– పదిలో మంచి మార్కులు సాధించాలన్నదే నా తపన
– పది ఫలితాల్లో కూడా సిద్దిపేట ఆదర్శంగా నిలవాలి
– మూడు నెలలు టివిలు, ఫోన్ లను బంద్ చేపించండి
– విద్యార్థుల తల్లిదండ్రులతో హరీష్ రావు టెలికాన్ఫరెన్స్
సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 8: నేను మీకు ఉత్తరం పంపిన.. వచ్చిందా.. మార్చి నెలలో ప్రారంభం అయ్యే 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో మీ పిల్లలను చదివించేందుకు మీకు కొన్ని సూచనలు చేయదలచుకున్న అంటూ సిద్దిపేట నియోజకవర్గంలోని టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రులతో ఎమ్మెల్యే హరీష్ రావు గురువారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొద్ది రోజుల్లోనే మీ పిల్లలు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు.. వారి చదువులో ఇది అత్యంత కీలకమైన ఘట్టం. మంచి మార్కులతో గట్టెక్కితేనే ఉన్నత చదువుల దిశగా ముందడుగు వేసే అవకాశం ఉంటుందని, లేదంటే మీరు ఇన్నాళ్లు పడిన కష్టానికి, మీ పిల్లల చదువుకు ఎలాంటి అర్థం ఉండదని చెప్పారు. మీ పిల్లలు విజయం సాదించాక మీరు ఇచ్చే అభినందన కన్నా పరీక్షలు రాసే ముందు మీరు తీసుకొనే ప్రత్యేక శ్రద్ద ముఖ్యమని చెప్పారు. ముఖ్యంగా పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచండి.. విందులు, వినోదాలు, ఫంక్షన్లు, సినిమాలు, టీవీల జోలికి వెళ్లకుండా చూడండి.. వ్యవసాయ పనులకు, మీ ఇంటి పనులను కూడా చెప్పవద్దని కోరుతున్నాననన్నారు. కొన్నేళ్లుగా సిద్దిపేట నియోజకవర్గంలో చదివిన పదో తరగతి విద్యార్థులంతా నూటికి నూరు శాతం పాసవుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థలోనూ 169 మంది సిద్దిపేట నియోజకవర్గ విద్యార్థులు సీట్లు సాధించడం గర్వకారణం. అదేవిదంగా ఎంతోమంది మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు సాదించారు.. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఎదిగారు. మీ పిల్లలు మంచి మార్కులతో పాస్ కావలనేదే నా ఆకాంక్ష . నా వంతుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులతో పాటు, అల్పాహారం ఏర్పాటు చేస్తున్నాను. జిల్లా విద్యాధికారి నుంచి మీ పిల్లలకు చదువు చెప్పే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కూడా సమీక్షలు నిర్వహిస్తున్నాను. స్కూళ్లలో డిజిటల్ స్టడీ, మోడల్ టాయిలెట్స్ వంటి మంచి సౌకర్యాలు కల్పించాను. మీ బిడ్డకు మార్కులు పెరగడం కోసం నేను మీ పిల్లలకు డిజిటల్ కంటెంట్ పుస్తకాలు అందిస్తున్నాను. దీంతో ప్రతీ సబ్జెక్టుపై అవగాహన కల్పిస్తున్నాం.. అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిన మన సిద్దిపేట నియోజకవర్గ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో కూడా ఆదర్శంగా నిలవాలనేదే నా తాపత్రయం. అందుకే ప్రజాప్రతినిధిగా, మీ కుటుంబంలో ఒకడిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. మీరు కూడా మీ పిల్లలను బాగా చదివించండి అని హరీష్‌రావు కోరారు.
————————————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




