– ఆస్తులుంటే వీలునామా రాయండి
– సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూదిల్లీ, నవంబర్ 19: దేశంలో హిందూ మహిళల ఆస్తులపై గత కొన్నేళ్లుగా వివాదాలు చోటుచేసుకుంటున్న వేళ సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. హిందూ మహిళ ఆస్తి కోసం పుట్టింటివారు, అత్తింటి వారు కోర్టు మెట్లు ఎక్కుతున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలు తమ మరణానంతరం ఆస్తిపై వివాదం లేకుండా ఉండాలంటే.. వారు బతికి ఉండగానే ఆస్తి ఎవరికి చెందాలనే విషయంలో స్పష్టంగా వీలునామా రాయాలని సూచించింది. మహిళకు పిల్లలు లేకపోతే ప్రస్తుత హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆమె ఆస్తి మొదటగా భర్త కుటుంబానికి వెళ్లే అవకాశం ఉంటుందని కోర్టు గుర్తుచేసింది. కానీ చాలా సందర్భాల్లో ఆస్తి విషయమై మహిళ పుట్టింటి వాళ్లకు, అత్తింటి వారికి మధ్య వివాదాలు చెలరేగుతున్నాయని పేర్కొంది. వివాహానంతరం మహిళ గోత్రం మారుతుందన్న సంప్రదాయ అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వివాహం తర్వాత మహిళపై ప్రధాన బాధ్యత భర్త కుటుంబానిదే అవుతుందని పేర్కొంది. కానీ పిల్లలు లేని మహిళల ఆస్తుల విషయంలో, విడాకులు తీసుకోకుండా భర్తకు దూరంగా ఉంటున్న మహిళల ఆస్తుల విషయంలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కారణంగా వారసత్వ హక్కుల్లో తలెత్తే సమస్యలు పరిష్కరించేందుకు ప్రీ?లిటిగేషన్ మిడియేషన్ (మధ్యవర్తిత్వం) తప్పనిసరి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మధ్యవర్తిత్వంలో వచ్చే ఒప్పందాలను కోర్టు తీర్పు (డిక్రీ) గా పరిగణించాలని తెలిపింది. కొంతమంది న్యాయవాదులు ప్రస్తుత వారసత్వ చట్టంలోని సెక్షన్ 15(1)(బి) వివక్షాత్మకమని అభిప్రాయపడుతున్నారని, దాన్ని మార్చాలంటే చట్టసవరణ చేయాలని, అది పార్లమెంట్ చేయాల్సిన పని మాత్రమేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





