“ఉత్తరప్రదేశ్‌లోనో, మధ్యప్రదేశ్‌లోనో, హర్యానాలోనో జరిగినట్టు మతావేశాల ఎజెండా బిహార్‌లో ప్రధానంగా లేదన్నది ఒక సానుకూల అంశమే. మహిళలకు పదివేల చొప్పున ఖాతాలలో జమచేసి ఓట్లను కొనుగోలు చేశారని చేస్తున్న విమర్శలో కూడా ఓటర్లను ప్రభావితం చేసినది ఆర్థిక లాభం అనే లౌకికఅంశమే కదా?. ఇక కులాల వారీగా సమీకరణలు సాధించడంలో బిజెపి చాణక్యం, నితీశ్ వ్యూహం స్పష్టంగానే మెరుగైన ఫలితాలను ఇచ్చాయి. వ్యవస్థల దుర్వినియోగం, వైఫల్యం, సూక్ష్మస్థాయి నిర్వహణ, ప్రతిపక్ష ఓట్లను చీల్చడం వంటి ఎన్ని కారణాలనైనా బిహార్ ఫలితాలకు ఆపాదించవచ్చును కానీ, అర్ణబ్ గోస్వామి చెప్పినట్టు, ఏకోన్ముఖ హిందూ ఓటింగ్ మాత్రం అందుకు కారణం కాదు. బిహార్ స్థానిక రాజకీయ నైసర్గికత ఇంకా అంతగా మారలేదు….”

బిహార్ ఫలితాలు విజేతలకు ఆనందాన్ని, పరాజితులకు దుఃఖాన్ని, అనేకులకు నిర్లిప్తతను, కొందరికి నిరాశను కలిగించి ఉండవచ్చును కానీ, వారూ వీరూ అని లేకుండా ఆశ్చర్యం మాత్రం అందరికీ కలిగింది. పదిహేనేళ్ల కిందట నితీశ్ కుమార్ కు ఇంత కంటె పెద్ద విజయం లభించి ఉండవచ్చును కానీ, ఇప్పటిది ఇరవయ్యేళ్ల పాలన తరువాత లభించిన జనామోదం. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నవారినే తిరిగి వరించిన ఈ వెల్లువ అమితాశ్చర్యకరమైనది. అరుదైనది.
200 సంఖ్యను దాటడం కంటె మించి, ఈ ఎన్నికల ఫలితాల్లో విశేషాలు అనేకం ఉన్నాయి. కాంగ్రెస్ అణగారిపోవడం, ఆర్‌జెడి కూడా దారుణంగా నష్టపోవడం, మునుపటి ఎన్నికల్లో కొత్త గెలుపులతో ఆశ్చర్యపరచిన వామపక్షాల పరిస్థితి మళ్లీ మొదటికి రావడం, ఎంఐఎంకు మంచి పట్టు దొరకడం, ఇట్లా చాలా ఉన్నాయి. అనుమానాస్పదమైన విశేషాలు ఎట్లాగూ ఉంటాయి. జాబితా ఓట్లకు పోలయిన ఓట్లకు పొంతన కుదరని అంకెలుండడం మీద ఎన్నికల సంఘం నుంచి వివరణ రావలసి ఉన్నది. చెరిసమానంగా పోటీచేసిన రెండు పార్టీలలో చెప్పుకోదగ్గ ఏ నాయకుడూ గతి లేని బిజెపికి అధికంగా సీట్లు రావడం, నితీశ్ పార్టీకి తక్కువ రావడం మీద రాజకీయంగా విశ్లేషణలు రావలసి ఉన్నది.
ఈ అనుమానాలన్నీ బిహార్ బయటనే తప్ప, లోపల ఏమీ లేనట్టున్నాయి. ఓట్ చోరీ ప్రచారం కానీ, 65 లక్షల ఓట్ల తొలగింపు కానీ జనం ఖాతరు చేసినట్టు లేరు. రాహుల్‌పాదయాత్ర చేసినచోటల్లా కాంగ్రెస్ ఓడిపోయిందట. అమిత్‌షా తక్షణ ప్రకటన బట్టి చూస్తే, సుశాసన్ తో పోటీలో జంగిల్ రాజ్ ఓడిపోయింది. ఎప్పటి లాలూ రాజ్యం? ఇంకా బిహార్ ఆ జ్ఞాపకం మీదనే పోరాడుతున్నదా? మతతత్వాన్ని ప్రధాన ఎజెండా కావడాన్ని నితీశ్ ఇంతకాలం అనుమతించలేదు నిజమే కానీ, ఈ సారి బిజెపి చొరబాటుదారుల ప్రచారంలో దాగి ఉన్నది అదే కదా? దానికి ప్రభావితులై బిహార్ ఓటర్లు ఎక్కువ చోట్ల బిజెపిని ఎంచుకున్నారా? అసంఖ్యాకులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే బిహార్ లో, ఇతరులెవరో ఆ రాష్ట్రానికి వచ్చి అవకాశాలు కొల్లగొడుతున్నారనే ప్రచారానికి ఆదరణ ఉంటుందా? రెండో దశ పోలింగ్ కు ఒక రోజు ముందు జరిగిన ఢిల్లీ పేలుళ్ల ప్రభావం కూడా బిహార్ ఓటర్ల మీద ఏమీ లేనట్టు ఓట్ల లెక్కలు చెబుతున్నాయి.
“నిజానికి, నితీశ్‌కు, తేజస్వికి మధ్య కూడా అసమానపోటీయే. కానీ, జాతీయ ఎజెండాతో ఎన్నికలను ఎదుర్కొంటే కాంగ్రెస్‌కు, మొత్తంగా ప్రతిపక్షానికి నష్టమే జరుగుతోందని గ్రహించి, రాహుల్, ప్రియాంక చివరివారం ఒకటిరెండు మీటింగులతో సరిపెట్టుకున్నారు. ఇంత చేసినా ఫలితం అనుకూలంగా రాలేదు. స్థానికంగా గట్‌బంధన్ లో జూనియర్ భాగస్వామే అయినా, జాతీయస్థాయిలో దాన్ని రాహుల్ లేదా కాంగ్రెస్ ఓటమిగానే చూస్తున్నారు. జాలిపడుతున్నారు, వెక్కిరిస్తున్నారు, ఇక ఎప్పటికీ కోలుకోలేదని నిర్ధారిస్తున్నారు.”
ఉత్తరప్రదేశ్‌లోనో, మధ్యప్రదేశ్‌లోనో, హర్యానాలోనో జరిగినట్టు మతావేశాల ఎజెండా బిహార్‌లో ప్రధానంగా లేదన్నది ఒక సానుకూల అంశమే. మహిళలకు పదివేల చొప్పున ఖాతాలలో జమచేసి ఓట్లను కొనుగోలు చేశారని చేస్తున్న విమర్శలో కూడా ఓటర్లను ప్రభావితం చేసినది ఆర్థిక లాభం అనే లౌకికఅంశమే కదా?. ఇక కులాల వారీగా సమీకరణలు సాధించడంలో బిజెపి చాణక్యం, నితీశ్ వ్యూహం స్పష్టంగానే మెరుగైన ఫలితాలను ఇచ్చాయి. వ్యవస్థల దుర్వినియోగం, వైఫల్యం, సూక్ష్మస్థాయి నిర్వహణ, ప్రతిపక్ష ఓట్లను చీల్చడం వంటి ఎన్ని కారణాలనైనా బిహార్ ఫలితాలకు ఆపాదించవచ్చును కానీ, అర్ణబ్ గోస్వామి చెప్పినట్టు, ఏకోన్ముఖ హిందూ ఓటింగ్ మాత్రం అందుకు కారణం కాదు. బిహార్ స్థానిక రాజకీయ నైసర్గికత ఇంకా అంతగా మారలేదు.
బిజెపి దీర్ఘకాలిక దృష్టి వేరు, స్వల్పకాలిక ఎత్తుగడలు వేరు. దాని ప్రచారకథనాలు వేరు, ఆచరణ ధోరణులు వేరు. మొత్తం మీద దేశంలో తాను సంకల్పించిన తరహా పరిపాలనా వ్యవస్థలను, సామాజిక, సాంస్కృతిక ఆధిపత్యాన్ని నెలకొల్పడం మీద దృష్టి పెట్టి అది పనిచేస్తున్నది. ఆ పనిచేయడానికి కావలసిన అంగ, అర్థ, మేధా బలాలు ఆ పార్టీకి సమృద్ధిగా ఉన్నాయి. ఏ ప్రాతిపదికలపై తనకు అధికారానికి బలం చేకూరినా, తరువాత దాన్ని తాను ఉద్దేశించిన ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చునన్న స్పృహ ఉన్నది. 2014లో కూడా ఆ పార్టీకి మతప్రాతిపదికపై విజయం లభించలేదు. అప్రదిష్ట పాలైన యుపిఎ ప్రభుత్వం, అవినీతి వ్యతిరేక పోరాటం కలిసి బిజెపి కి సానుకూల వాతావరణం కల్పించాయి. అచ్ఛేదిన్ ఆశతో కదా, ఆ పార్టీకి ఆ నాడు జనం బ్రహ్మరథం పట్టారు!
కేంద్రంలో జెడియు మద్దతు అవసరాల రీత్యా, ప్రజాభిప్రాయం రీత్యా కూడా ఇప్పుడు నితీశ్ ను తప్పించే ప్రయత్నం బిజెపి చేయకపోవచ్చు. నితీశ్ ను కొనసాగించడం అంటే, బిజెపి పరాధీనత పోయి, పరస్పర ఆధారం కావడం నితీశ్ బేరమాడే శక్తి క్షీణించడం. ఆ మేరకు, మెజారిటీ కొరవడిన బిజెపి పరిస్థితి మరింత మెరుగుపడడం. అతని సహజ నిష్క్రమణ దాకా వేచిచూసి, ఆ తరువాత బిజెపి తన విజృంభణ చూడవచ్చు. నితీశ్ ఉన్నంత కాలం బిహార్ ను మరో యుపిగా మార్చడానికి కుదరకపోవచ్చును కానీ, బిజెపి దేశవ్యాప్త ఎజెండాకు బిహార్ గెలుపు ఎంతో శక్తిని అందిస్తుంది. ‘సర్’ ను ఈ ఫలితాల ద్వారా ప్రజలు సమర్థించారని చెప్పి, దేశవ్యాప్తంగా మరింత దూకుడుగా పోవడానికి కేంద్రానికి అవకాశం లభిస్తుంది. ఇప్పటికే తమిళనాడు, బెంగాల్‌లలో ఈ ప్రక్రియ మొదలైంది.
“ఇంకొక ముఖ్యమైన అంశం, తనకంటూ విధానాన్ని నిర్ణయించుకున్న తరువాత, దానికి కట్టుబడి ఉండాలి. ఎదుటివాడు మతతత్వవాది అని తాను మెతక మతవాదిగా మారడం కానీ, అనేక ప్రజా ప్రాధాన్య అంశాల మీద మౌనం వహించడం కానీ, ఒక కచ్చితమైన వ్యక్తిత్వం ఉన్న నాయకుడిగా నిన్ను నిలబెట్టవు. నువ్వొక ప్రత్యామ్నాయానివి అని మొదట నువ్వు నమ్మాలి. నువ్వు అవుతావేమోనని ఎదుటివాడు భయపడి, ఎప్పుడూ నిన్ను న్యూనపరుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీని ముస్లింలీగ్-మావోయిస్టు కాంగ్రెస్ అంటున్నారు. ఎంత మడిగట్టుకున్నా రావలసిన పేరు రానేవచ్చింది! ఏకచ్ఛత్రవ్యవస్థను ఎదుర్కొనడానికి సంకల్పం కావాలి, కొంత సాహసమూ కావాలి, కనీసం జాతీయోద్యమచరిత్ర నుంచైనా ఒక లక్షణాన్ని పుణికిపుచ్చుకోవాలి!”
రాహుల్ గాంధీ తనకు సాధ్యమైన రీతిలో బిహార్ ఎన్నికలను సీరియస్ గానే తీసుకున్నారు. ‘సర్’కు వ్యతిరేకంగా గట్టి వైఖరి తీసుకున్నారు. పాదయాత్ర చేశారు. “నువు ప్రచారంలో ప్రధానంగా కనిపిస్తే, పోటీ నీకూ మోదీకి మధ్య అన్న వాతావరణం ఏర్పడుతుంది, అప్పుడు మనం ఓడిపోతాం, నువ్వు రంగంలోనుంచి తప్పుకుంటే, పోటీ నితీశ్‌కు, తేజస్వికి మధ్య అవుతుంది’’ అని గట్‌బంధన్ మిత్రులు చెప్పగానే, బుద్ధిగా వెనక్కు తగ్గారు. నిజానికి, నితీశ్‌కు, తేజస్వికి మధ్య కూడా అసమానపోటీయే. కానీ, జాతీయ ఎజెండాతో ఎన్నికలను ఎదుర్కొంటే కాంగ్రెస్‌కు, మొత్తంగా ప్రతిపక్షానికి నష్టమే జరుగుతోందని గ్రహించి, రాహుల్, ప్రియాంక చివరివారం ఒకటిరెండు మీటింగులతో సరిపెట్టుకున్నారు. ఇంత చేసినా ఫలితం అనుకూలంగా రాలేదు. స్థానికంగా గట్‌బంధన్ లో జూనియర్ భాగస్వామే అయినా, జాతీయస్థాయిలో దాన్ని రాహుల్ లేదా కాంగ్రెస్ ఓటమిగానే చూస్తున్నారు. జాలిపడుతున్నారు, వెక్కిరిస్తున్నారు, ఇక ఎప్పటికీ కోలుకోలేదని నిర్ధారిస్తున్నారు.
కాంగ్రెస్ కానీ, దాని మిత్రపక్షాలు కానీ మొదటి నుంచి బిజెపి విజయాలను మొదట ఇవిఎంల మాయాజాలానికి, ఇటీవల ఎన్నికల జాబితాల రిగ్గింగ్ కు ఆపాదిస్తున్నాయి. సామాజిక, భావజాల రంగాలలో పైచేయి కావడానికి మతతత్వాన్ని కారణంగా చెబుతున్నాయి. అవి అన్నీ వాస్తవాలే కావచ్చును కానీ, బిహార్ ఎన్నికల ఫలితాలను వాటి ఆధారంతో కొట్టిపారేయలేము. ఓట్ల తొలగింపు సంఖ్యకు మించిన ప్రభావాలను ఫలితాలలో చూడవచ్చు. ఆర్జేడీకి వచ్చిన ఓట్ల శాతమే అన్నిటి కంటె ఎక్కువ కాబట్టి, ఆ అంకెల్లో ప్రతిపక్షాలు కొంత ఊరట పొందవచ్చును కానీ, అంతిమంగా సీట్ల గెలుపే కీలకం. మొత్తం ఓట్ల శాతంతో నిమిత్తం లేకుండా, అధికసీట్లను పొందే సదుపాయం మహాగట్ బంధన్ కు కూడా ఉన్నది, అందుకు తగ్గ ఎన్నికల నిర్వహణ ఉంటే! అట్లాగే, బిహార్ ఎన్నికల ప్రచారంలో మతతత్వ అంశ ఈ సారి కూడా కనీసంగానే ఉన్నదని గమనించవచ్చు. మరి ఫలితాలను ప్రభావితం చేసినవి ఏ అంశాలు? గెలిచిన కూటమి, మెరుగుగా, సృజనాత్మకంగా, వాస్తవిక అంచనాలతో పనిచేసిందని, ఓడిపోయిన కూటమిలో అవి లోపించాయని ఎందుకు గ్రహించడంలేదు? హంగులో, అధికారంలో ఉన్న అంతరాలు కొంత పనిచేస్తాయి నిజమే కానీ, ప్రతిపక్షానికి ఉండే ఆకర్షణ ఎందుకు పనిచేయలేదు? క్షేత్రస్థాయి స్థితిగతుల మీద అవగాహన ఎందుకు లోపిస్తున్నది?
అమెరికా ఎన్నికలతో మన ఎన్నికలను ఏ రకంగానూ పోల్చకూడదు నిజమే కానీ, మమ్దానీ ఎంతటి ప్రతికూల పరిస్థితుల మధ్య పనిచేశారు? అగ్రరాజ్య అధినేతే తన సర్వశక్తియుక్తులూ మోహరించినా, బాహాటంగా హెచ్చరికలు పంపినా జనం ఎందుకు ఖాతరు చేయలేదు? తనను అనుమానించేవారి నుంచి కూడా ఆయన ఓట్లను ఎట్లా రాబట్టారు? బహుశా, ఒక పోరాటకారుడి మనస్తత్వం ఇటువంటి సందర్భాలలో కీలకంగా పనిచేస్తుంది. అట్టడుగుస్థాయి నుంచి బలాన్ని కూడగట్టుకోవడం, ఓపికగా అందరితో సంభాషించడం, భరోసా కల్పించడం, అనుమానాలు నివృత్తి చేయడం, పౌరసంఘాల స్వచ్ఛంద ప్రతినిధులను కలుపుకోవడం- ఇవన్నీ చేస్తున్నప్పుడు మమ్దానీకి తన సొంతపార్టీ నుంచి కూడా సమర్థన లేదు. మమ్దానీ అభ్యర్థిత్వం ఒక స్థానిక సంస్థ ఎన్నికకే కావచ్చును కానీ, అది జనంలో పనిచేయడానికి సంబంధించిన ఒక నమూనా కూడా. ఆ సూక్ష్మస్థాయి ప్రజాసంబంధాలతో పాటు, లక్ష్యం గురించిన పట్టుదల, నిబద్ధత ఎంతో ముఖ్యపాత్ర వహిస్తాయి. న్యూయార్క్ ఎన్నిక నుంచి రాహుల్‌గాంధీ నేర్చుకోవలసింది చాలా ఉంది. ఇన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల తరువాత కూడా అతను ఇంకా పార్ట్ టైమ్ రాజకీయనాయకుడిగానే ఉన్నాడు.
ఇంకొక ముఖ్యమైన అంశం, తనకంటూ విధానాన్ని నిర్ణయించుకున్న తరువాత, దానికి కట్టుబడి ఉండాలి. ఎదుటివాడు మతతత్వవాది అని తాను మెతక మతవాదిగా మారడం కానీ, అనేక ప్రజా ప్రాధాన్య అంశాల మీద మౌనం వహించడం కానీ, ఒక కచ్చితమైన వ్యక్తిత్వం ఉన్న నాయకుడిగా నిన్ను నిలబెట్టవు. నువ్వొక ప్రత్యామ్నాయానివి అని మొదట నువ్వు నమ్మాలి. నువ్వు అవుతావేమోనని ఎదుటివాడు భయపడి, ఎప్పుడూ నిన్ను న్యూనపరుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీని ముస్లింలీగ్-మావోయిస్టు కాంగ్రెస్ అంటున్నారు. ఎంత మడిగట్టుకున్నా రావలసిన పేరు రానేవచ్చింది! ఏకచ్ఛత్రవ్యవస్థను ఎదుర్కొనడానికి సంకల్పం కావాలి, కొంత సాహసమూ కావాలి, కనీసం జాతీయోద్యమచరిత్ర నుంచైనా ఒక లక్షణాన్ని పుణికిపుచ్చుకోవాలి!
సర్వంసహాధికారాల నేపథ్యంలో యథేచ్ఛావిహారం అధికారపార్టీలకు ఉండవచ్చు నిజమే కానీ, ఓటమికి కారణాన్ని కేవలం వాటిలో మాత్రమే వెదికితే, ఎప్పటికీ పరిస్థితి మారదు. ప్రజల నాడి తమకు అందకుండా పోతోందేమో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవడం పరాజిత పార్టీలకు అవసరం.





