– అన్ని జెడ్పీలలో మనం గెలవబోతున్నాం
– మాజీ ఎమ్మెల్యే క్రాంతి ఆధ్వర్యంలో అలయ్ బలయ్
అందోల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: దసరా అంటే చెడుపై మంచి విజయం.. ఈరోజు అందరూ కాంగ్రెస్ పోవాలె.. కేసీఆర్ రావాలె అంటున్నరు.. ఆరు గ్యారెంటీలు అని మోసం చేశారు.. నమ్మించి మోసం చేసి ప్రజల గుండెల మీద తన్నిండు రేవంత్ అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. దసరాను పురస్కరించుకుని అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి ఆధ్వర్యంలో సోమవారం అలయ్ బలయ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్‌రావు అలయ్ బలయ్ జరుపుతున్న క్రాంతికి అభినందనలు తెలిపారు. అందర్నీ ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం సంతోషమని అన్నారు. కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడుతూ బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లు ఇచ్చి మాట తప్పారు.. కాంగ్రెస్ మోసాలను బట్టబయలు చేసేందుకు బీఆర్‌ఎస్ ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డులు పంచుతున్నది అని తెలిపారు. వట్‌పల్లి రోడ్ల డాంబర్ పోసేందుకు పైసలు లేవు గానీ అది చేస్తా ఇది చేస్తా అంటడు.. కమీషన్లు వచ్చే పనులు మాత్రమే మొదలు పెడుతడు.. కేసీఆర్ కట్టిన వాటికి రిబ్బన్లు కట్ చేయడం తప్ప కొత్తగా చేసిందేం లేదు అని విమర్శించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అని రేవంత్ మోసం చేసిండు అని చెప్పారు. కేసీఆర్ వచ్చాకే మార్కెట్ యార్డుల్లో రిజర్వేషన్ కల్పించామని, హాస్పిటల్ కాంట్రాక్టుల్లో, ఇరిగేషన్‌లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ తెచ్చాం గీత కార్మికులకు వైన్ షాపుల్లో రిజర్వేషన్ తెచ్చామని వివరించారు. గౌడన్నలకు 25శాతం రిజర్వేషన్ అని మోసం చేసినందుకు కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు. ఆందోల్ నియోజకవర్గానికి లక్షా 20వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి సంగమేశ్వర బసవేశ్వర పెట్టినం. ఎందుకు బంద్ పెట్టారు అని హరీష్ ప్రశ్నించారు. త్వరలో సంగమేశ్వర బసవేశ్వర మీద పాద యాత్రకు శ్రీకారం చుట్టి కాంగ్రెస్ మెడలు వంచుతామన్నారు. ఇక కేంద్రం ఇచ్చే మద్దతు ధర గోధుమల కంటే వడ్లకు రూ.216 తక్కువ ఉన్నది.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆ పార్టీ ఎంపీలు ఇదేం నీతి అని అడుగుతరా అని నిలదీశారు. 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్కటీ ఇవ్వరు.. నవోదయలు ఇవ్వరు.. రీజినల్ రింగు రోడ్డును పండబెట్టారు.. బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష అని హరీష్‌రావు స్పష్టం చేశారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జిల్లా పరిషత్‌లలో మనం గెలువబోతున్నామంటూ ఐక్యతతో పని చేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





