హైదరాబాద్ నగరాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే హైడ్రా, మూసీ ప్రాజెక్టును తీసుకొస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి చేయడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. పదేళ్లు మీరు దోచుకున్న సొమ్ముతో పాటు, మీ పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు మూలుగుతున్నాయని, అందులోంచి రూ.500 కోట్లు మూసీ ప్రాంత పేదలకు పంచి పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పండి… ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు. మూసీ మురికిలో మగ్గుతున్న పేదలకు ఇళ్లు ఇచ్చి, రూ.25వేలు ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నాం. మీ ఫామ్ హౌస్ లను కాపాడుకోవడానికే పేదల ముసుగు అడ్డం పెట్టుకుంటున్నారు.
కేటీఆర్ అక్రమంగా నిర్మించిన మీ ఫామ్ హౌస్‌లు కూల్చాలా వద్దా? సబితమ్మ ముగ్గురు కొడుకులకు ఫామ్ హౌస్ లు ఉన్నాయి.. వాటిని కూలగొట్టాలా వద్దా..? ఫామ్ హౌసులు కూలుతాయనే పేదలను అడ్డు పెట్టుకుంటున్నారు. నల్లచెరువులో, మూసీ నది ఒడ్డున ప్లాట్లు చేసి అమ్మింది మీ పార్టీ నాయకులు కాదా..? 20ఏళ్లు ప్రజల్లో తిరిగినవాన్ని నాకు పేద ప్రజల కష్టాలు తెలియదా? మూసీని అడ్డు పెట్టుకుని ఎంతకాలం తప్పించుకుంటారు..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జవహర్ నగర్ లో 1000 ఎకరాలు ఉంది… రండి పేదలకు పంచి ఇందిరమ్మ ఇండ్లు కట్టిద్దామని, ఇక్కడి ఎంపీ మోదీ దగ్గర నుంచి ఏం తీసుకొస్తారో చెప్పాలని నిలదీశారు. సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయొచ్చు కానీ.. మూసీని అభివృద్ధి చెయ్యొద్దా ఈటెలా? అని ప్రశ్నించారు.
కేటీఆర్, హరీష్ లు మాట్లాడిన జిరాక్స్ కాపీ తీసుకుని ఈటల మాట్లాడుతున్నారు.. పార్టీ మారినా ఈటలకు పాత వాసనలు పోలేదు మూసీ పరీవాహక ప్రాంతాల పేదలకు ఇండ్లు తీసుకురావడానికి మోదీ దగ్గరకు వెళదాం రండి… నాకు రావడానికి ఎలాంటి భేషజాలు లేవు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ముందుకు వొస్తే నగరంలో చెరువుల లెక్క, ఆక్రమణల లెక్క తీస్తామని అన్నారు. వందలాది గొలుసుకట్టు చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, దీంతో వరదలు వొచ్చి లక్షలాది కుటుంబాలు ఆగమవుతున్నాయి.. రాజకీయాల కోసం మూసీ ప్రాజెక్టు చేపట్టలేదు. హైదరాబాద్ భవిష్యత్ కోసమే మేం ఈ ప్రాజెక్టు చేపడుతున్నాం. సంచులు తీసుకున్నవాళ్ళకే సంచుల గురించి తెలుస్తుంది. దోపిడీ సొమ్ముతో కేటీఆర్ అడ్డగోలు పనులు చేస్తే ప్రజలు క్షమించరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.





