విజన్‌-2047లో ఒక చాప్టర్‌గా హెల్త్‌ టూరిజం

ఏఐజీ హాస్పిటల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: తమ ప్రభుత్వం రూపొందిస్తున్న తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌లో హెల్త్‌ టూరిజం ఒక చాప్టర్‌గా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ ను హెల్త్‌ టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అందులో భాగంగానే డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడిని క్యాన్సర్‌ కేర్‌ సలహాదారుడిగా నియమించామని, రాష్ట్రం చేపట్టే ప్రణాళికలో ఆయన కూడా భాగస్వామి కావాల్సిందిగా కోరుతున్నామని చెప్పారు. బంజారాహిల్స్‌లో ఏఐజీ హాస్పిటల్‌ను సీఎం రేవంత్‌ ప్రారంభించి ప్రసంగించారు. నగర ప్రజలకు రెండో అతిపెద్ద హాస్పిటల్‌ను అందుబాటులోకి తెచ్చినందుకు డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డిని అభినందిస్తున్నానన్నారు. ఆయన హైదరాబాద్‌, తెలంగాణకు గొప్ప పేరు తీసుకొచ్చారని, ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌ అవార్డు ఇచ్చిందని తెలిపారు. ఆయనకు భారతరత్న వచ్చేలా తనవంతు ప్రయత్నిస్తానని సీఎం చెప్పారు. 66 దేశాల నుంచి రోగులు ఏఐజీ హాస్పిటల్‌లో వైద్యం కోసం రావడం గర్వకారణమన్నారు. సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌ మహిళలకు హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డును క్రియేట్‌ చేయాలని భావిస్తున్నామని, ఒక యూనిక్‌ ఐడీతో ఇవి ఉంటాయని తెలిపారు. ఒకప్పుడు ఉన్న ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థ పోయి ఇప్పుడు స్పెషలిస్ట్‌ డాక్టర్స్‌ రోజులు వచ్చాయని, హెల్త్‌ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేయడం ద్వారా దీన్ని బ్రేక్‌ చేయొచ్చని అన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడగలుగుతున్నామని చెప్పడానికే మిస్‌ వరల్డ్‌ పార్టిసిపెంట్స్‌కు ఏఐజీ హాస్పిటల్‌ విజిట్‌ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ హాస్పిటల్స్‌ నిర్మాణంలో ఉన్నాయని, గోషామహల్‌లో నూతన ఉస్మానియా నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, నిర్మాణంలో ఉన్న ఆ హాస్పిటల్స్‌ పూర్తయితే మొత్తం ఏడువేల పడకలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కార్పొరేట్‌ హాస్పిటల్స్‌తో పోటీపడి ప్రభుత్వ వైద్యం అందిస్తామని, వైద్య రంగం అభివృద్ధికి రూ.11,500 కోట్లు కేటాయించామని, రూ.21,500 కోట్లు విద్యా రంగం అభివృద్ధికి కేటాయించామని, పేదలకు ఉచిత వైద్యం, నాణ్యమైన విద్య అందించాలనే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని ఆయన వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా మీ వైపు నుంచి సహకారం ఉండాలని కోరుతున్నానన్నారు. వైద్యులు ఏడాదిలో ఒక నెల రోజులు సామాజిక బాధ్యతగా ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలందించండి అని సూచించారు. మిడిల్‌ ఈస్ట్‌ దేశాల నుంచి హైదరాబాద్‌కు డైరెక్ట్‌ కనెక్టివిటీ పెంచేలా కేంద్రంతో మాట్లాడుతున్నామని, కనెక్టివిటీ పెరిగితే హైదరాబాద్‌ మరింత అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *