ప్రొఫెస‌ర్‌ సాయిబాబా మృతి బాధాకరం.. : మాజీ మంత్రి హ‌రీష్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : మాన‌వ హ‌క్కుల నేత, విద్యావేత్త ప్రొఫెస‌ర్‌ సాయిబాబా మృతి బాధాకరమ‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సోమ‌వారం హైద‌రాబాద్ మౌలాలిలోని సాయిబాబా నివాసానికి వెళ్లి ఆయ‌న పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళుల‌ర్పించారు. సుదీర్ఘ కాలం జైలు జీవితం గడిపి, నిర్దోషిగా బయటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలా మృతిచెంద‌డం బాధాక‌ర‌మ‌ని అన్నారు. సుప్రీం కోర్టు నిర్దోషి అని తీర్పు ఇచ్చింది. కానీ దశాబ్ద కాలం పాటు ఆయనతో పాటు, ఆయన కుటుంబ సభ్యులు పడిన వేదన వర్ణనాతీతమ‌ని అన్నారు. ప్రొఫెసర్ గా పని చేస్తూ, ఆ హొదాలోనే ప్రాణాలు వదలాలని అనుకున్నారు. కానీ దురృష్టవశాత్తూ ఉద్యోగం కూడా కోల్పోయారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

వంద మందికి శిక్ష పడినా ఒక నిర్దోషికి శిక్ష పడొద్ద‌నేది న్యాయ సూత్రం. ఇది సాయిబాబా విషయంలోనూ వర్తిస్తుంద‌ని అన్నారు. సాయిబాబా పడిన వేదనకు ఎవరు సమాధానం చెబుతారని ప్ర‌శ్నించారు. 90 శాతం అంగవైకల్యం ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు. అలాంటి వ్యక్తి పట్ల అక్రమ కేసులు పెట్టి నిర్బంధిచడం బాధాకరమ‌ని అన్నారు. నిర్దోషిగా బయటికి వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చే సమయంలో ఇలా చ‌నిపోవ‌డం విచార‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. ఆయ‌న నేత్రాలు, శరీరాన్ని కూడా గాంధీ ద‌వాఖానాకు దానం చేసి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *