– 34 సెం.మీ రికార్డు వర్షపాతం
– నీట మునిగిన రైల్వే స్టేషన్లు..
– రైలు ప్రయాణికులకు పోలీసు, స్వచ్ఛంద సంస్థల సాయం
– డీజీపీ అభినందన
వరంగల్, ప్రజాతంత్ర అక్టోబర్ 29: మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలు అతి భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం వరంగల్ జిల్లా కల్లెడలో 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనంతరం కాపులకనపర్తి (25.23 సెం.మీ), రెడ్లవాడ (24.63), సంగెం (23. 48), వర్ధన్నపేట (22.8) ప్రాంతాల్లో కుండ పోత వర్షాలు నమోదయ్యాయి. హన్మకొండ భీమదేవరపల్లి (21.8), జనగామ గూడూరు(23.58), మహబూబాబాద్ ఇనగుర్తి (19.23), కరీంనగర్ బోర్నపల్లి (17.58) సిద్దిపేట హుస్నాబాద్ (16.45), యాదాద్రి ఆత్మకూరు (16.23) ప్రాం తాల్లో భారీ వర్షాలు కురిశాయి. హన్మకొండ కలెక్టరేట్ ప్రత్యేక కంట్రోల్ రూమ్ (7981975495) ఏర్పాటు చేశారు. ప్రజలు అత్యవసర ప స్థితుల్లో తప్ప ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని అధికారులు సూచించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్లో వరద నీరు బీభత్సం సృష్టించింది. పట్టాలపై రెండు అడుగుల మేర వరద నీరు నిలవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయాయి. గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. ప్రయాణికులను బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఐదు గంటలపాటు నిలిచిపోయి ఆపై వరంగల్‌కు దారి మళ్లించారు. కురవి మండలం గుండ్రాతిమడుగు నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను తిరిగి పంపించారు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థల కలిసి ప్రయాణికులకు ఆహారపానీయాలు అందించారు. డీజీపీ వారి సేవలను అభినందించారు. గుండ్రాతిమడుగు వద్ద పెద్ద చెరువుకు బుంగ పడి కట్ట డఙబలహీనపడటంతో వెంటనే మరమ్మతులు చేపట్టారు. పాకాల చెరువు పొంగి పొర్లడంతో గార్ల, మద్దివంచ, రామాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వట్టివాగు పొంగడంతో కేసముద్రం-గూడూరు రహదారి మూసివేశారు. హన్మకొండ బస్టాండ్‌ల్లోకి భారీగా వరద నీరు చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





