. నా సహజమైన రూపాన్ని నాకు ఇవ్వండి!

నన్ను మళ్ళీ ‘నది’ని చేయండి!

-వి. శాంతి ప్రబోధ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *