- నేడు ప్రమాణస్వీకారం
– రాజ్‌భవన్‌లో ఏర్పాట్లకు ఆదేశాలు
– ముగ్గురు లేదా నలుగురికి అవకాశం
– ఎవరికనేదానిపై కొనసాగుతున్న సస్పెన్స్
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం తెలంగాణ కేబినెట్ విస్తరణ జరుగనుందని సమాచారం. మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి చోటు- దక్కనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇప్పటి వరకు 12 మంది కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారు. మరో ఆరు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఏడాదిన్నరకు పైగా కేబినెట్ విస్తరణ జరగలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరిగింది. తమకు అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానం చుట్టూ నేతలు తిరుగుతున్న పరిస్థితి. ఇటీవల మీనాక్షీ నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన తర్వాత ఆశావాహులంతా కూడా ఆమె కలిసి మంత్రి పదవి కోసం వినతులు చేశారు. కొత్తగా ఎన్నికైన నేతలు, సీనియర్ నేతలు తమకు అవకాశం కల్పించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో నేడు మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనిపై రాజ్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా రాజ్‌భవన్ వర్గాలను సీఎం కోరినట్లు తెలుస్తోంది.
కేబినెట్ విస్తరణలో ముగ్గురికి చోటు దక్కే అవకాశం ఉందని,అయితే ఈ ముగ్గురు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మంత్రి వర్గంలో చోటు దక్కించుకునేందుకు అనేక మంది పోటీపడుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నేతలు, రెడ్డి సామాజిక వర్గం నేతలు మంత్రి వర్గంలో స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎస్సీ సామాజికవర్గానికి కేబినెట్‌లో ప్రాధాన్యత లేదు. ముదిరాజ్‌లకు కచ్చితంగా అవకాశం ఇస్తానని గత ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మైనార్టీలకు కూడా కేబినెట్‌లో చోటు లభించలేదు. ఈ క్రమంలో రేపటి కేబినెట్ విస్తరణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు చోటు లభించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఓసీ సామాజిక వర్గానికి లేకుండా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.
మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డికి మంత్రివర్గంలో కచ్చితంగా చోటు ఇవ్వాల్సిందేనని కొందరు నేతలు పట్టుబడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కసరత్తు చేసిన పేర్లను పార్టీ అధిష్ఠానానికి నివేదించినట్టు తెలుస్తోంది. ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయానికి మంత్రివర్గంలోకి తీసుకునేవారి పేర్లపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఆదివారం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణకు గవర్నర్ జిష్ణుదేవ్‌శర్మకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రేపు నాలుగైదు ముహుర్తాలు ఖరారు చేసినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పేర్లు నిర్ధరణ అయ్యాక ఏ ముహుర్తంలో ప్రమాణస్వీకారం ఉంటుందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్టీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలు దఫాలుగా చర్చించారు.





