– మతం ఆధారిత ఓట్ల కోసం పాకులాడుతున్నాయి
– దీపక్ రెడ్డి గెలిస్తే ప్రజల గొంతుకగా నిలుస్తారు
ౖ- గౌడల సమ్మేళనంలో బీజేపీ చీఫ్ రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6: గత పదేళ్ల బీఆర్‌ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగర అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, రహదారులు పాడైపోగా డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా మారింది.. వీధి దీపాలు వెలగడం లేదు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి వైఖరితో ప్రజలకు కనీస సౌకర్యాలకు కూడా నోచుకోవడం లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని మోతీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గౌడ సామాజిక ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రామచందర్‌రావు పాల్గొన్నారు. గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ హైదరాబాద్‌లోని ప్రధాన సమస్యలను పరిష్కరించలేకపోయారన్నారు. గుంతల రహదారులు, ట్రాఫిక్ రద్దీ, మ్యాన్‌హోల్స్ సమస్యలన్నీ అలాగే ఉన్నాయంటూ పదేళ్లల్లో ఆయన సాధించింది ఏమిటి అని ప్రశ్నించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మున్సిపల్ శాఖను తనవద్దే ఉంచుకున్నారు.. హైదరాబాద్ అభివృద్ధికి రూ.2,000-3,000 కోట్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.. కానీ నిధులు విడుదల చేసిందిలేదన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల హైదరాబాద్ విశ్వనగరం కాస్తా విషాద నగరంగా మారింది. హైదరాబాద్ ప్రజల అభివృద్ధి కంటే మతపరమైన ఓట్ల కోసం ఈ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. కేవలం 20% ఓటు బ్యాంకు కోసం వాగ్దానాలు చేస్తూ, నగరానికి ప్రాణమైన 80% ప్రజలను పూర్తిగా విస్మరించాయన్నారు. ఎర్రగడ్డలో ప్రభుత్వ భూమిని ఖబ్రస్థాన్‌కు ఇచ్చే కాంగ్రెస్ ప్రయత్నాలను బీజేపీ నాయకులు దీపక్ రెడ్డి, రఘునందన్ రావు అడ్డుకుని ప్రజల హక్కులను రక్షించారని ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్ ఈ విషయంలో మౌనంగా వ్యవహరించిందన్నారు. జూబ్లీహిల్స్ ప్రజల సమస్యలపై అసెంబ్లీలో బలమైన గొంతుకగా నిలిచే బలమైన నాయకుడు కావాలని, నిజమైన అభివృద్ధి, బాధ్యత కలిగిన నాయకత్వం ఇవ్వగలిగేది బీజేపీి మాత్రమేనని అన్నారు. బీజేపీికి మద్దతుగా నిలిస్తే పాయల్ శంకర్ వంటి నాయకులతో కలిసి దీపక్‌రెడ్డి ప్రజా సమస్యలపై బలమైన స్వరంగా నిలుస్తారన్నారు. వైఎస్‌ఆర్ పాలనలో జారీ చేసిన జీవో 676తో రాష్ట్రవ్యాప్తంగా తాటి కాంపౌండ్లను మూసివేసి గౌడ్ సమాజం జీవనాధారాన్ని పూర్తిగా నాశనం చేశారని రామచందర్‌రావు ఆరోపించారు. ఆ అన్యాయాన్ని బీఆర్‌ఎస్ కూడా కొనసాగించిందన్నారు. కానీ బీజేపీ మాత్రం గౌడ్ సమాజ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నదని, గౌడ్‌ల జీవనోపాధి, గౌరవం, ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీనే అని వివరించారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



