– అది హ్యాం కాదు స్కాం
-దీనిపై నిత్యం పోరాడుతూనే ఉంటాం
-అవినీతిలో మునిగితేలుతున్న మంత్రులు
-మాజీ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి ఆరోపణలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25:ఇందిరమ్మ రాజ్యంలో రోజుకో అవినీతి, పూటకో కుంభకోణం బయటపడుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఓ పని టెండర్‌కు సంబంధించి మంత్రుల మధ్య వివాదం తలెత్తితే సీఎం ఇద్దరినీ కూర్చోబెట్టి వాటాలు పంచారని ధ్వజమెత్తారు. డెక్కన్ సిమెంట్స్ కంపెనీ వారిని గన్ పెట్టి బెదిరించారని, ఇందులో సీఎం పాత్ర ఉందని మంత్రి కూతురే ఆరోపించారన్నారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, డాక్టర్ కే.సంజయ్, పార్టీ నేతలు ఆయాచితం శ్రీధర్, కే.కిషోర్ గౌడ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మద్యం సీసాల హోలోగ్రాం కుంభకోణంలో సీఎం, మంత్రి మధ్య తలెత్తిన వివాదంలో అధికారిని బలి చేశారని మండిపడ్డారు. అవినీతి, ముడుపుల మీద మంత్రులు రోజూ కొట్లాడుకుంటున్నారని, ఇందిరమ్మ రాజ్యమంటే కుంభకోణాల నిలయం, అవినీతిమయంగా మారిందని అన్నారు. రూ.27 వేల కోట్లతో రోడ్లు వేయబోతున్నామని మంత్రులు చెప్పారని, ఇందులో వేల కోట్ల కుంభకోణం ఉందని ఆరోపించారు. హ్యామ్ కాదు.. అది ఒక పెద్ద స్కామ్ అని అభివర్ణించారు. రోడ్డు బాగుచేసే ముసుగులో దోపిడీకి రంగం సిద్ధమైందని, హైబ్రిడ్ ఆన్యుటీ మోడ్ (హ్యామ్) టెండర్లలో కిలోమీటరుకు 85 శాతం అంచనా వ్యయం పెంచారని, రూ.9 వేల కోట్లతో పూర్తయ్యే రోడ్లకు రూ.17 వేల కోట్లకు టెండర్లు పిలిచారని, ఇందులో రూ.8 వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. సీఆర్‌ఎఫ్ కింద కి.మీ కు రూ.కోటి 75 లక్షలు ఖర్చు అవుతుంది.. హ్యామ్ కింద ఇచ్చిన టెండర్లలో రూ.3కోట్ల 30 లక్షల వ్యయం అవుతుంది.. సీఆర్‌ఎఫ్ రోడ్ల పనుల టెండర్ల జీవో, హ్యామ్ జీవో కేవలం పది రోజుల తేడాలో వచ్చాయి. సీఆర్‌ఎఫ్ జీవోలో కి.మీ కు ఓ రేటు, హామ్ జీవోలో మరో రేటు ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. హ్యామ్ రోడ్ల టెండర్లు దక్కించుకున్న వారికి 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ రూ.17 వేల కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సులు ఎవరి జేబుల్లోకి వెళ్తాయో అందరికీ తెలుసునన్నారు. హ్యామ్ కింద కి.మీ రోడ్డుకు మెయింటెనెన్సుకు మరో రూ.2.5 కోట్లు కేటాయిస్తున్నరంటే కిలోమీటరుకు హామ్ కింద రూ.6 కోట్లు ఖర్చవుతుంది. 40 శాతం ప్రభుత్వం, 60 శాతం ప్రైవేటు సంస్థలు భరిస్తాయని అంటున్నారని, ప్రైవేటు సంస్థలు బ్యాంకుల నుంచి తెచ్చే అప్పులకు ప్రభుత్వమే వడ్డీ కట్టాల్సి ఉంటుందని, మొత్తంమీద హ్యామ్ మోడల్ ప్రజల మీద పెను భారం మోపేదిగా ఉందని వెల్లడించారు. ఈ టెండర్లను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు తక్షణమే జోక్యం చేసుకోవాలని, రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నాసీబీఐ దర్యాప్తు చేయించాలని కోరారు. దోచుకునే విషయంలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్ అయ్యింది. దిల్లీకి మాటిమాటికీ సీఎం వెళ్లేది తన అవినీతి నుంచి కాపాడుకునేందుకే. పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వరు కానీ హ్యామ్ కింద మొబిలైజేషన్ అడ్వాన్సులు ఎలా చేస్తారని నిలదీశారు. రూ.8 వేల కోట్ల ప్రజా ధనాన్ని లూటీ చేసేలా ఉన్న హామ్ రోడ్ల టెండర్లపై ప్రతి వేదిక మీద గొంతు ఎత్తుతాం అని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





