- ఆ మండలాలను అప్పగించిన పాపం బీజేపీదే
- కాళేశ్వరంపై రేవంత్ దుష్ప్రచారాన్నే వల్లెవేశారు
- నాడు ప్రశంసలు.. నేడు రాజకీయ లబ్ది కోసం అబద్ధాలు
- ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూనే గొంతు కోస్తారా
- రాజ్యసభలో కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: రాజ్యసభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలతో, చరిత్ర వక్రీకరణలతో తనలోని వికృతత్వాన్ని బయట పెట్టుకున్నారని, తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయక వెన్నుచూపి పారిపోయిన కిషన్‌రెడ్డి (MP Kishan Reddy) నేడు పార్లమెంట్ సాక్షిగా మరోసారి ద్రోహానికి పాల్పడ్డాడని బీఆరఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు (MLA Harish Rao ) ధ్వజమెత్తారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ భద్రాచలం ప్రాంతంలోని ఏడు మండలాలను ఏపీకి అప్పగించాలనేది విభజన చట్టంలో ఉందని కిషన్ రెడ్డి పేర్కొనడం చారిత్రక అవాస్తవమే కాదు.. తెలంగాణకు చేస్తున్న తీరని ద్రోహం అని అన్నారు. విభజన చట్టానికి సవరణ తెచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను ఏపీకి కట్టబెట్టింది ముమ్మాటికీì బీజేపీ ప్రభుత్వమేనని, ఈ పాపంలో కిషన్ రెడ్డికి కూడా పాత్ర ఉందని అన్నారు.
ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చి మీరు చేసిన ద్రోహాన్ని ఎండగట్టిన విషయాన్ని మర్చిపోయి నేడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంట అన్నట్లు పార్లమెంటు సాక్షిగా చరిత్ర వక్రీకరణకు పాల్పడి ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించారు.. ఇది మీ కుట్రకు నిదర్శనం.. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్నే కిషన్ రెడ్డి పార్లమెంట్‌లో చేయడం కాంగ్రెస్, బీజేపీ చీకటి పొత్తుకు సాక్ష్యం అని ఆయన విమర్శించారు. ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల ప్రాజెక్టుగా కాళేశ్వరం నిర్మించడం అబద్దమా.. 148 మీటర్ల దిగువ ప్రాంతం నుంచి 618 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడం అబద్దమా.. ఈరోజు, ఈ నిమిషానికి మండుటెండల్లో సైతం కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల ద్వారా జలాలు రైతుల పొలాలకు చేరుతుండటం అబద్దమా.. ఏది అబద్దం కిషన్ రెడ్డీ అని ప్రశ్నించారు.
కాళేశ్వరం జలాలను చూపించేందుకు సిద్ధం
పొలాల్లో పారుతున్న కాలేశ్వరం జలాలను చూపించేందుకు తాను సిద్ధం.. వచ్చేందుకు మీకు దమ్ముందా అని హరీష్‌రావు సవాల్ విసిరారు. మీరు కేబినెట్ మంత్రిగా ఉండి ఏ ప్రభుత్వం అయినా ప్రజా ధనంతోనే నిర్మాణాలు చేస్తుందన్న ఇంగితం మరిచి కేసీఆర్ జేబులోంచి డబ్బు ఖర్చు పెట్టారా అని అడగడం మీ అవివేకానికి, అతి తెలివికి నిదర్శనమని మండిపడ్డారు. మీ ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ రహదారులు, ప్రాజెక్టులకు మీ సొంత పైసలు ఖర్చు పెడుతున్నారా.. ఆ పైసలు దుబాయ్‌లో ముద్రిస్తున్నారా లేక మీ జేబుల్లో నుండి ఖర్చు చేస్తున్నారా అని నిలదీశారు. కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదని గొంతు చించుకున్న కిషన్ రెడ్డి గారూ.. గతంలో మీ ప్రభుత్వ పెద్దలే నితిన్ గడ్కరీ నుంచి సీడబ్యుసీ చైర్మన్ మసూద్ వరకు కాళేశ్వరంపై కురిపించిన ప్రశంసలు అబద్దం అంటారా.. అవివేకం అంటారా.. నిన్నగాక మొన్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా(చాప్టర్ 8) రిపోర్టు ప్రకారం ‘2014లో తెలంగాణలో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం 2023 నాటికి ఏకంగా 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకాలే అని కుండబద్దలు కొట్టింది. ఇది మీ కళ్లకు కనిపించడం లేదా అని అడిగారు. పూటకో తీరు మాట్లాడటం రాజనీతి అనిపించుకోదన్నారు.
కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని, తెలంగాణకు నిధులు కేటాయించాలని తమ ఎంపీ సురేశ్ రెడ్డి మాట్లాడితే మీరు దాన్ని సమర్థించకపోగా ఉల్టా వ్యర్థ రాజకీయ ప్రేలాపనలకు పాల్పడ్డారన్నారు. ఎనిమిది మంది మీ ఎంపీలు, ఎనిమిదిమంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి తెలంగాణవాదాన్ని తొక్కిపెట్టడం సిగ్గుచేటు అని హరీష్‌రావు అన్నారు.





