– ఫీజు చెల్లించలేక సీటు కోల్పోయే పరిస్థితి
– రుణం కోసం యత్నిస్తే ఆస్తి చూపాలన్న బ్యాంకర్లు
– దీనావస్థను ఎమ్మెల్యే హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థిని తండ్రి
– తన ఇంటిని తాకట్టుపెట్టి డబ్బులు సమకూర్చిన ఆపద్బాంధవుడు
సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: ఆమె పేరు మమత.. వారిది పేద కుటుంబం.. అయితేనేం చదువులో బాగా రాణిస్తోంది.. వైద్య విద్య ఎంబీబీఎస్ వరకు ఎలాగో చదువుకోగలిగింది. పీజీ చేయాలనే కోరికతో ఎంట్రెన్స్ రాసింది. సీటు వచ్చింది.. కానీ ట్యూషన్ ఫీజుగా ఏటా రూ.7.50 లక్షలు చెల్లించాల్సి ఉండడంతో అంత చెల్లించే స్తోమత వారికి లేదు. ఈ పరిస్థితిలో ఏమి చేయాలో తోచక ఆ సర్వస్వతీ పుత్రిక తల్లడిల్లుతోంది. బ్యాంకుల్లో విద్యా రుణం కోసం ప్రయత్నిస్తే ఆస్తి తాకట్టు పెట్టాలన్నారు. ఆస్తిపాస్తులు లేని ఆమె తండ్రి కొంక రామచందర్ర నిస్సహాయంగా ఉండిపోయాడు. ఈనెల 18వ తేదీన ఫీజు చెల్లించి కళాశాలలో చేరకుంటే సీటు కోల్పోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో తన కుమార్తెను తీసుకుని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు వద్దకు వెళ్లి తమ దీనావస్థను వివరించారు. ఆయన క్షణం ఆలస్యం చేయకుండా సిద్దిపేటలోని తన స్వగృహన్ని బ్యాంకులో తనఖా పెట్టి రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. హాస్టల్ ఫీజు రూ.లక్ష కూడా హరీష్ రావు సర్దారు. నాడు ఆటో కార్మికుల కోసం.. నేడు నిరుపేద విద్యార్థిని చదువు కోసం హరీష్ రావు ఆపన్నహస్తం అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నారంటే ఆగమేఘాల మీద స్పందించే హరీశ్ రావు తాజాగా ఓ నిరుపేద వైద్యవిద్యార్థిని భవిష్యత్తుకు చేయూతనందించారు.
మమత కుటుంబ నేపథ్యం
సిద్దిపేటకు చెందిన రామచంద్రం టైలరింగ్ వృత్తి చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయన పెద్ద కుమార్తె మమత విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఉచితంగా ఎంబీబీఎస్ సీటు సాధిచంది. తర్వాత పీజీ చదివేందుకు ఎంట్రన్స్ రాయగా మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఆఫ్తమాలజీ విభాగంలో పీజీ సీటు వచ్చింది. ప్రభుత్వ కన్వీనర్ కోటాలోనే సీటు వచ్చినప్పటికీ మూడేళ్లపాటు ఏటా రూ.7.50 లక్షల చొప్పున ట్యూషన్ ఫీజు చెల్లించాలి. ఈనెల 18వ తేదీ గడువు. అంత డబ్బు చెల్లించలేక రామచంద్రం మనోవేదనకు గురయ్యాడు. బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ కోసం ప్రయత్నించగా ఏవైనా ఆస్తులు తాకట్టు పెడితేనే రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు సమాధానం ఇచ్చారు. తనకు ఎలాంటి స్థిరాస్తులు లేకపోవడంతో ఆ మార్గం మూసుకుపోయింది. దీంతో గతంలో తన కూతుళ్లకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చినప్పుడు ఎమ్మెల్యే హరీష్ రావు ఆర్థిక సహాయం చేసిన విషయం గుర్తుకొచ్చింది. ఇప్పుడూ ఆయనే ఆదుకుంటారని భావించి ఈ విషయాన్ని ఆయనకు చేరవేశారు. విషయం తెలిసిన వెంటనే హరీష్‌రావు స్పందించి సిద్దిపేటలోని తన ఇంటిని తాకట్టు పెట్టి మూడేళ్లకు సరిపడా దాదాపు రూ.20 లక్షల విద్యా రుణం మంజూరు చేయించారు. దీంతో ఆ డబ్బులను కళాశాలలో చెల్లించి సీటు దక్కించుకున్నారు.
అప్పు చేయొద్దంటూ హాస్టల్ ఫీజు కూడా ఇచ్చారు. మొదటి సంవత్సరం హాస్టల్‌కు రూ.లక్ష అవుతుందని హరీష్ రావు దృష్టికి రాగా అందుకు ఎలాంటి అప్పు చేయొద్దంటూ అ సొమ్ము కూడా తాేనే చెల్లెస్తా అని హరీష్ రావు ఇచ్చారు.
గతంలో ఆటోవాలాలను ఆదుకున్న ఎమ్మెల్యే
నియోజకవర్గంలోని ఆటో కార్మికుల సంక్షేమం కోసం మూడేళ్ల క్రితం తన ఇంటిని తాకట్టు పెట్టి రుణం ఇప్పించారు. ఫలితంగా సిద్దిపేట ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు కావడమేగాక వందలాదిమంది ఆటో కార్మికులకు కొండంత భరోసాగా నిలిచింది. రుణం పొందిన ఆటో కార్మికులు ప్రతీ నెలా పొదుపు చేసిన సొమ్మును వాయిదాల రూపంలో రుణం చెల్లిస్తున్నారు. ఆపత్కాలంలో తమకు సొసైటీ ఉందనే ధీమాను హరీష్ వారికి కల్పించారు. నేడు నిరుపేద విద్యార్థిని మమత వైద్య విద్యకు సహాయం చేయడానికి తన స్వగృహాన్ని మరోసారి తనఖా పెట్టడానికీ వెనుకాడలేదు
– హరీషన్న రుణం తీర్చుకోలేనిది : రామచంద్రం 
నా బిడ్డ కష్టపడి చదివి ప్రభుత్వ కన్వీనర్ కోటాలో సీటు సంపాదించినప్పటికీ ఆర్థిక స్తోమత లేక ట్యూషన్ ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదు. మాకు అన్ని దారులు మూసుకుపోయాయి. కానీ ఆపద వచ్చినవారి కోసం నిరంతరం తన ఇంటి తలుపులు తెరిచి ఉంచే హరీష్ అన్న ఏకంగా తన ఇంటిని మా కోసం తాకట్టు పెడతాడని కలలో కూడా ఊహించలేదు. నా నలుగురు బిడ్డలు హరీష్ అన్న స్ఫూర్తితోనే, ఆయన చేసిన సహాయంతోనే ఎంబీబీఎస్ చదువుతున్నారు. పెద్ద బిడ్డ ప్రస్తుతం పీజీ సీటు దక్కించుకోగా రెండో అమ్మాయి ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ చేస్తున్నది. మరో ఇద్దరు అమ్మాయిలు జగిత్యాలలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. నియోజకవర్గంలోని మూడు లక్షల జనాభాలో మేము ఒకరం. అంతేతప్ప మరెలాంటి సంబంధం లేదు. అయినా మా పాప భవిష్యత్తు కోసం ఒక్క క్షణం ఆలోచించకుండా తన ఇంటిని తాకట్టు పెట్టిన హరీష్ అన్న రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము.





