– ప్రతీరోజు చెత్త సేకరణ జరగాల్సిందే
– క్యూర్ పరిధిలో ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలి
– కొత్త డంప్ యార్డులు అందుబాటులోకి తీసుకురండి
– మున్సిపల్ కమిషనర్లతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: నగరాన్ని క్లీన్ సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఉన్నతాధికారులతో సీఎం శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ప్రతీరోజు చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో ప్రతీరోజు ఇంటింటా చెత్త సేకరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. చెత్త సేకరణకు సంబంధించి విద్యుత్ వాహనాలను వినియోగించేలా ఇప్పటినుంచే ప్రోత్సహించాలని సూచించారు. ఒక్కో వాహనానికి ఒక్కో ఏరియా చొప్పున కేటాయించి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నగరం పరిధి విస్తరించిన నేపథ్యంలో ఇప్పటికే కొత్తగా గుర్తించిన డంప్ యార్డులను వీలైనంత త్వరగా సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్పొరేషన్ల వారీగా దగ్గరలోని డంపింగ్ యార్డులకు చెత్తను తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటింటా చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. నిర్మాణ వ్యర్థాలకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పొరేషన్లలో నిర్మాణ వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ డంప్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్మాణ వ్యర్థాల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అపరిశుభ్రత లేకుండా చూసుకోవడంతోపాటు దోమల నివారణకు చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల విషయంలో నగరవాసులకు సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సైబరాబద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన, మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




