– మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని సమస్త మహిళలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. మహిళల పోరాటం, పట్టుదల, ప్రతిభను గుర్తించి గౌరవించే రోజు మహిళా దినోత్సవమని పేర్కొన్నారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ‘గివ్ టు గెయిన’ అని, అంటే ఇస్తేనే సాధిస్తాం, పంచుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అనే సందేశం అందులో నిక్షిప్తమై ఉందని తెలిపారు. మహిళలకు అవకాశాలు ఇస్తే కుటుంబం ఎదుగుతుందని, మహిళలను శక్తివంతం చేస్తే సమాజం బలపడుతుందని, దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహిళల ఆర్థిక సాధికారత, సంక్షేమం, స్వయం ఉపాధి, సామాజిక భద్రత లక్ష్యంగా తమ ప్రభుత్వం సమగ్ర కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం నుంచి కోట్ల రూపాయల బ్యాంకు రుణాల వరకు, స్వయం ఉపాధి నుంచి మహిళా వ్యాపార ప్రోత్సాహం వరకు, సంక్షేమం నుంచి స్వావలంబన వరకు అనేక పథకాల ద్వారా మహిళల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకొస్తున్నామన్నారు. రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ చెప్పినట్లు ఒక సమాజం అభివృద్ధి స్థాయిని తెలుసుకోవాలంటే ఆ సమాజంలో మహిళల స్థితిని చూడాలని మంత్రి సీతక్క గుర్తు చేశారు. మహిళలకు గౌరవం ఇవ్వడం అనేది ఉపకారం కాదని, అది సమాజం నిర్వర్తించాల్సిన బాధ్యత అని అన్నారు. మహిళల అభివృద్ధి లేకుండా సమాజ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. మహిళలు ఎదిగితే దేశం ఎదుగుతుంది అనే భావనతో ప్రతి ఒక్కరూ ‘గివ్ టు గెయిన’ అనే ఆలోచనను ఆచరణలో పెట్టాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





