రేవంత్‌, కేటీఆర్‌, జగదీష్‌ రెడ్డిల పిటిషన్లపై విచారణ

20కి వాయిదా వేసిన హైకోర్టు

 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మాజీ మంత్రులు కేటీఆర్‌, జగదీష్‌ రెడ్డిలు గతంలో దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో శుక్రవారం విచారణలు జరిగాయి. కేసుల పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. తొమ్మిదేళ్ల క్రితం గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో రేవంత్‌ రెడ్డితోపాటు ఆయన సోదరుడు కొండల్‌ రెడ్డి, లక్ష్మణ్‌లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గోపన్‌పల్లిలోని వివాదాస్పద భూమిలో ఉన్న సొసైటీ గదిని జేసీబీతో కూల్చారని పెద్దిరాజు అనే వ్యక్తి రేవంత్‌ రెడ్డితోపాటు కొండల్‌రెడ్డి, లక్ష్మణ్‌లపై కేసు పెట్టాడు. తనను కులం పేరుతో దూషించారని కూడా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు ఈ ముగ్గురిపై ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.ఈ కేసును కొట్టివేయాలంటూ రేవంత్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారుడైన పెద్దిరాజుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును 20వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. మరో కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మరో మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లపైనా హైకోర్టులో విచారణ జరిగింది. మేడిపల్లి పోలీసు స్టేషన్‌లో తమపై నమోదైన కేసును కొట్టేయాలని కేటీఆర్‌, జగదీశ్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఫేక్‌ వీడియో సృష్టించి ప్రచారం చేశారని వారిపౖౖె తీన్మార్‌ మల్లన్న చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. గత విచారణ సందర్భంగా పోలీసులకు, తీన్మార్‌ మల్లన్నకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మళ్లీ శుక్రవారం విచారణ జరగగా తీన్మార్‌ మల్లన్న తరపు న్యాయవాది కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కోర్టు విచారణకు హాజరు కావడానికి తీన్మార్‌ మల్లన్నకు చివరి అవకాశం ఇస్తూ తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *