సాంస్కృతిక బానిసత్వం ఎన్నాళ్ళు!?

“తెలంగాణా సాంస్కృతిక సలహామండలి అనేది ఒకటి ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె డా.గుమ్మడి వెన్నెల ఛైర్‌పర్సన్‌గా, ప్రొ కోదండరామ్ సలహాదారుగా ఏర్పాటు చేశారు.తెలంగాణాలో తెలంగాణా భావజాలం వ్యాప్తి ప్రకటనలు ఉద్దేశ్యపూర్వకంగా అణచివేస్తున్న నోరు విప్పడం లేదు.ఆంధ్ర సరిహద్దుల నుండి వచ్చి తెలంగాణా అధికారంలో తిష్టవేసి తెలంగాణా ప్రజల కొంప,గోడు కూల్చినా కోదండరాం తో సహా,చాంతాడంత సలహామండలి సభ్యులు ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు.బాధితులను పరామర్శించ లేదు. పదవుల పదిలం మాటున హృదయాలు కరగలేదు. నోరుమెదపలేదు.”

-ఎన్.తిర్మల్
(రచయిత, సీనియర్ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త)
మొబైల్ :9441864514.

తిరుగుబాటు తత్వం ఉగ్గుపాలతో పురుడు పోసుకున్న తెలంగాణా రాష్ట్రంలో సాంస్కృతిక బానిసత్వం ఇప్పుడు అడుగడుగునా కనిపిస్తుంది.నిర్థాక్షిణ్యంగా వెలుగు మట్ల పేదల ఇళ్ళు కూల్చివేత తర్వాత దీని స్వరూపం మరింత నగ్నంగా బయటపడింది.మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ ప్రాధాన్యత పేరుతో ఆయన ప్రాధమిక స్ఫూర్తినే చంపేసింది.గద్దర్ కూతురుకు పదవి ఇవ్వడమో!గద్దర్ పేరుతో ఆంధ్ర సినీ కల్చర్ ను మెప్పించడమో!!గద్దర్ ఆశయాలను కాపాడడం కాదు?గద్దర్ ఆహార్యం,స్ఫూర్తి అన్నిపేద ప్రజల ఆర్తనాదాలు మాత్రమే!గద్దర్ అనేపేరు కూడా ఆయనకు ప్రజల మమేకతనుండి రూపుదిద్దుకొన్నది మాత్రమే!

    ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు తెలుగుదేశం, కాంగ్రెస్, టిఆర్ఎస్ ఏపార్టీ అదికారంలో ఉన్నా ఆయన ఉపేక్షించలేదు.ఎక్కడ పేదలకు అన్యాయం జరిగినా తనకలాన్ని,గళాన్ని విప్పి అండగా నిలిచారు.గజ్జకట్టి ఆడారు,పాడారు.అదే ఆయనను ప్రత్యేక ప్రజా సంస్కృతి స్మ్రతి కర్తగా , తెలంగాణా సాంస్కృతిక ఐకాన్ గా నిలబెట్టింది.వెలుగు మట్ల దారుణ కృత్యం,పేదల ఇళ్ళు కూల్చిన ఆర్తనాదాలు తెలంగాణా కళాకారులకు పట్టలేదు.చెవులనుతాకలేదు. ఒకరిద్దరుకళాకారులు,పాశం యాదగిరి లాంటి ఒకరిద్దరు జర్నలిస్టులు తప్ప ఎవరూ నోరు విప్పలేదు.తెలంగాణా ఉద్యమానికి తలమానికం,వెన్నెముక సాంస్కృతిక ఉద్యమం.తెలంగాణా ఉద్యమ స్ఫూర్తి  కాంగ్రెస్ ప్రభుత్వం చంపివేస్తుంది..తెలంగాణా కవులు,కళాకారులను అవార్డులు పేరుతోనో,పదవులు పేరుతోనో ,లేక కోటిరూల బహుమతుల పేరుతోనో నోరుమూయించింది.కట్టిపడేసింది.అందుకు తాజా ఉదాహరణ చీమ చిటుక్కుమంటే పాటరాసే కవులు, కళాకారులు వెలుగు మట్ల చీకటి కథలను పట్టించుకోలేదు.ప్రజల హాహాకారాలు, వారికి వినిపించలేదు.కనిపించలేదు.రెండున్నర ఏళ్ళుగా చేసిన వాగ్దానాలు ఎండబెట్టినా మౌనం రూపం దాల్చారు?పేదల ఆర్తనాదాలు వారి చెవులనుతాకలేదు.పాలకవర్గంనుపల్లెత్తుమాట అనకుండా చెట్టుమీద,పుట్టి మీద పాటలు రాసి కాలం వెళ్ళబుచ్చుతున్నారు!

