- ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చేలా వ్యాఖ్యలు
- రేవంత్ పై కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు చర్యలు తీసుకోవం లేదు..
- మల్లిఖార్జున ఖర్గేకు, రాహుల్ గాంధీకి హరీష్ రావు బహిరంగ లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి దూషణలు, కించపరచే వ్యాఖ్యలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై బిజెపి తీవ్రవాది అని వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిందని, రాజ్యాంగ విలువలను దిగజారుస్తున్నారని మొసలి కన్నీరు కార్చిందని, అలాంటి దూషణలే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే పార్టీ హై కమాండ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శమని మండిపడ్డారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న అసభ్యకరమైన భాషను ఖండిస్తూ రేవంత్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి హరీష్ రావు గురువారం బహిరంగ లేఖ రాశారు.
దిల్లీలో ఒక రూల్ గల్లీలో ఒక రూల్ పాటించడం కాంగ్రెస్ కే చెల్లుతుందని, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధమని, కాంగ్రెస్ హై కామెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రవర్తన మహాభారతంలో దుర్యోధనుడి క్రూరత్వంలా ఉందని, కాంగ్రెస్ తన నైతిక ప్రమాణాలను పాటించకుండా ఇతరులకు నీతులు చెప్పడం శోచనీయమని అన్నారు. కేసిఆర్ పై, ఆయన కుటుంబంపై రేవంత్ రెడ్డి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చడమేని పేర్కొన్నారు. కేసిఆర్ ను రాళ్లతో కొట్టి చంపాలి అన్న అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ హై కమాండ్ సమర్ధిస్తుందా? అని నిలదీశారు.
హింసాత్మక వ్యాఖ్యలు చేయడం, జర్నలిస్టులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రకటించిన రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని బీఆర్‌ఎస్ నాయకులపై నిరాధార కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడడం దుర్మార్గమని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని చెప్పేందుకు ఇది నిదర్శనం.
కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరి మహాభారతంలో ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడి దుర్మార్గాలను ఉపేక్షించడం లాంటిదే. రేవంత్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.





