- జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశం
- ప్రజాతంత్ర, హైదరాబాద్
జూబ్లీహిల్స్ ఇంటి పునరుద్ధరణ పనులను క్రమబద్ధీకరించాలని సిన్మా హీరో చిరంజీవి అప్లికేషన్‌ను చట్టప్రకారం నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఇంటి పునరుద్ధరణలో భాగంగా రిటైన్ వాల్ నిర్మాణం చేశామని, దీనిని క్రమబద్ధీకరణకు జూన్ 5న జీహెచ్ఎంసీకి చేసుకున్న దరఖాస్తు జిహెచ్ఎంసీ వద్ద పెండింగ్‌లో ఉందని చర్యలు తీసుకునేలా ఆర్డర్ ఇవ్వాలని చిరంజీవి పిటిషన్ వేశారు.
దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఇటీవల విచారణ పూర్తి చేసి పైవిధంగా ఉత్తర్వులు జారీ చేశారు. 2002లో గ్రౌండ్, మరో రెండంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకుని నిర్మించాక పునరుద్ధరణలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యగా అనుమతులు తీసుకున్నట్లు న్యాయవాది వివరించారు. తనిఖీ చేసి క్రమబద్ధీకరించాలన్న అభ్యర్థనను జీహెచ్ఎంసీ పట్టించుకోలేదన్నారు.
దీనిపై జీహెచ్ఎంసీ న్యాయవాది స్పందిస్తూ, చట్టప్రకారం దరఖాస్తుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పిటిషనర్ దరఖాస్తును నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని జీహెచ్ఎంసీని ఆదేశించిన న్యాయమూర్తి పిటిషన్‌పై విచారణ మూసివేసినట్లు ప్రకటించారు.


