– సిగాచి బాధితుల గోడు పట్టించుకోరెందుకు?
– కంపెనీ యాజమాన్యంపై చర్యలేవి??
– కంపెనీతో రేవంత్‌కు లాలూచీ ఏంటని ప్రశ్న
– మాజీ మంత్రి హరీష్‌రావు
పటాన్‌చెరు, ప్రజాతంత్ర, జులై 28: పటాన్‌చెరులోని సిగాచి కంపెనీ ప్రమాద బాధితులు ఎంతమందికి పరిహారం అందించారో వెల్లడిరచాలని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఈమేరకు సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్‌ను కలిసి మృతదేహాలు అప్పగించడంలో, పరిహారం అందించడంలో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతకుముందు బాధిత కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో హరీష్‌రావు మాట్లాడుతూ సిగాచి ఘటన జరిగి నెల రోజులు కావొస్తున్నది. బాధిత కుటుంబాలు కన్నీళ్ల మధ్య నెల మాసికం చేసుకుంటున్నాయి.. సీఎం వచ్చి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించి నెల రోజులయింది. ఇంతరవకు ఒక్కరికి కూడా అందలేదని విమర్శించారు. అంతిమ కార్యక్రమాలు జరిపేందుకు కొందరికి శవాలు కూడా ఇవ్వని దుస్థితి ఉందని, 54మంది చనిపోతే ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయంగా, బాధ్యతారాహిత్యంగా ఉందని హరీష్‌రావు ఆరోపించారు. ఎక్స్‌గ్రేషియా, డెత్ సర్టిఫికెట్ ఎప్పుడు ఇస్తారని బాధితులు అడిగితే ఎస్‌ఎల్‌బీసీ ఘటనలో శవాలు కూడా రాలేదు.. మీకు బూడిదైనా దొరికింది అని అత్యంత అమానవీయంగా మాట్లాడుతున్నారన్నారు. సీఎం కోటి ఇస్తామన్నరు.. ఎప్పుడు ఇస్తారు.. ఎవరు ఇస్తారు అని అడిగితే ఎవరూ చెప్పడం లేదని అంటున్నారు. తీవ్రంగా గాయపడ్డవారికి సీఎం రూ.10 లక్షలు ఇస్తామని చెబితే రూ.50వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని బాధిత కుటుంబాలు చెబుతున్నాయన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50లక్షలు ఇచ్చి నెల నెలా వేతనం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. చివరకు హైకోర్టులో సైంటిస్ట్ ఫర్ పీపుల్ స్వచ్చంద సంస్థ బాధితులకు పరిహారం ఇవ్వాలని రిట్ పిటిషన్ వేసింది. నెల గడిచినా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్షతగాత్రులు, చనిపోయిన వారి పేర్లు, ఎవరెవరికి ఎంత ఇచ్చారు, క్షతగాత్రులకు ఎంత ఇచ్చారు అనేది ఈ ప్రభుత్వం ఎందుకు దాచి పెడుతున్నదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటివరకు పరిహారం వివరాలు వెల్లడిరచకుండా ఎందుకు గోప్యంగా ఉంచారో సమాధానం చెప్పాలని నిలదీశారు. కంపెనీలో పాత మిషన్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని అనేకసార్లు కార్మికులు చెప్పినా కంపెనీ పట్టించుకోలేదని చనిపోయిన జగన్మోహన్ కొడుకు యశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. ఎందుకు యాజమాన్యాన్ని కాపాడుతున్నవు రేవంత్ రెడ్డీ.. ఎందుకు యాజమాన్యంతో కుమ్మక్కయ్యావు.. కంపెనీతో ఉన్న లాలూచీ ఏమిటో బయటపెట్టాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తున్నదని హరీష్‌రావు చెప్పారు. వెంటనే డెత్ సర్టిఫికేట్ ఇచ్చి ఆ కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రూ.కోటి ఇచ్చేది ప్రభుత్వమా, కంపెనీనా అని మీడియా అడిగితే ఎవరు ఇస్తే ఏందని ఆరోజు సీఎం దబాయించిండు.. కంపెనీ కూడా 15 రోజుల్లో పరిహారం ఇస్తామని పత్రికా ప్రకటన ఇచ్చింది.. అయినా ఇప్పటికీ దిక్కులేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే బీఆర్‌ఎస్ తరపున పోరాటం తీవ్రతరం చేస్తామని హరీష్‌రావు హెచ్చరించారు.