    తెలంగాణా సాంస్కృతిక సలహామండలి అనేది ఒకటి ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె డా.గుమ్మడి వెన్నెల  ఛైర్‌పర్సన్‌గా, ప్రొ కోదండరామ్  సలహాదారుగా   ఏర్పాటు చేశారు.తెలంగాణాలో తెలంగాణా భావజాలం వ్యాప్తి ప్రకటనలు ఉద్దేశ్యపూర్వకంగా అణచివేస్తున్న నోరు విప్పడం లేదు.ఆంధ్ర సరిహద్దుల నుండి వచ్చి తెలంగాణా అధికారంలో తిష్టవేసి తెలంగాణా ప్రజల కొంప,గోడు కూల్చినా కోదండరాం తో సహా,చాంతాడంత సలహామండలి సభ్యులు ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు. బాధితులను పరామర్శించ లేదు. పదవుల పదిలం మాటున హృదయాలు కరగలేదు. నోరుమెదపలేదు.   తెలంగాణా రాష్ట్రంలో ఒకటి కాదు రెండు కాదు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహావిష్కరణ బలవంతంగా నే రవీంద్ర భారతిలో ఆవిష్కరణ చేశారు.తెలంగాణా వాదుల అభ్యంతరం లెక్క చేయలేదు..కొణిజేటి రోశయ్య, ఎన్టీఆర్ ఇలా అనేక విగ్రహాల విషయంలో తలెత్తిన వివాదం సమయంలో సైతం నోరెత్త లేదు.ఒకరకమైన ఆధిపత్య సంస్కృతి రుద్దాలని చూస్తున్నామౌనంగా ఉండడం తోపాటు,తెలంగాణా సాంస్కృతిక సలహామండలి ప్రభుత్వంకు ఇచ్చే సలహాలు ఏమిటో అర్థం కాదు.ఏమైనా చెవిలో చెబుతున్నారో ఏమో ఎవరికి తెలియదు.వీటన్నింటికీ మించి గద్దర్ కూతురు వెన్నెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెల్లి గద్దర్ విగ్రహం కోసం చంద్రబాబు నాయుడును అభ్యర్థించడం, చూస్తే తెలంగాణా సాంస్కృతిక బానిసత్వం ఎక్కడి వరకు పయనించిందో అర్థం అవుతుంది.ఎలా విస్తరిస్తుందో కళ్ళముందు కనిపిస్తుంది.

  చనిపోయో వరకు తన తండ్రి దేహంలో ఉన్న అణచివేత తూటాల ఉనికిని కూడా ఆమె మర్చిపోయింది.ఎక్కడైనా ఒక విగ్రహం పెట్టడం ద్వారా గద్దర్ స్ఫూర్తి నిలబడదు. ఆయనే ప్రజల గుండెల్లో పెద్ద సాంస్కృతిక రూపమై స్థిరమైన గూడుకట్టుకున్నవాడు.గద్దర్ అవార్డులు గురించి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సినీప్రముఖులు ఎందరికో అవార్డులు కట్టబెట్టారు.కానీ, తమ సామాజిక వర్గానికే చెందిన తొలి సినీ గేయరచయిత ,తెలంగాణా యాస, భాషను 1910 ప్రాంతంలోనే “కనక్తార “నాటకంలోవాడిన మహారచయిత,తొలి సినీగేయ రచయిత అయిన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లికి చెందిన చందాల కేశవదాసు ఆయనకు గుర్తురారు. ఆయన రచనల్లో తెలంగాణా స్ఫూర్తిని కాపాడాలనే ప్రయత్నం చేయడం గానీ,ఆయన పేర అవార్డులు ఇవ్వడం కానీ చేయరు?అందువల్ల వారికి ఒనగూడే ప్రయోజనం లేదు.

   గద్దర్ పేరుతో ఇచ్చే సినీ అవార్డులు కూడా ఆంధ్రా మూలాలు కలిగిన పాతుకు పోయిన పేరున్న ఒకటిరెండు కుటుంబాలకు దారాదత్తం చేస్తున్నారు.తప్ప తెలంగాణా కళలను , సాంస్కృతిక నేపథ్యాన్ని గద్దర్ స్ఫూర్తి తో ప్రొత్సహించే పని అసలు ఎక్కడా రేఖామాత్రంగా చేపట్టడం లేదు.తెలంగాణా యాస,భాష అభివృద్ధి అనే ప్రాథమిక లక్ష్యమే మరచారు.తెలంగాణా సాహిత్య రంగాన్ని బలోపేతం చేసిన దాశరథి సోదరులు,వట్టికోట ఆళ్వారు స్వామి,వానమామలై వరదాచార్యులు ,సి.నారాయణరెడ్డి, హీరాలాల్  మోరియా, ముగ్ధూమ్ మోహియుద్దీన్ లాంటి వారు కనపడరు. పెట్టుబడులు,కట్టుకథలు,నేలవిడిచి సాముచేసి సమాజాన్ని తప్పుదోవ పట్టించే సినిమా, కళాకారులకు గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వడమే అసలు ఎబ్బెట్టుగా ఉంది. గద్దర్ నేపథ్యం, స్ఫూర్తిని ప్రభుత్వం అసలు అర్థం చేసుకున్నట్లు కనిపించడంలేదు. ఆయన పేరును వాడుకోవాలనే ఆర్భాటం ,తపన తప్ప మరేమీ కనిపించడంలేదు..!

   కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణ సాహిత్య అకాడమీ అనేది ఒకింత యాక్టివేట్ చేశారు.ప్రపంచ తెలుగు మహాసభలు జరపడం తో పాటు మరుగున పడిన తెలంగాణా రచయితల జీవిత చరిత్రలను వెలికి తీయించి పుస్తకాలు ప్రచురించారు.ఒకింత తెలంగాణా లో సాహిత్య, సాంస్కృతిక సంబరాలు జరిపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సగం కాలం పూర్తయి, రెండున్నర ఏళ్ళు గడుస్తున్నా తెలంగాణా సాహిత్య అకాడమీ కి చైర్మన్,బాడీని సైతం నియమించలేక పోయారు.మూడేళ్ళ కాలపరిమితి ఉండే నియామకాలు జరగకుండానే ఒక టర్మ్ గడిచిపోయింది.ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో అర్థంకాదు?

    రచయితల ను ప్రొత్సహించడం అనే అంశం ప్రక్కన పెడితే జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు నియామకం కూడా చేపట్టలేక పోయారు.ఒకవేళ చేపట్టినా రాజకీయ ఆశ్రితులను సంతృప్తి పరచడానికి తప్ప దానికి అర్హులైన వారికి పదవులనుకట్టబెట్టే అంశం ఇరవై ఏళ్ల క్రితమే అదృశ్యం అయ్యింది.చివరకు గ్రందాలయాల కాన్సెప్టు మారిపోయి కోచింగ్ సెంటర్లుగా మారిపోయాయి.ఇక ఇక్కడో విషయం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది.తెలంగాణా రాష్ట్రం లో చాలా భాగం  కోయ,గోండు,దొర చుట్టం,కొండారెడ్డి,మోరియా,చెంచు,ఎరుకల,యానాదిలాంటి గిరిజన జాతుల కు నెలవైన నేల,మూలవాసిప్రజల సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాల్సిన కనీస బాధ్యత తెలంగాణా ప్రభుత్వం పై ఉంది.ప్రొపెసర్ జయధీర్ తిరుమల రావు,ఆయన అనుచర బృందం తమ జీవిత కాలం హెచ్చించి గిరిజనుల కళా సాంస్కృతిక చిహ్నాలైన అనేక వస్తువులు సేకరించారు. దానినే ఆదికళ ‘ఆధ్యకళ’ అంటారు.అన్నీ సేకరించి హైదరాబాద్ లాంటి పెద్ద పట్టణం లో వాటి ప్రదర్శన ఏర్పాటుతో పాటు, భవిష్యత్తు కాలానికి వాటిని అంతరించిపోయే ఓ సంస్కృతిని భవిష్యత్తు కు భద్ర పరచాలసి ఉంది.కనీసం తెలంగాణా ఆద్య  కళను కాపాడే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదు.

   ఇలా తెలంగాణా సాహిత్య, సాంస్కృతిక ప్రాధాన్యతల్లో  అపసవ్యత చోటు చేసుకుంటుంది.తెలంగాణా సాంస్కృతిక సంకరం కు కుట్రలు  జరుగుతున్నాయి. భౌతిక తెలంగాణా సాధనలో తెలంగాణా సాహిత్య, సాంస్కృతిక వర్గాల పాత్ర అద్వితీయమైనది.తెలంగాణా ప్రజల అస్తిత్వం, ఆచారాలు,జీవన విధానం తెలంగాణా సాంస్కృతిక సంబంధాలతో పెనవేసుకున్నాయి. కనుక తెలంగాణా లో ఏపార్టీ పరిపాలనలో ఉన్న తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక అస్థిత్వం నిలబెట్టడం కూడా ఆయా ప్రభుత్వాల కనీస బాధ్యత. అదేవిధంగా తెలంగాణా కవులు, రచయితలు, కళాకారులు దేన్నైనా భరిస్తారు కానీ సాంస్కృతిక బానిసత్వాన్ని అసలు ఒప్పుకోరనే విషయం పాలకులు గుర్తించాలసి ఉంది.అసలు తెలంగాణా ఉనికి, అస్తిత్వం  తెలంగాణా సంస్కృతి ,సాంప్రదాయాలు నుండి రూపుదిద్దుకొంది.

(గద్దర్ పై కాల్పులు జరిగి 29 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ..)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *