170మంది మావోయిస్టుల లొంగుబాటు

– వారిలో వాసుదేవరావు తదితర కేంద్ర నాయకులు
– ’ఎక్స్‌’  వేదికగా వెల్లడించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

న్యూదిల్లీ, అక్టోబర్‌ 16: మావోయిస్టు పార్టీకి దశాబ్దాలపాటు అత్యంత కీలక నేతగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాల్‌రావు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ముందు లొంగిపోయిన మరుసటి రోజే మరో 170మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించారు. లొంగిపోయిన వారిలో సతీష్‌ అలియాస్‌ టి.వాసుదేవరావు సహా పదిమంది సీనియర్‌ మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన వారి జాబితాలో రాణిత, భాస్కర్‌, నీలా అలియాస్‌ నందే, దీపక్‌ పాలో సహా పలువురు ఉన్నారు. వీరిలో వాసుదేవరావు తలపై రూ.కోటి రివార్డు ఉండగా మరికొందరిపై లక్షల్లో రివార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలించేందుకు తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. ఈమేరకు ఆయన ’ఎక్స్‌’లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో 27మంది, మహారాష్ట్రలో 61మంది జనజీవన స్రవంతిలోకి వచ్చారన్నారు. దీంతో రెండు రోజుల వ్యవధిలో 258మంది లొంగిపోయారన్న అమిత్‌ షా నక్సలిజంపై పోరులో ఇదో పెద్ద విజయమన్నారు. భారత రాజ్యాంగంపై తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూ హింసను త్యజించాలనే వీరి నిర్ణయాన్ని అభినందిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల ఫలితాలను ఇది ప్రతిబింబిస్తోందన్నారు. తమ విధానం స్పష్టంగా ఉందన్న అమిత్‌ షా లొంగిపోయే వారిని స్వాగతిస్తామని, ఇంకా తుపాకీతో ఉద్యమం కొనసాగించాలనుకొనేవారు భద్రతా దళాల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. నక్సలిజం మార్గంలో ఇంకా కొనసాగుతున్న వారు ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేరాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద స్థావరాలుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌, ఉత్తర బస్తర్‌లు విముక్తి పొందిన ప్రాంతాలుగా ప్రకటించడం సంతోషదాయకమన్నారు. ఇప్పుడు దక్షిణ బస్తర్‌లో నక్సలిజం జాడ ఉందని, దీన్ని భద్రతా దళాలు త్వరలో తుడిచిపెడతాయని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ సర్కార్‌ ఏర్పడిన తర్వాత జనవరి 2024 నుంచి 2,100 మంది మావోయిస్టులు లొంగిపోగా, 1785మందిని అరెస్టు చేశారని తెలిపారు. 477 మందిని భద్రతాదళాలు నిర్మూలించాయని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *