– పట్నంలో పతంగులు ఎగురవేస్తూ సందడి
– చైనా మాంజా వద్దంటూ సూచన
– యువత ఆటల్లో రాణించాలి
– రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలి
– మాజీ మంత్రి ఆకాంక్ష
సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 16: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సిద్దిపేట పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన సంబురాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. స్థానికులు, యువత, పిల్లలతో కలిసి పతంగులు ఎగురవేసి సందడి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతులు పండించిన ధాన్యం ఇంటికి చేరే శుభ సందర్భమే సంక్రాంతి అని అన్నారు. సాగులో సాయపడిన ఆవులు, ఎడ్లను లక్ష్మీదేవితో సమానంగా పూజించే గొప్ప సంప్రదాయం మనదన్నారు. మన పండుగల వెనుక సంప్రదాయంతోపాటు సైన్స్ కూడా ఉందని చెప్పారు. సంక్రాంతి శీతాకాలంలో రావడం వల్ల ఎండలో పతంగులు ఎగురవేయడం ద్వారా శరీరానికి విటమిన్-డి లభిస్తుందని, ఇది ఎముకలను బలంగా ఉంచి రోగనిరోధక శక్తిని పెంచుతుందని వివరించారు. పతంగులు ఎగురవేసే సమయంలో చేతులు, భుజాలు, వీపు కండరాలు కదిలి మంచి వ్యాయామంలా పనిచేస్తాయని తెలిపారు. అయితే పతంగులు ఎగురవేస్తూ ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు బాధాకరమన్నారు.
చైనా మాంజాపై స్పందిస్తూ ‘ఇది చైనా మాంజా కాదు.. కిల్లర్ మాంజా.. నిషేధితమైనా అక్రమంగా అమ్ముతున్నారు.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు’ అని అన్నారు. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో వలస కూలీ అవిదేశ్ మృతి, ఉప్పల్‌లో ఏఎస్సై నాగరాజుకు గాయాలు, హైదరాబాద్‌లో పలువురు గాయపడిన ఘటనలను గుర్తు చేశారు. పక్షులు, జంతువులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చైనా మాంజా రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎక్కడైనా విక్రయాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సిద్దిపేట 34వ వార్డులో యువతతో కలిసి హరీష్ రావు పతంగులు ఎగురవేశారు. యువత కేరింతల మధ్య సంబురాల్లో పాల్గొన్నారు. చిన్నకోడూరు మండలం గంగాపూర్ లో నిర్వహించిన సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. కొంతసేపు యువతతో కలిసి క్రికెట్ ఆడారు. పెద్దకోడూరులో క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతలకు బహుమతులు అందజేశారు. సిద్దిపేటను క్రీడల హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. పతంగులు ఆకాశంలో ఎత్తుకు ఎగిరినట్లే యువత జీవితాల్లోనూ ఎత్తుకు ఎదగాలని హరీష్ రావు ఆకాంక్షించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా గాలిపటానికి దారం ఆధారం అన్నట్టే మన కుటుంబం, సమాజం మనకు ఆధారమని గుర్తుంచుకోవాలని ఉద్బోధించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




