Har Ghar Tiranga :14న హర్‌ ఘర్‌ తిరంగా, 15న తిరంగా యాత్ర

– స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా బీజేపీ దేశభక్తి కార్యక్రమాలు
– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా హర్‌ ఘర్‌ తిరంగా, తిరంగా యాత్ర వంటి దేశభక్తి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత అయిదేళ్లుగా యావత్‌ భారతదేశంలో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం నిర్వహించాలని భారత ప్రభుత్వం పిలుపునిచ్చిందని, అందుకనుగుణంగా అన్ని రాష్ట్రాల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఆరో సంవత్సరం హైదరాబాద్‌, తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహణకు ఒక కమిటీని నియమించామన్నారు. ఈ కమిటీ చైర్మన్‌గా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మనోహర్‌ రెడ్డి, సభ్యులుగా శాసనసభ్యుడు పాల్వాయి హరీష్‌బాబు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్‌, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ఉన్నట్లు రామచందర్‌రావు తెలిపారు. వీరి నేతృత్వంలో 14వ తేదీ వరకు తిరంగా ర్యాలీ, 14 లక్షల ఇండ్లపై త్రివర్ణ పతాకం ఎగురవేయడం, 15న సాయంత్రం గౌరవప్రదంగా జెండాను అవనతం చేయనున్నట్లు వివరించారు. అన్ని మండలాల్లో తిరంగా ర్యాలీ నిర్వహణ చేయాలని నిర్ణయించామన్నారు. 14వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్‌ మీద దాదాపు 15 వేల మంది కాలేజీ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు, అదేరోజు విభజన గాయాల స్మృతి దినం సందర్భంగా అన్ని జిల్లాల్లో, మండలాల్లో ప్రదర్శనలు, హాల్‌ మీటింగ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. హర్‌ ఘర్‌ తిరంగా, తిరంగా యాత్రలో పార్టీలు, కులాలు, రాజకీయాలు, ప్రాంతాలకతీతంగా దేశభక్తి భావనతో పాల్గొనాలని రామచందర్‌రావు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *